రిజిస్ట్రేషన్‌ జరగని టొయోటా వాహనాలపై దృష్టి

రాష్ట్రంలో ఇద్దరు టొయోటా డీలర్ల వద్ద కొనుగోలు చేసిన వాహనాలు ఎక్కడున్నాయి? వాటిని ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు? పన్ను చెల్లించారా? తదితర వివరాలు రాబట్టడంపై

Published : 24 Sep 2022 05:31 IST

27న రవాణా కార్యాలయాలకు రావాలని ఆదేశం

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఇద్దరు టొయోటా డీలర్ల వద్ద కొనుగోలు చేసిన వాహనాలు ఎక్కడున్నాయి? వాటిని ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు? పన్ను చెల్లించారా? తదితర వివరాలు రాబట్టడంపై రవాణాశాఖ దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆ ఇద్దరు డీలర్లూ తమ షోరూమ్‌లను మూసేయగా, టొయోటా కంపెనీ.. వారి డీలర్‌షిప్‌లను రద్దు చేసినట్లు జూన్‌లోనే ప్రకటించింది. దీంతో ఆ వాహనాల స్థితి తెలుసుకొని, వాటిపై తగిన నిర్ణయం తీసుకోవాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. 32 వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జరగలేదని అధికారులు గుర్తించారు. ఆయా వాహనదారులు సంబంధిత జిల్లా రవాణాశాఖ కార్యాలయాలకు 27న హాజరు కావాలని కోరినట్లు రవాణాశాఖ కమిషనర్‌ పి.సీతారామాంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ సమయంలో.. కొనుగోలుదారు, వాహనం, బీమా-ఫైనాన్స్‌, ఇన్వాయిస్‌ల వివరాలు, ఆయా పత్రాలు రవాణాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడింగ్‌తో పాటు వాహన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేస్తారు.  ఆ 32 వాహనాలు ఏ వివరాలు నమోదు చేయకుండా ఆగిపోయాయనే విషయం అధికారులు తెలుసుకోనున్నారు. 27న జిల్లా రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చే ఆయా వాహనదారుల వద్ద ఉన్న పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. అలాగే వారితో రవాణా కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి తగిన సూచనలు చేస్తారని అధికారులు తెలిపారు.

ఆరు చోట్ల కేసులు నమోదు
టొయోటా డీలర్లు అయిన రాధా మాధవ్‌ టొయోటా, లీలా కృష్ణ టొయోటాలు పలువురి వద్ద డబ్బు తీసుకొని కొంతకాలంగా వాహనాలు డెలివరీ ఇవ్వలేదు. మరికొందరికి వాహనాలు ఇచ్చినా వాటిని పూర్తిగా రిజిస్ట్రేషన్‌ చేయలేదు. అలాగే కొనుగోలుదారుల నుంచి మోటారు వాహన పన్ను వసూలు చేసినా, వాటిని రవాణాశాఖకు చెల్లించలేదు. ఇలా అనేక రకాల ఫిర్యాదులు నేపథ్యంలో.. ఆ ఇద్దరు డీలర్లపై విజయవాడలోని పటమట, పశ్చిమగోదావరిలోని భీమవరం, బాపట్ల జిల్లాలో నగరం, గుంటూరు జిల్లా నల్లపాడు తదితర స్టేషన్లలో ఆరు పోలీస్‌ కేసులు నమోదయ్యాయి. వీరి డీలర్‌షిప్పులు రద్దు చేస్తున్నట్లు జూన్‌లో పత్రికా ప్రకటనలో ద్వారా టొయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ అధికారికంగా ప్రకటన ఇవ్వగా, ఆ వివరాలు రవాణాశాఖకు మాత్రం తెలియజేయలేదు.  మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆ కంపెనీకి కూడా రవాణాశాఖ అధికారులు తాఖీదులు జారీచేశారు.  ఈ వాహనాలు ఎక్కడైనా రోడ్డుపై కనిపిస్తే సీజ్‌ చేయాలని ఇప్పటికే అన్ని జిల్లాల రవాణాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని