త్వరలో వీఐపీ దర్శన సమయంలో మార్పు

తిరుమలలో వీఐపీ దర్శనాలతోపాటు వసతి గదుల కేటాయింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల కొండపై

Updated : 25 Sep 2022 08:56 IST

తిరుపతిలోనే వసతి గదుల కేటాయింపు

సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం

తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడి

ఈనాడు, తిరుపతి: తిరుమలలో వీఐపీ దర్శనాలతోపాటు వసతి గదుల కేటాయింపులో సమూల మార్పులు చేయనున్నట్లు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుమల కొండపై రద్దీని నియంత్రించేందుకు ప్రయోగాత్మకంగా పలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 9.30 గంటల వరకు కొనసాగుతున్నాయని చెప్పారు. బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం పూర్తయిన తర్వాత వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయని వెల్లడించారు. వీఐపీ బ్రేక్‌తోపాటు ప్రొటోకాల్‌, శ్రీవాణి ద్వారా శ్రీవారిని దర్శించుకునే వారినీ ఇదే సమయంలో అనుమతిస్తామన్నారు. రాత్రి సమయంలో కంపార్టుమెంట్లలో ఉండే సర్వదర్శన భక్తుల ఇబ్బందులు తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం తితిదే ఈవో ధర్మారెడ్డి, సభ్యులు పోకల అశోక్‌కుమార్‌, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌లతో కలిసి ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడారు.

‘ప్రస్తుతం వీఐపీ, శ్రీవాణి దర్శనాలకు ఇచ్చే కోటాను తగ్గించే అంశంలో సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నాం.
* తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు కొవిడ్‌కు ముందు ఇచ్చిన తరహాలోనే టోకెన్లు ఇస్తాం. పెరటాసి మాసం పూర్తయిన వెంటనే తిరుపతిలో రోజుకు 20వేల వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తాం. అవసరమైతే ఆ సంఖ్యను పెంచుతాం. టోకెన్లు లేనివారు నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

* తిరుమలలోని వసతి గదులను త్వరలో తిరుపతిలో కేటాయించే ప్రక్రియ ప్రారంభించనున్నాం. ఒకవేళ కొండపై గదులు లభించకుంటే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసంలో ఉండవచ్చు. తితిదే వసతి గృహాలునిండిపోతే ప్రైవేటులో ఉండేందుకు ఆస్కారం ఉంది. గది అవసరం లేదనుకుంటే నేరుగా తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చు. సామాన్య భక్తులకు పీఏసీ కేంద్రాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

* ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటల ద్వారా శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం. మరో 12 రకాల ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రైతుసాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం చేసుకున్నాం. రైతులకు సాధారణ ధర కంటే 15 నుంచి 20 శాతం అధికంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.

* తిరుమలలో సామాన్య భక్తులకు వసతి కల్పించేందుకు రూ.95 కోట్ల వ్యయంతో కొత్తగా పీఏసీ-5 వసతి కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించాం. ఇది పూర్తయితే 10వేల మందికి వసతి కల్పించవచ్చు.


శ్రీవారి ఆస్తుల విలువ రూ.85,705 కోట్లు

శ్రీవారి ఆస్తులపై ఎప్పటికప్పుడు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం 960 ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు. 1974- 2014 వరకు సుమారు 114 ఆస్తులను విక్రయించారు. ఆ తర్వాత ఒక్కటి కూడా అమ్మలేదు. ఇదే తరహాలో ఏటా శ్వేతపత్రం విడుదల చేస్తాం’ అని వై.వి.సుబ్బారెడ్డి వివరించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని