Anantapur: ‘పోయిన డబ్బులు రావు.. అడుక్కు తినండి’

ఆన్‌లైన్‌లో మోసానికి గురైన తనకు న్యాయం చేయాల్సిన డీఎస్పీ ‘పోయిన డబ్బులు రావు.. అడుక్కు తినండి’ అంటూ అవమానపరిచారని ఆరోపిస్తూ ఓ ఆర్‌ఎంపీ జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. అయితే ఆయన

Updated : 26 Sep 2022 07:45 IST

తాడిపత్రి డీఎస్పీ అవమానపరిచారంటూ ఆర్‌ఎంపీ లేఖ

ఆత్మహత్య చేసుకుంటానంటూ అదృశ్యం.. హైదరాబాద్‌లో గుర్తింపు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఆన్‌లైన్‌లో మోసానికి గురైన తనకు న్యాయం చేయాల్సిన డీఎస్పీ ‘పోయిన డబ్బులు రావు.. అడుక్కు తినండి’ అంటూ అవమానపరిచారని ఆరోపిస్తూ ఓ ఆర్‌ఎంపీ జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. అయితే ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్‌ఎంపీ జి.వెంకటేశ్‌కు లక్కీ డ్రా పేరుతో కొందరు సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. అది నిజమనుకున్న ఆయన.. వారి ఖాతాల్లో రూ.15 లక్షలు వేశారు. తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో ఈనెల 19న ‘స్పందన’లో ఎస్పీ ఫక్కీరప్పతో తన గోడు వినిపించారు. ఎస్పీ ఆదేశాల మేరకు పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 22న వెంకటేశ్‌ తాడిపత్రి డీఎస్పీ చైతన్య ముందు హాజరయ్యారు. న్యాయం చేయాల్సిన డీఎస్పీ తనను అవమానపరిచారంటూ అదే రోజు ఎస్పీ ఫక్కీరప్పకు లేఖ రాశారు. తన గురువు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌ను కించపరిచారని లేఖలో పేర్కొన్నారు. పోయిన డబ్బులు రావు.. పోయి అడుక్కు తినండంటూ తిట్టారని ఆరోపించారు. ‘మీ ఇంటికి వస్తాను.. నేను, నీ భార్య, నువ్వు కలిసి భజన చేద్దాం’ అన్నారని లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలంటూ లేఖలో ఎస్పీని కోరారు. ఆ తర్వాత అదృశ్యమయ్యారు. ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. వెంకటేశ్‌ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని మోసం చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ఆదివారం కోల్‌కతా వెళ్లారు. ఇప్పటికే సుమారు రూ.2.50 లక్షల వరకు రికవరీ చేసి బాధిత కుటుంబానికి అందజేసినట్లు పుట్లూరు ఎస్సై గురుప్రసాద్‌ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని మిగతా మొత్తం రికవరీ చేసి న్యాయం చేస్తామని వివరించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts