తన రాతను తనే రాసుకుంటూ..!

తొమ్మిదేళ్ల వయసులో విద్యుత్తు ప్రమాదంతో రెండు చేతులు, ఒక కాలు కోల్పోయిన బాలుడు.. మొక్కవోని దీక్షతో ఒక్క కాలుతో పైకి లేచాడు. నెలల పాటు మంచానికే పరిమితమైనా తల్లి ఇచ్చిన సత్తువతో ముందడుగు వేశాడు. హస్తాలు

Updated : 26 Sep 2022 07:11 IST

విద్యుదాఘాతంతో చేతులు, ఓ కాలు కోల్పోయిన యువకుడి ఆదర్శ పథం

ఈటీవీ, నెల్లూరు; న్యూస్‌టుడే, స్టోన్‌హౌస్‌పేట: తొమ్మిదేళ్ల వయసులో విద్యుత్తు ప్రమాదంతో రెండు చేతులు, ఒక కాలు కోల్పోయిన బాలుడు.. మొక్కవోని దీక్షతో ఒక్క కాలుతో పైకి లేచాడు. నెలల పాటు మంచానికే పరిమితమైనా తల్లి ఇచ్చిన సత్తువతో ముందడుగు వేశాడు. హస్తాలు లేకున్నా.. కలల సాధనకు మోచేతితోనే కలం పట్టాడు. ఆశలే ఆసరాగా.. ఓ వైపు బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే ‘సివిల్స్‌’ సాధనే లక్ష్యంగా తన రాతను తనే రాసుకుంటున్నాడు. అన్నీ ఉండి ఏమీ చేయలేమని నిరుత్సాహపడే వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు సునీల్‌.

నెల్లూరు నగరానికి సమీపంలోని కాకుటూరుకు చెందిన మల్లి సుధాకర్‌, లక్ష్మిల కుమారుడు సునీల్‌. 2000 అక్టోబరు 29న క్రికెట్‌ బాల్‌ కోసం మిద్దెపైకి వెళ్లి విద్యుత్తు తీగలు తగిలి మృత్యువు ముఖంలోకి వెళ్లారు. వైద్యులు మోచేతి వరకు రెండు చేతులు, మోకాలు వరకు ఒక కాలు తొలగించారు. శస్త్రచికిత్స గాయాలు మానేందుకే కొన్ని నెలలపాటు ఆసుపత్రిలో గడిపారు. ఆ స్థితిలో అతన్ని చూసిన వారు ఇక మంచానికే పరిమితం అవుతాడని అనుకున్నారు. అతని తల్లి లక్ష్మి మాత్రం దుఃఖాన్ని దిగమింగుకొని కుమారుడికి మంచి జీవితం ఇవ్వాలని శ్రమించారు. చికిత్స కొనసాగుతుండగానే మోచేతికి రబ్బరు బ్యాండ్‌ వేసి, పెన్నుపెట్టి రాత నేర్పించారు. ‘నీ జీవితానికి ఇదే ఆయుధం’ అని చెప్పి ప్రోత్సహించారు. అసాధారణ ప్రతిభతో సునీల్‌ దస్తూరీతో పాటు తన పనులు తనే చేసుకోవడం నేర్చుకున్నారు. చదువులో చురుకుగా ఉండే సునీల్‌.. పది, ఇంటర్‌లోనూ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. ఇంజినీరింగ్‌ చేశారు. 2017లో స్టేట్‌ బ్యాంకులో ఉద్యోగం పొంది.. ప్రస్తుతం గూడూరు స్టేట్‌ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న సునీల్‌ ఇప్పుడు ఉద్యోగం, చదువు సమన్వయం చేసుకుంటున్నారు. రెండేళ్ల కిందటే పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ‘సివిల్స్‌’ వైపు దృష్టి సారించారు.

* ‘ఇప్పుడు కంప్యూటర్‌ కీబోర్డు వాడుతున్నా, కృత్రిమ కాలున్నా డ్రైవింగ్‌ చేస్తున్నా, క్రికెట్‌ ఆడుతున్నా. దివ్యాంగులైనంత మాత్రాన కుంగిపోవద్దు. మనలో ఉన్న శక్తిని గ్రహించి సానపెట్టాలి’ అని సునీల్‌ ‘ఈనాడు- ఈటీవీ’తో పంచుకున్నారు. ‘చిన్నతనం నుంచి అలుపెరగక శ్రమించాడు. తప్పక సివిల్స్‌ సాధిస్తాడు’ అని సునీల్‌ తపనను గమనించిన అతని తల్లి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని