అంగన్‌వాడీల నిర్వహణకు ప్రత్యేక నిధి

వైద్యులు తాత్కాలికంగా జారీ చేసే ధ్రువీకరణ పత్రాలపైనా మానసిక దివ్యాంగులకు డిసెంబరులో పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం...

Published : 27 Sep 2022 03:24 IST

వైద్యుల తాత్కాలిక ధ్రువీకరణపైనా మానసిక దివ్యాంగులకు పింఛన్లు

స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: వైద్యులు తాత్కాలికంగా జారీ చేసే ధ్రువీకరణ పత్రాలపైనా మానసిక దివ్యాంగులకు డిసెంబరులో పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన స్త్రీ, శిశు సంక్షేమశాఖపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. ‘ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఎలాంటి విధానాన్ని అమలు చేస్తున్నారో అదే విధంగా అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. అంగన్‌వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్చారణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పిల్లలకు పాఠ్య ప్రణాళిక అమలు చేయాలి. వారికి అందించే ఆహారంలో నాణ్యత ఉండేలా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయాలి. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని ప్రయోగాత్మకంగా చేపట్టాలి. పేరొందిన సంస్థతో థర్డ్‌ పార్టీ తనిఖీలు జరిగేలా చూడాలి. పిల్లల మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్నే పంపిణీ చేయాలి. అంగన్‌వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబరుతో ఉన్న పోస్టర్‌ను ఉంచాలి’ అని అధికారులను సీఎం ఆదేశించారు.

బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి
‘కల్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. లబ్ధిదారులైన వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధన పెట్టడానికి ఇదే కారణం. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత కేంద్రం ఏర్పాటు చేయాలి. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా చర్యలు తీసుకోవాలి. జువైనల్‌ హోమ్‌ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారిని నియమించాలి. వాటిలో సౌకర్యాలపైనా దృష్టి పెట్టాలి’ అని సీఎం సూచించారు.

ఈ నెల 30కల్లా సూపర్‌వైజర్ల నియామకం: అధికారులు
అంగన్‌వాడీల్లో ఈ నెల 30 కల్లా సూపర్‌వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. సూపర్‌వైజర్ల పోస్టులకు సంబంధించి పరీక్షల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని, హాజరైన అభ్యర్థులు తమ జవాబు పత్రాలను కూడా పరిశీలించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సమీక్ష సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని