3 నెలల్లో భవన నిర్మాణాలు పూర్తి చేయాల్సిందే

గ్రామాల్లో రెండున్నరేళ్ల కిందట ప్రారంభించిన 34,283 ప్రభుత్వ భవన నిర్మాణాల్లో ఇప్పటివరకు పూర్తయినవి 35.20 శాతమే. మిగిలిన 64.80% భవనాలను 3 నెలల్లో

Published : 25 Sep 2022 05:25 IST

పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల మెడపై కత్తి

రూ.339.44 కోట్ల బిల్లులు ఇప్పటికే పెండింగ్‌

ఈనాడు, అమరావతి: గ్రామాల్లో రెండున్నరేళ్ల కిందట ప్రారంభించిన 34,283 ప్రభుత్వ భవన నిర్మాణాల్లో ఇప్పటివరకు పూర్తయినవి 35.20 శాతమే. మిగిలిన 64.80% భవనాలను 3 నెలల్లో పూర్తిచేయాల్సిందేనని పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల మెడపై ప్రభుత్వం కత్తి పెడుతోంది. పూర్తయిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తారా? అంటే ఆ ఒక్కటీ అడగొద్దని అంటోంది. నిధులున్నపుడే చెల్లిస్తామంటోంది. ఇప్పటికే చేసిన పనులకు రూ.339.44 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో రూ.88.56 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. అయినా భవన నిర్మాణాలు డిసెంబరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారుల నుంచి ఇంజినీర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామసచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ ఆరోగ్య కేంద్రాలు, డిజిటల్‌ గ్రంథాలయాలు, పాలశీతలీకరణ కేంద్రాల కోసం రూ.8,905.46 కోట్ల అంచనాలతో ప్రారంభించిన 34,283 భవన నిర్మాణాల్లో ఇప్పటివరకు 12,069 పూర్తయ్యాయి. ఉపాధి పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద పనులు ప్రారంభించారు. తొలినుంచి బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొన్నాళ్లపాటు పనులు పూర్తిగా నిలిచాయి. అన్ని చోట్లా మళ్లీ పనులు ప్రారంభించాక ఇప్పటికీ రూ.339.44 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. 2019-20, 2020-21 స్టాండర్డ్‌ ఆఫ్‌ షెడ్యూల్‌ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం భవన నిర్మాణాలకు అంచనాలు వేశారు. రెండేళ్లలో భవన నిర్మాణ సామగ్రి భారీగా పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని గ్రామ పంచాయతీల తరఫున పనులు చేస్తున్న ఉపగుత్తేదారులు ఏడాదిగా గగ్గోలు పెడుతున్నారు. వీరిలో అత్యధికులు అధికార వైకాపాకు చెందినవారే ఉన్నారు. కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం అంచనాలు సవరించాలన్న విజ్ఞప్తులపైనా ఆరోగ్య కేంద్ర భవనాల పనుల వరకే అంచనాలు సవరించారు. మిగతా భవన నిర్మాణాలు పాత రేట్ల ప్రకారం పూర్తి చేసేందుకు ఉపగుత్తేదారులు విముఖత చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణంలో ఉన్నవి డిసెంబరులోగా పూర్తి చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించడంతో ఇంజినీర్లకు దిక్కుతోచడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని