యోగాకు యోగం లేదా?

రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య కేంద్రాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడంలేదు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించలేదు. దీంతో కొన్నిచోట్ల

Published : 25 Sep 2022 05:50 IST

ప్రకృతి వైద్య కేంద్రాల ఏర్పాటు యోచనకు గండి

కొన్నిచోట్ల నిర్మాణం పూర్తయినా సాగని పనులు

వైద్యులు, సిబ్బంది నియామకం లేక నిష్ప్రయోజనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్య కేంద్రాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడంలేదు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించలేదు. దీంతో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తయినా వాటి ద్వారా ప్రజలు యోగా శిక్షణ, ప్రకృతి వైద్యాన్ని పొందలేకపోతున్నారు. ఈ ఏడాది మార్చిలో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని అప్పట్లో మంత్రి ఒకరు స్వయంగా ప్రకటించినప్పటికీ.. తదుపరి చర్యల్లేవు. 2016లో ఈ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రతి జిల్లాలో రెండేసి చొప్పున కేంద్రాల ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటి నిర్మాణాలకు రూ. 7 కోట్ల వ్యయానికి పరిపాలనాపరమైన ఉత్తర్వులు 2017 జులైలో వెలువడ్డాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, టెక్కలి, విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలో మార్కాపురం, కందుకూరు, అనంతపురం జిల్లాలో గుంతకల్‌, ఉరవకొండ, చిత్తూరు జిల్లాలో కుప్పం, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కడప జిల్లాలో రాజంపేట, పుల్లంపేట, ఇతర జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం 26 కేంద్రాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సుమారు 800 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నెలకొల్పాలనేది ప్రణాళిక. 10 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

వెనక్కుపోయిన నిధులు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో రూ. 20 లక్షల వ్యయంతో యోగా- నేచురోపతి డిస్పెన్సరీ భవన నిర్మాణానికి అప్పటి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప 2016 జులై 7న శంకుస్థాపన చేశారు. ఈ పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మంజూరైన నిధులు వెనక్కి మళ్లిపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు. అలాగే అప్పటి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరులో డిస్పెన్సరీ కోసం స్థలం గుర్తించినా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ పునాది కూడా పడలేదు. నిడదవోలులో రూ. 20 లక్షలతో భవనం నిర్మించారు. ఆరు నెలల కిందట వరకు నిరుపయోగంగా ఉన్న ఈ భవనంలో ఆయుష్‌ అధికారులు ఓ వైద్యుడిని అందుబాటులో ఉంచి సేవలు అందిస్తున్నారు.

పోస్టుల భర్తీ ఎప్పుడు?
ఈ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో ఒక వైద్యుడు, మేల్‌, ఫీమెల్‌ థెరపిస్ట్‌, యోగా ట్రైనరును నియమించాలి. కొద్దికాలం కిందట ఈ పోస్టుల భర్తీకి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కానీ వాటి భర్తీపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. దీనివల్ల నిర్మాణాలు పూర్తయిన ఈ కేంద్రాల వల్ల కూడా ఉపయోగం లేకుండాపోయింది. పోస్టుల భర్తీ జరిగితే అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. నియామకాలు జరగక కేంద్రాల నిర్వహణ మూలపడింది. అర్హులైన వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది ఉన్నా.. నియామకాలు జరపనందున ఈ కేంద్రాలు ఉన్నా.. లేనట్లయింది. దీంతో పలు భవనాలను ఆయుష్‌లోనే ఇతర అవసరాలకు వాడుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని