రెస్కోల్లో నేతల పెత్తనం

గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ లిమిటెడ్‌ (రెస్కో)ల పాలనా వ్యవహారాలన్నీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అందులో జరిగే వివిధ కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. రెస్కోలో

Published : 26 Sep 2022 04:38 IST

వారి కనుసన్నల్లోనే కార్యకలాపాలు

సిబ్బంది నియామకాల్లోనూ ఇష్టారాజ్యం

లైసెన్సు గడువు ముగిసినా పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి

ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌-విశాఖపట్నం

గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ లిమిటెడ్‌ (రెస్కో)ల పాలనా వ్యవహారాలన్నీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. అందులో జరిగే వివిధ కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. రెస్కోలో వచ్చే లాభాలను నేతలు పంచుకుంటున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. సిబ్బంది నియామకాల్లో సైతం వారు చెప్పిందే నడుస్తోంది. అందువల్లే రెస్కోల విద్యుత్‌ పంపిణీ లైసెన్సులను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) రద్దు చేస్తే.. వాటిని మళ్లీ పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ సిఫారసు చేయించారు. సిఫారసు ఉత్తర్వులను ఏపీఈఆర్‌సీ ఆమోదించక ముందే అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోల పరిధిలో విద్యుత్‌ బిల్లుల వసూళ్లను రెస్కో చేపట్టడం వివాదాస్పదమైంది. లైసెన్సు లేని సంస్థ బిల్లులు వసూలు చేసుకుంటున్నా.. డిస్కంల అధికారులు కేసు కూడా పెట్టలేకపోతున్నారంటే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. రెస్కో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే సీఎండీలపై పెత్తనం చెలాయించడం స్థానిక నేతలకు సర్వసాధారణంగా మారింది. రెస్కోలో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా సంస్థను ఈపీడీసీఎల్‌ పరిధిలోకి తీసుకురావాలని ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ లేఖలు రాశారు. ఒక మంత్రి అడ్డుపడి దాన్ని సహకార రంగంలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఒప్పించినట్లు సమాచారం.

అంతా అడ్డుగోలు వ్యవహారమే

అనకాపల్లి రెస్కోకు ప్రస్తుతం పాలకవర్గమే లేదు. జిల్లాకు చెందిన ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి అనుచరుడు రెస్కో వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. ఇక్కడ ఏం కొనాలన్నా.. ఎవర్ని నియమించుకోవాలన్నా అంతా ఆయన ఇష్టమే. విద్యుత్తు తీగల నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల వరకు అన్నింటా కమిషన్లు ముట్టజెప్పాలి. కాంట్రాక్ట్‌ సిబ్బంది నుంచి ఇంజినీరింగ్‌ అధికారి నియామకం వరకు రేట్లు పెట్టి వసూళ్లు చేసినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నాయి. గతంలో తమ బంధువు ఒకర్ని విద్యార్హత లేకపోయినా లైన్‌మన్‌గా నియమించుకుని తర్వాత ధ్రువపత్రాలు సృష్టించి కార్యాలయ సిబ్బందిగా మార్చుకున్నారు. ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకు రెస్కో పరిధిలోని కార్యకలాపాలను ఈపీడీసీఎల్‌ పర్యవేక్షణలోకి తీసుకున్న తర్వాత కూడా అనధికారికంగా 33 మందిని రెస్కో ద్వారా నియమించి, భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియామకాలు చెల్లవని ఈపీడీసీఎల్‌ జీతాలు నిలిపేసింది. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా సహకార సంఘంలోకి రెస్కో వస్తుందని, మీ జీతాలకు మాది పూచీ అంటూ వారిని నేతలు బుజ్జగిస్తున్నారు.

ఏటా రూ.100 కోట్లపైనే వ్యాపారం

అనకాపల్లి, చీపురుపల్లి, కుప్పం పరిధిలోని వినియోగదారులకు రెస్కోల ద్వారా విద్యుత్‌ పంపిణీ జరుగుతోంది. విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్లు, కండక్టర్లు, ఇతర విడిభాగాల కొనుగోలు, విద్యుత్‌ బిల్లుల వసూలు ప్రక్రియ మొత్తాన్ని రెస్కోలే పర్యవేక్షిస్తున్నాయి. ఈ కొనుగోళ్లలోనే భారీగా అక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వినియోగదారులకు ఏటా సుమారు 711.42 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేసి, సుమారు రూ.135.42 కోట్ల బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తంలో రెస్కోల నిర్వహణ ఖర్చులు పోను.. మిగిలింది డిస్కంలకు చెల్లిస్తాయి. విద్యుత్‌ పంపిణీ కోసం రెస్కోలకు ఏపీఈఆర్‌సీ జారీ చేసిన లైసెన్సు గడువు 2021 మే నాటికి ముగిసింది. దాన్ని పునరుద్ధరించడానికి అంగీకరించని ఏపీఈఆర్‌సీ.. ఆ కార్యకలాపాలను డిస్కంలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో రెస్కోలపై పెత్తనం చేస్తున్న స్థానిక నాయకులు పలుకుబడి ఉపయోగించి లైసెన్సుల పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి సిఫారసు చేయించారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాక ఏపీఈఆర్‌సీ ఆమోదం పొందకుండానే అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోల పరిధిలో బిల్లులు వసూలు చేశారు. సుమారు రూ.18 కోట్లు రెస్కోల ఖాతాల్లో జమ వేసుకున్నారు. దీనిపై ఏపీఈఆర్‌సీ సుమోటోగా విచారణ చేపట్టింది. 

రూ.3 కోట్లకు తేలని లెక్కలు

అనకాపల్లి రెస్కో పరిధిలో జూన్‌, జులై నెలల విద్యుత్‌ బిల్లులుగా వసూలు చేసిన మొత్తంలో రూ.2,95,31,340కు లెక్కలు ఇంకా తేలలేదు. 2022 మే, జూన్‌లకు సిబ్బంది జీతాల కోసం రూ.2,21,58,991 ఖర్చు చేసినట్లు రెస్కో తెలిపింది. వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.5,16,90,331 పెండింగ్‌లో పెట్టింది. వాటిని ఇతర ఖర్చుల కింద వెచ్చించినట్లు చెబుతోంది. ఈ లెక్కలను తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) అధికారులు పరిశీలించాక.. ఏ మేరకు అక్రమాలు జరిగాయో తేలుతుందని ఒక అధికారి తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts