లాజిస్టిక్‌ పార్కుకు స్థలం ఎక్కడ?

విజయవాడకు సమీపంలో కేంద్రం నిర్మించనున్న మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు (ఎంఎంఎల్‌పీ) భూముల కేటాయింపు కొలిక్కి రావడంలేదు. కేంద్రం ఒకచోట భూములడిగితే

Updated : 25 Sep 2022 06:59 IST

100 ఎకరాలపై కుదరని ఏకాభిప్రాయం

మంగళగిరి సమీపంలో కోరుతున్న కేంద్రం

వేరొకచోట ప్రతిపాదిస్తున్న పురపాలకశాఖ

ఈనాడు, అమరావతి: విజయవాడకు సమీపంలో కేంద్రం నిర్మించనున్న మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు (ఎంఎంఎల్‌పీ) భూముల కేటాయింపు కొలిక్కి రావడంలేదు. కేంద్రం ఒకచోట భూములడిగితే పురపాలకశాఖ వేరొకచోట ఇస్తామని చెబుతోంది. విజయవాడకు తూర్పువైపున నిర్మించనున్న 4 వరుసల బైపాస్‌లో భూసేకరణ భారాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. దీనికి ప్రత్యామ్నాయంగా లాజిస్టిక్‌ పార్కుకు 100 ఎకరాలు కేటాయించాలని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారులశాఖ (మోర్త్‌) కోరింది. విజయవాడకు చుట్టుపక్కల జాతీయ రహదారికి సమీపంలో ఈ భూములు కావాలని తెలిపింది. అంత ప్రభుత్వ భూమి ఒకేచోట లేకపోవడంతో చివరకు సీఆర్‌డీఏలో 100 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఆర్‌డీఏలో కాలుష్య రహిత పరిశ్రమల కోసం ఎంపిక చేసిన దాంట్లో కేటాయించాలని భావించారు. ఇందులో మంగళగిరి రైల్వే స్టేషన్‌కు సమీపంలో భూములు ఇవ్వాలని కేంద్రం కోరుతోంది. లాజిస్టిక్‌ పార్క్‌లో గిడ్డంగులు, లోడింగ్‌కు సదుపాయాలు, లారీలు నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, డ్రైవర్లకు డార్మెటరీలు, లారీల్లో తెచ్చే సరకులను సమీపంలోని రైల్వే స్టేషన్‌ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్‌కు సమీపంలో భూమిస్తే ప్రయోజనం ఉంటుందని కేంద్ర అధికారులు కోరుతున్నారు. అయితే పురపాలకశాఖ అక్కడ కాకుండా కృష్ణా నది సమీపంలో భూములిస్తామని చెబుతోంది. వీటిపై మోర్త్‌ ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ఈ భూముల కేటాయింపు ప్రక్రియ వేగంగా కొలిక్కి వస్తే టెండర్లు, భూసేకరణ మొదలయ్యే వీలుందని చెబుతున్నారు.

రూ.500 కోట్ల భారం లేకుండా..
కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16లోని చిన్నఅవుటపల్లి నుంచి కాజ వరకు 40 కి.మీ. మేర విజయవాడ తూర్పు బైపాస్‌, కృష్ణా నదిపై వంతెనకు కలిపి రూ.2వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో భూసేకరణకు రూ.500 కోట్లు అవసరమన్నది ప్రాథమిక అంచనా. వాస్తవానికి ఈ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపడితే బైపాస్‌ను తాము నిర్మిస్తామని కేంద్రం చెప్పింది. ప్రస్తుత పరిస్థితిలో భూసేకరణ భారం భరించలేమని రాష్ట్రం పేర్కొంది. దీంతో పార్కుకు 100 ఎకరాలు ఇవ్వాలనే ప్రతిపాదనను కేంద్రం తెచ్చింది. ఈ భూములు కేటాయించడంవల్ల తూర్పు బైపాస్‌తోపాటు, లాజిస్టిక్‌ పార్క్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని