గుత్తేదారుల ‘రూసా’రుస

ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌(రూసా) కింద ఇచ్చిన రూ.180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో సంబంధిత పనులు ముందుకు

Published : 26 Sep 2022 04:38 IST

రూ.180 కోట్ల కేంద్రం నిధులను మళ్లించిన రాష్ట్రం 

తన వాటానూ విడుదల చేయని వైనం

రూ.46 కోట్ల బిల్లులిస్తేనే పనులు చేస్తామని స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్ష అభియాన్‌(రూసా) కింద ఇచ్చిన రూ.180 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. దీంతో సంబంధిత పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రమిచ్చిన నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కళాశాల విద్యాశాఖ కోరుతున్నా స్పందించడం లేదు. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన మిగిలిన నిధులూ రావడం లేదు. రాష్ట్రానికిచ్చిన నిధులను ఖర్చు చేసి, యూసీలు సమర్పిస్తేనే మిగతా వాటిని విడుదల చేస్తామని కేంద్రం స్పష్టంచేస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక రూసా అధికారులు సతమతమవుతున్నారు.

పనులు చేసినా చెల్లింపులు లేవు

డిగ్రీ కళాశాలల్లో మౌలికసదుపాయాలు, భవనాల నిర్మాణం, ప్రయోగశాలలు, పరిశోధనలు, సామగ్రి కొనుగోళ్లకు కేంద్రం ప్రభుత్వం రూసా కింద 60% నిధులు ఇస్తోంది. శ్రీవేంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలకు రూ.100 కోట్లు చొప్పున వచ్చాయి. ఇప్పటి వరకు కేంద్రం రూ.563.68 కోట్లు విడుదల చేసింది. వీటిలో రూ.180 కోట్లను రాష్ట్రం ఇతర అవసరాలకు మళ్లించింది. రాష్ట్రం వాటా 40% కలిపి ఇవ్వాల్సి ఉండగా... కనీసం కేంద్రం ఇచ్చిన వాటినీ ఇవ్వడం లేదు. నిధులు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రూ.46 కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. మార్చి 31నాటికి ఈ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌కు సమర్పించగా... నిధులు లేవని వెనక్కి పంపించారు. తాము వడ్డీలకు అప్పులు తెచ్చి పనులు చేశామని గుత్తేదారులు వాపోతున్నారు. బిల్లులు చెల్లిస్తేనే పనులు చేస్తామని స్పష్టంచేస్తున్నారు.

* కేంద్ర ప్రభుత్వం మరో రూ.58 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రెండు విడతల్లో ఇచ్చిన నిధులకు సంబంధించిన వినియోగపత్రాలను సమర్పించాలని సూచించింది. వీటిని సమర్పిస్తే 60% వాటాలోని మిగిలిన రూ.58 కోట్లు ఇస్తామంటోంది. రాష్ట్రం స్పందించడంలేదు.

* కొత్త ఆదర్శ డిగ్రీ కళాశాలలు(ఎన్‌ఎండీసీ), ఆదర్శ డిగ్రీ కళాశాలల(ఎండీసీ) నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇచ్చింది. ఎన్‌ఎండీసీలకు రూ.12 కోట్లు, ఎండీసీలకు రూ.4 కోట్ల చొప్పున వచ్చాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో చేపట్టిన కళాశాలలు, అమ్మాయిల వసతి భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. విశ్వవిద్యాలయాల్లో చేపట్టిన కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి.


ఎయిడెడ్‌కూ ఇవ్వడం లేదు

రాష్ట్రంలో న్యాక్‌ గుర్తింపు ఉన్న 33 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు రూసా నిధులు వచ్చాయి. విజయవాడలోని ఆంధ్ర లయోలా, ఏలూరులోని థెరిస్సా కళాశాలలకు రూ.5 కోట్ల చొప్పున కేంద్రం మంజూరు చేసింది. మిగతా 31 విద్యాసంస్థలకు రూ.2కోట్ల చొప్పున వచ్చాయి. మొదట రూ.కోటి చొప్పున విడుదల చేయగా.. చాలావరకు యాజమాన్యాలు ఖర్చు పెట్టాయి. వీటికి నిధులు ఇవ్వడం లేదు. ఎయిడెడ్‌ కళాశాలల సిబ్బంది ప్రభుత్వంలో విలీనమవడంతో మొదట చాలా కళాశాలలు ప్రైవేటుగా మారాయి. ఆ తర్వాత వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఎయిడెడ్‌ కిందకు వచ్చేశాయి. కానీ, నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. వీటిల్లో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని