ఏడు జిల్లాల్లో లంపీ స్కిన్‌

రాష్ట్రంలోని పశువుల్లో లంపీ స్కిన్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికి ఏడు జిల్లాల్లో దీని ప్రభావాన్ని గుర్తించారు. అయితే... వ్యాధి విస్తరణ తీవ్రత తక్కువగా ఉందని, చికిత్స అనంతరం పశువులు త్వరగానే కోలుకుంటున్నాయని, అయినా

Updated : 26 Sep 2022 05:55 IST

పశువుల చర్మం కింద కణితులు, బొడిపెలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పశువుల్లో లంపీ స్కిన్‌ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికి ఏడు జిల్లాల్లో దీని ప్రభావాన్ని గుర్తించారు. అయితే... వ్యాధి విస్తరణ తీవ్రత తక్కువగా ఉందని, చికిత్స అనంతరం పశువులు త్వరగానే కోలుకుంటున్నాయని, అయినా రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇవీ వివరాలు... లంపీ స్కిన్‌ సోకితే పశువుల్లో చర్మం కింద కణితులు, బొడిపెలు కనిపిస్తాయి. అప్పుడు పశువుకు జ్వరం రావడంతోపాటు పాల దిగుబడి తగ్గిపోతుంది. పాక్స్‌ వైరస్‌ కారణంగా ఈ వ్యాధి పశువులకు సంక్రమిస్తుంది. ఈగలు, దోమలు, గోమార్లు ఇతర క్రిమి కీటకాల ద్వారా ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది.

విజయనగరం జిల్లాలో అధికం 

విజయనగరం జిల్లాలో అత్యధికంగా 25 పశువులకు లంపీస్కిన్‌ సోకింది. పల్నాడు జిల్లాలో 16, శ్రీకాకుళం జిల్లాలో 11 పశువులు వ్యాధి బారిన పడినట్లు నిర్ధారించారు. కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనూ ఈ లక్షణాలతో ఉన్న పశువుల్ని గుర్తించారు. నమూనాలు  తీసి పరిశోధనాశాలకు పంపారు.

రైతులు ఏం చేయాలి?

లక్షణాలు కన్పించిన పశువును మంద నుంచి వేరు చేయాలి. వైద్యుని సలహాతో మందులు వాడాలి. పుండ్లకు యాంటీ సెప్టిక్‌ ఆయింట్‌మెంట్‌ పూయాలి. పుండ్లు పడకుండా మందులను వాడితే త్వరితగతిన పశువులు కోలుకునే అవకాశముంది. పశువుల చావిడి, పరిసర ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు చల్లి శుభ్రం చేసుకోవాలి.


రింగ్‌ వ్యాక్సినేషన్‌ చేస్తున్నాం

- ఆర్‌.అమరేంద్రకుమార్‌, డైరెక్టర్‌, పశుసంవర్థక శాఖ

లంపీస్కిన్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు గోట్‌పాక్స్‌ టీకా వేస్తున్నాం. వ్యాధి ప్రబలిన జిల్లాలతోపాటు, సరిహద్దు జిల్లాల్లోనూ 5 కి.మీ పరిధి నుంచి రింగ్‌ వ్యాక్సినేషన్‌ విధానంలో టీకాలిచ్చాం. అంతర్‌రాష్ట్ర పశువుల రవాణాపై చెక్‌పోస్టుల్లో తనిఖీలు పెంచాం. వ్యాధి ప్రబలిన జిల్లాల్లో సంతల్లో పశువుల విక్రయాలను నిలిపేశాం. వైద్యానికి పశువులు స్పందించి... త్వరితగతిన కోలుకుంటున్నాయి. మొత్తంగా 3.16 లక్షల పశువులకు టీకాలు వేశాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని