ప్రభుత్వ బడుల్లో నాణ్యత డొల్ల

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. ప్రథమ్‌ సంస్థతో రూపొందించిన ఆంగ్లం, గణితం,

Updated : 25 Sep 2022 06:45 IST

తెలుగులో పేరాను చదవలేకపోయిన 6, 7, 8 తరగతుల్లోని 41.58% మంది

ప్రభుత్వం నిర్వహించిన బేస్‌లైన్‌ పరీక్షతో విద్యార్థుల సామర్థ్యాలు బహిర్గతం

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఇటీవల బేస్‌లైన్‌ పరీక్ష నిర్వహించింది. ప్రథమ్‌ సంస్థతో రూపొందించిన ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలతో మౌఖిక, రాతపరీక్షలు నిర్వహించింది. 2-10 తరగతులకు ఒకే మౌఖిక పరీక్ష నిర్వహించింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్థాయిలను నిర్ణయించింది. తెలుగులో పేరా లేదా కథ, ఆంగ్లంలో పదాలు లేదా వాక్యాలు చదివినవారికి, గణితంలో 99 కన్నా ఎక్కువ విలువ సంఖ్యలను గుర్తించిన వారికి రాతపరీక్ష నిర్వహించింది. 2-5 తరగతులకు గణితంలో రాతపరీక్ష లేదు. తెలుగు, ఆంగ్లంలో 2-5 తరగతులకు ఒక ప్రశ్నపత్రం, మూడు సబ్జెక్టుల్లో 6-10 తరగతులకు మరో ప్రశ్నపత్రంతో రాత పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలను పరిశీలిస్తే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దారుణంగా ఉన్నట్లు అర్థమవుతోంది. 9,10 తరగతుల్లో ఆంగ్లవాక్యం చదవలేనివారు 46.92% ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ రూ.20కోట్ల వ్యయం చేసింది.

రెండంకెల తీసివేతలు కష్టమే..
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం మూడోతరగతి పూర్తయ్యేసరికి తెలుగులో ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం రావాలి. ఆంగ్లంలో చిన్న పేరాను చదివి అర్థం చేసుకోవాలి. గణితంలో 999 వరకు అంకెలను గుర్తించడం, రెండు, మూడు అంకెలతో ఉన్న కూడికలు, తీసివేతలు రావాలి. కానీ ఎనిమిదో తరగతికి వచ్చినా విద్యార్థుల్లో ఈ సామర్థ్యాలు ఉండటం లేదు.

* గణితంలో 99కన్నా ఎక్కువ విలువగల సంఖ్యలను గుర్తించలేని వారు నాలుగు, ఐదు తరగతుల్లో 38.04% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 22.64% ఉన్నారు.
* రెండంకెల తీసివేతలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 40.69% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 24.13% ఉన్నారు.

* ఒక అంకెతో రెండు అంకెలను భాగించాల్సిన లెక్కలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 82.37% ఉండగా.. 6,7,8 తరగతుల వారు 58.65% ఉన్నారు.
* ఆంగ్లంలో చిన్నవాక్యం చదవలేని వారు 4, 5 తరగతుల్లో 83.9%, 6,7,8 తరగతుల్లో 65.24% ఉన్నారు.


‘మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాము. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది’ ఇలా తెలుగులో ఇచ్చిన చిన్నపేరాను సైతం ప్రభుత్వ బడుల్లోని నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు 65.04% మంది తప్పులు లేకుండా చదవలేకపోయారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతులవారిలోనూ 41.58% చదవలేదు.


బెండపూడి ఎక్కడ?
కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వపాఠశాల విద్యార్థులు ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ బెండపూడిలోనూ ఆంగ్లంలో కొందరి పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ పాఠశాలలో 511మంది ఉండగా.. వీరిలో 485 మంది బేస్‌లైన్‌ పరీక్షకు హాజరయ్యారు.

* 6,7,8 తరగతులలో 290మందికి 58.27% ఆంగ్లంలో చిన్నవాక్యాన్ని చదవలేకపోయారు.
* 9,10 తరగతుల్లో 195మంది విద్యార్థులుండగా.. వారిలో 45.64% ఆంగ్లంలో వాక్యం చదవలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని