పత్తి రైతుకు తెగుళ్ల దిగులు

ఖరీఫ్‌ పంటలకు తెగుళ్లు, పురుగుతాకిడి పెరుగుతోంది. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తిని ఈ ఏడాది ఆగస్టు నుంచే గులాబీ పురుగు ఆశించింది. రాష్ట్రంలో అక్కడక్కడా తొలితీత పత్తి వస్తోంది. అందులో పుచ్చు గుల్లలు కనిపిస్తున్నాయి

Published : 26 Sep 2022 04:38 IST

దిగుబడిపై ఆందోళన

ఈనాడు, అమరావతి: ఖరీఫ్‌ పంటలకు తెగుళ్లు, పురుగుతాకిడి పెరుగుతోంది. అధిక విస్తీర్ణంలో సాగయ్యే పత్తిని ఈ ఏడాది ఆగస్టు నుంచే గులాబీ పురుగు ఆశించింది. రాష్ట్రంలో అక్కడక్కడా తొలితీత పత్తి వస్తోంది. అందులో పుచ్చు గుల్లలు కనిపిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు తలమాడు తెగులు ప్రభావమూ పెరుగుతోంది. ఆగస్టు చివరి వారం నుంచి కర్నూలు జిల్లాలో కనిపించిన ఈ తెగులు ఇటీవల పల్నాడులోనూ ప్రభావం చూపిస్తోంది. దీంతో దిగుబడులు తగ్గుతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది 16.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 3 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. వర్షాభావ పరిస్థితులు తలమాడు తెగులు ఉద్ధృతికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 95 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. సెప్టెంబరులో ఇప్పటి వరకు 166 మండలాల్లో 5 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. అందులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 26, పల్నాడు జిల్లాలోని 22 మండలాల్లో సగటున 10 మి.మీ లోపు వర్షం కూడా లేదు. రాయలసీమలో ఇటీవల కురిసిన వర్షాలతో కొంతమేర ఉపశమనం లభించినా.. కోస్తాలో మాత్రం రైతులు వానల కోసం ఎదురు చూస్తున్నారు. అటు గులాబీపురుగు, ఇటు తలమాడు తెగులు ప్రభావంతో పత్తిలో దిగుబడి తగ్గుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తలమాడు తెగులు అధికంగా ఉండటంతో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనాస్థానం ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం అక్కడ పర్యటిస్తోంది. తెగులు ప్రభావం కొన్ని మండలాల్లో ఉందని, రైతులకు నివారణ సూచనలు చేస్తున్నామని ప్రధాన శాస్త్రవేత్త (పత్తి) డాక్టరు ఎం.సుధారాణి తెలిపారు. ఈ తెగులు నివారణకు ఫిప్రోనిల్‌ 5ఎస్‌సీ మందును ఎకరాకు 400 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 75ఎస్‌పీ మందును ఎకరాకు 300 గ్రాములు లేదంటే ఇమిడా క్లోప్రిడ్‌ 17.8 మందును ఎకరాకు 80 మి.లీ. చొప్పున పిచికారీ చేయడంతోపాటు నీలిరంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున అమర్చుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని