అమరావతి నినాదాలతో దద్దరిల్లిన గుడివాడ

పోలీసుల మోహరింపు... రహదారుల దిగ్బంధనం... ఖాకీల కవాతు... అడుగడుగునా ఆంక్షలు ఒక వైపు... జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే

Published : 25 Sep 2022 07:24 IST

రాజధాని రైతుల మహా పాదయాత్రలో ఉత్కంఠ

పోలీసులు ఆంక్షలు విధించినా... భారీగా తరలివచ్చిన మద్దతుదారులు

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, నెహ్రూచౌక్‌, గ్రామీణం(గుడివాడ): పోలీసుల మోహరింపు... రహదారుల దిగ్బంధనం... ఖాకీల కవాతు... అడుగడుగునా ఆంక్షలు ఒక వైపు... జై అమరావతి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదాలు... రైతన్నల పచ్చ జెండాల రెపరెపలు... పిల్లలు.. పెద్దల నీరాజనాలు మరోవైపు.... అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పోలీసులు ఆంక్షలు విధించినా... పలు ప్రాంతాల నుంచి భారీగా కర్షకులు, మహిళలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మహా పాదయాత్ర 13వ రోజు 16 కిలోమీటర్లు సాగి విజయవంతంగా ముగిసింది.

రాజధాని రైతులు గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం ఉదయం గుడ్లవల్లేరు మీదుగా గుడివాడకు చేరుకోవాల్సింది. ఈ నియోజకవర్గానికి వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వైకాపా కార్యకర్తలకు, అమరావతి రైతులకు మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు పోలీసులను హెచ్చరించాయి. సంఘీభావం ప్రకటించాలని వివిధ నియోజకవర్గాలకు చెందిన తెదేపా నాయకులు తలపెట్టారు. శుక్రవారం రాత్రి పలువురు తెదేపా నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. విజయవాడ, పెనమలూరు వైపు నుంచి తెదేపా, ప్రజాసంఘాల నాయకులు రాకుండా కంకిపాడు మండలం దావులూరు టోల్‌ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నాయకుల వాహనాలను వెనక్కి మళ్లించారు. మచిలీపట్నం జాతీయ రహదారిపై పామర్రు -గుడివాడ జంక్షన్‌ దగ్గర వాహనాన్ని అడ్డుకొని మళ్లించారు. ఏలూరు వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. మధ్యాహ్నం దాకా ఎలాంటి వాహనాలను గుడివాడ పట్టణంలోకి అనుమతించలేదు. దాదాపు 500 మంది పోలీసులు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచి గుడివాడకు తరలి వచ్చి వీధుల్లో కవాతు నిర్వహించారు. అప్పటికే పాదయాత్ర గుడ్లవల్లేరు, అంగలూరు గ్రామాలను దాటి బొమ్మలూరుకు చేరుకుంది. బొమ్మలూరు వద్ద మధ్యాహ్న భోజనానికి కొంత విరామం ఇచ్చారు. ఈ లోగా వివిధ మార్గాల నుంచి ఒక్కొక్కరిగా వందలు, వేలుగా జనం అక్కడకు చేరుకున్నారు. ప్రజా సంఘాలతో పాటు తెదేపా, జనసేన, వామపక్షపార్టీలు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చాయి. జనం విపరీతంగా గుమిగూడటంతో డీఎస్పీ సత్యానందం, అమరావతి పరిరక్షణ సమితి, తెదేపా నాయకులతో పలుమార్లు సంప్రదింపులు జరిపారు. గుడివాడలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉందని, హైకోర్టు అనుమతి ఇచ్చిన దాని కంటే ఎక్కువమందిని అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. పోలీసులు భారీగా మోహరించి రోప్‌ పార్టీతో పాదయాత్ర సాగేలా పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ పట్టణం, నెహ్రూ చౌక్‌ మీదుగా ఏలూరు రోడ్డుకు చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అమరావతి నినాదాలతో గుడివాడ పట్టణం దద్దరిల్లింది.

తొడకొట్టి సవాల్‌ విసిరిన నేతలు...  
గుడివాడలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా నేతలు, అమరావతి రైతులు పలువురు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సవాల్‌ విసిరారు. దమ్ముంటే బయటకు రావాలంటూ వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అంబేడ్కర్‌ సెంటర్‌ ప్రాంతంలో కొద్దిసేపు పాదయాత్ర ఆగింది. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న కొడాలి నానిని చెప్పు దెబ్బలతో సత్కరించాలంటూ ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు నినాదాలు చేశారు. బూటు కాలుతో కొడతానని హెచ్చరించారు. జగన్‌, నానికి వ్యతిరేకంగా తొడకొట్టి సవాల్‌ విసిరారు. అమరావతికి చెందిన ఓ మహిళా రైతు కూడా తొడకొట్టి సవాల్‌ చేశారు. గుడివాడ పట్టణానికి వచ్చామని నక్కలా దాక్కున్న నాని బయటకు రావాలంటూ తెదేపా సీనియర్‌ నేత ఆనంద్‌బాబు ప్రసంగించారు. కొడాలి నానికి చెందిన సినిమా థియేటర్‌ నుంచి కొంతమంది అనుచరులు పాదయాత్ర వైపు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నేతలకు సర్దిచెప్పి పాదయాత్ర ముందుకు సాగేలా చూశారు. గుడివాడలో మహా పాదయాత్ర సందర్భంగా పోలీసులు, డప్పు కళాకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలో కళాకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కళాకారులు కొద్దిసేపు నిరసనకు దిగారు. గుడివాడ సెంటర్‌లో తనను పోలీసు బలగాలు ఆపుతున్నా ఆగకుండా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బైక్‌పై వెళ్లి అమరావతి రైతుల పాదయాత్రను చేరుకున్నారు. గుడ్లవల్లేరు వద్ద తెదేపా నేతలు పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీ... స్వామి వారి రథానికి పూజలు నిర్వహించి రూ.5 లక్షల చెక్కును విరాళంగా అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావుకు అందించారు.

పలువురి సంఘీభావం..
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రలో పలువురు నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన తెదేపా నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు... మహాపాదయాత్రకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అమరావతి దళిత జేఏసీ తరపున పలువురు నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కృష్ణా జిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో పాటు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన పలువురు నేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని