యువతే మన బలం

మన దేశ నిజమైన బలం యువతే. ప్రపంచ యువతలో అయిదో వంతు మన దేశంలోనే ఉన్నారు. అపారమైన ఈ మానవ వనరులకు సరైన శిక్షణ ఇస్తే.. దేశ ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది’ అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి

Updated : 25 Sep 2022 05:55 IST

వారికి సరైన నైపుణ్య శిక్షణ అవసరం

పాశ్చాత్య దేశాల లోటును పూడ్చగలిగేది మనమే

వ్యాపారవేత్తలు దోపిడీకి దూరంగా ఉండాలి

సంపద సృష్టించాలి.. పంచాలి..

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ఆదర్శం

ఐఎస్‌బీ సదస్సులో జస్టిస్‌ ఎన్‌వీ రమణ

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాయదుర్గం: ‘మన దేశ నిజమైన బలం యువతే. ప్రపంచ యువతలో అయిదో వంతు మన దేశంలోనే ఉన్నారు. అపారమైన ఈ మానవ వనరులకు సరైన శిక్షణ ఇస్తే.. దేశ ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది’ అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. పాశ్చాత్య దేశాలు నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని, ఆ లోటును పూడ్చడం భారత్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో శనివారం నిర్వహించిన ‘లీడర్‌షిప్‌ సమ్మిట్‌-22’ను జస్టిస్‌ రమణ ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మన సమాజాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిష్కరించేందుకు అన్ని రంగాల నుంచీ సహకారం అవసరం. చట్టం, సైన్స్‌, వ్యాపారం ఏదైనా కావచ్చు. విడివిడిగా పనిచేస్తే సామాజిక వృద్ధి సాధ్యం కాదు. వ్యాపార ప్రపంచం అంటే సంపదను సృష్టించే మార్గమే కాదు. ఆర్థిక స్వేచ్ఛకు ఆలంబన. వ్యాపార ప్రపంచంలో లాభాల కోసం పనిచేసేటప్పుడు ఒక గీతను గీసుకోవాలి. దోపిడీ అనే దానికి దూరంగా ఉండాలి’ అని సూచించారు.

సంపద పోగుపడితే ఘర్షణలే

బిజినెస్‌ స్కూళ్లలో చదువుకుంటున్న వారికీ, వ్యాపారవేత్తలకూ భారత రాజ్యాంగం, చట్టాలపై అవగాహన అవసరమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ తెలిపారు. ‘మీరు వ్యాపారవేత్తలుగా, నాయకులుగా మారేందుకు శిక్షణ పొందారు. సంపదను సృష్టిస్తున్నప్పుడు, దాన్ని దామాషా పద్ధతిలో పంపిణీ చేసే నమూనాలను అనుసరించాలి. కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపడటం సమాజంలో ఘర్షణకు తావిస్తుంది. గ్రామీణ, కుటీర పరిశ్రమల పునరుద్ధరణ, స్థానిక పరిశ్రమల పటిష్ఠతకు ఉన్న అవకాశాలను పరిశీలించాలి. రిస్కు తీసుకునేందుకు, ఆవిష్కరణలు చేసేందుకు భయపడకండి’ అని విద్యార్థులకు సూచించారు. మేనేజ్‌మెంట్‌ విద్యను రెండేళ్ల వ్యవధికి పెంచాలని ఐఎస్‌బీ  యాజమాన్యానికి సూచించారు.

సీఎం కేసీఆర్‌ కృషి బాగు

‘పెట్టుబడుల ఆకర్షణ, సంపద సృష్టి, ఉపాధి కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. 1990, 2000వ దశకం ప్రారంభంలో అమల్లోకి వచ్చిన సరళీకృత విధాన పునాదులపై అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రభుత్వాల పనితీరు ఇలాగే ఉండాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమ ముందు ప్రభుత్వాల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవస్థలు, విధానాలను మెరుగుపర్చేందుకు కృషిచేయాలి. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంటే ఎవరూ ఎక్కువగా అర్థం చేసుకోలేరు. రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం చేస్తున్న కృషికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు.

నేనూ భాగస్వామినే

‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు!’... అనే మహాకవి శ్రీశ్రీ మాటలను ఉటంకిస్తూ.. హైదరాబాద్‌లో నల్సార్‌, ఐఎస్‌బీ, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌- మధ్యవర్తిత్వ కేంద్రం.. ఈ మూడు సంస్థల ఏర్పాటులో తాను భాగస్వామినైనందుకు గర్వపడుతున్నానన్నారు. ‘ఐఎస్‌బీ ఏర్పాటే అనేక సవాళ్లతో ప్రారంభమైంది. ప్రాజెక్టు కోసం భూసేకరణను ప్రశ్నిస్తూ అప్పటి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలైనప్పుడు అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా ఉన్నాను. న్యాయపోరాటానికి వ్యూహరచన చేయడంలో పాలుపంచుకున్నాను. చివరకు ప్రజా ప్రయోజనాల కోసం జరిగిన భూమి కేటాయింపును హైకోర్టు సమర్థించింది. జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి ఈ విషయంలో తీర్పు ఇచ్చారు. ఇందులో చట్టం, సాహిత్యం, సంస్కృతి, కవిత్వం అన్నీ ఉన్నాయి. అందంగా రాసిన ఈ తీర్పును అధ్యయనం చేయాలని సలహా ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. తీర్పు ప్రతిని అందరికీ అందించాలని ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్లకు సూచించారు.

చంద్రబాబు ఫొటో లేదే!

‘20 ఏళ్ల కిందట ఐఎస్‌బీ ఏర్పాటులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర ఎంతో ఉంది. ఆయన కృషి లేకపోతే ఈ బిజినెస్‌ స్కూలు ఇప్పుడు ఇక్కడ ఉండేది కాదు. దీని స్థాపనకు సహకరించిన వ్యాపారవేత్తలు, ఇతరుల చిత్రాలు గ్యాలరీలో ఉన్నాయి. కానీ, అక్కడ తప్పక ఉండాల్సిన చంద్రబాబు చిత్రం దురదృష్టవశాత్తూ కనిపించలేదు’ అని వ్యాఖ్యానించారు.

ఆ మూడింటిపై దృష్టిపెట్టా

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న స్వల్ప కాలంలో ఖాళీల భర్తీ, మౌలిక వసతుల ఏర్పాటు, సాంకేతికత కల్పన అనే మూడింటిపైనే ఎక్కువగా దృష్టి సారించానని జస్టిస్‌ రమణ తెలిపారు. సుప్రీంకోర్టులో 11 మంది, హైకోర్టుల్లో 233 మంది న్యాయమూర్తులను నియమించామన్నారు. ‘నేను బాధ్యతలు స్వీకరించే నాటికి కొవిడ్‌ రెండో దశ వల్ల కోర్టు కార్యకలాపాలకు అవాంతరం కలిగింది. 16 నెలల్లో కేవలం 50 రోజులు మాత్రమే నేరుగా కోర్టులో కూర్చొని వాదోపవాదాలు వినగలిగాను. ఆర్థిక, నియామకాల విషయంలో ప్రభుత్వ సహకారం అవసరం. ప్రధాన న్యాయమూర్తి పక్షపాతం లేని, స్వచ్ఛమైన, సమర్థుడైన పరిపాలకుడిగా, దూరదృష్టి గల నాయకుడిగా ఉత్తమ సేవందించేందుకు కృషి చేస్తాడు’ అని జస్టిస్‌ రమణ వివరించారు.


అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి: స్మితా సభర్వాల్‌

ఈ సదస్సులో ఇంకా పలువురు ప్రముఖులు ప్రసంగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ప్రభుత్వ పథకాలతో రూపురేఖలు మారాయని అన్నారు. ‘ఇతరుల కంటే విభిన్నంగా ఉండాలంటే కష్టపడాలి. చేసే పనిని ఇష్టపడినపుడే ఉత్తమంగా చేయగలమ’ని మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. అత్యధిక మిలియనీర్లను తయారు చేసిన ఘనత మైక్రోసాఫ్ట్‌ సంస్థకే దక్కుతుందని జాతీయ క్రికెట్‌ జట్టు మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ తెలిపారు. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేదార్‌ లేలె, సినీనటుడు ఆర్‌.మాధవన్‌ తదితరులు మాట్లాడారు. ప్రముఖ వీణా కళాకారిణి డా.జయంతి కుమారేశ్‌ సంగీత కచేరి విశేషంగా అలరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని