70వేల మంది ఉద్యోగులు ఉసూరు

పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులు అందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 70 వేల మంది ఉద్యోగులు

Updated : 25 Sep 2022 03:59 IST

పదవీ విరమణ వయసు పెంచకపోవడంపై ఆవేదన

62 ఏళ్లు తమకూ వర్తింపజేయాలని ప్రభుత్వ రంగ, కార్పొరేషన్ల ఉద్యోగుల డిమాండ్‌

ఈనాడు, అమరావతి: పదవీ విరమణ వయసు పెంపు ఉద్యోగులు అందరికీ వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేయడంతో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 70 వేల మంది ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి పదవీ విరమణ వయసు పెంపు వర్తించదని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఈ నెల 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఎవరికి పదవీ విరమణ వయసు పెంపు వర్తిస్తుంది? ఎవరికి వర్తించదో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. దీనిపై బాధిత ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ విషయం స్పష్టం చేయడానికి 9 నెలల సమయం అవసరమా?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విధానం? వారితో సమంగా పని చేస్తున్న తమకు మరో విధానమా అని మండిపడుతున్నారు. తమకు కూడా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోను సవరణ ఉత్తర్వులు ఇస్తుందని కొన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా ఎప్పుడూ ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చేస్తే తమకు వచ్చే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని, ముందు తొలగించి- తర్వాత ఆ వెసులుబాటు కల్పిస్తే తమ వల్లే ఇది సాధ్యమయిందనే క్రెడిట్‌ పొందేందుకు ఇలా చేస్తున్నారనే అనుమానాలు కొందరు వ్యక్తంచేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకుంది. 2022 జనవరి ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ అనుబంధంగా అనేక ఇతర సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులూ ఉన్నారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వీరికి జీతాలు, భత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కంపెనీ చట్టం కింద ఏర్పడ్డ కార్పొరేషన్లు, సొసైటీ చట్టం కింద ఏర్పడ్డ గురుకులాలు, ఎయిడెడ్‌ స్కూళ్లు, గ్రంథాలయాలు, అనేక యూనివర్సిటీల్లో పనిచేసే బోధనేతర సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకోరు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి సంబంధించి మళ్లీ ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం 60 నుంచి 62 ఏళ్ల వయసుకు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినా.. ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉన్న ఉద్యోగుల విషయంలో ముందు స్పష్టత ఇవ్వలేదు. తొమ్మిది నెలల తర్వాత ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు మినహా మిగిలిన వారికి ఇది వర్తించబోదని తేల్చేసింది.

కొన్ని బోర్డుల్లో తీర్మానాలు...
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోయినా బీసీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొందరు 60 ఏళ్లు నిండినా ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. జీతాలు పొందుతున్నారు. మరికొన్ని చోట్ల వారి బోర్డుల్లో తీర్మానాలు ఆమోదించి కొనసాగుతున్న వారూ ఉన్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లోనే ఈ విషయం పేర్కొంది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా 62 ఏళ్ల పదవీ విరమణ అమలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొంది.
- ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా తమకు కూడా పదవీ విరమణ వయసు పెంచాలని ఆయా ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ప్రభుత్వపెద్దలను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో అనేక పర్యాయాలు మాట్లాడారు. ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఉపసంహరించుకుని తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

పదవీ విరమణలో గందరగోళం
కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు తదితరాల్లో పని చేసే ఉద్యోగుల్లో 2022 జనవరి తర్వాత 60 ఏళ్లు నిండిన వారూ ఉన్నారు. వారిలో కొందరు పదవీ విరమణ చేయగా మరికొందరు అలాగే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కొందరు న్యాయస్థానానికి వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు ఉద్యోగాల్లో కొనసాగవచ్చని- ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని ఆయా ఉద్యోగుల విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో కొందరు జీతాలు తీసుకోకుండానే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. రేపో, మాపో పదవీ విరమణ వయసు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోతుందా, జీతాల బకాయిలు రాకపోతాయా అన్న ఉద్దేశంతో వారు అలాగే కొనసాగుతున్నారు.


ఎప్పటి నుంచో మా డిమాండ్‌ వినిపిస్తున్నాం

మాకు కూడా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని 9 నెలల నుంచి డిమాండ్‌ చేస్తున్నాం. ప్రభుత్వం పీఆర్‌సీపై చర్చలు జరిపిన రోజుల్లో కూడా ఈ డిమాండ్‌ ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి వినిపించాం. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చినా మేం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం.

- డి.మధుసూదన్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గురుకుల విద్యాలయాల ఉపాధ్యాయ సంఘం


ఇంకా ప్రయత్నాలు మానలేదు

పదవీ విరమణ వయసుపై ఇప్పుడు ఇచ్చిన ఉత్తర్వులు సవరించి ఇవ్వాలని కోరుతున్నాం. మంత్రులను కలిసి ఈ విషయాన్ని వివరించాం. సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిసింది. ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వులు సవరించి తాజాగా ఆదేశాలు ఇస్తారనే సమాచారం మాకు ఉంది.

- వెంకటప్పరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, యూనివర్సిటీల బోధనేతర ఉద్యోగుల సంఘం


మేం ముందు నుంచి డిమాండ్‌ చేస్తున్నాం

కార్పొరేషన్లు, సొసైటీలు, గురుకులాలు, యూనివర్సిటీ బోధనేతర సిబ్బందికి కూడా 62 ఏళ్లకు పదవీ విరమణ పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. అడిగి, అడిగి అలిసిపోయాం. ఇప్పటికీ మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి సాధిస్తామనే నమ్మకం ఉంది.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని