Viveka Murder Case: వివేకా హత్య కేసులో శివశంకరే కీలకం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆయనే

Updated : 27 Sep 2022 06:38 IST

సుప్రీం కోర్టు స్పష్టీకరణ
జైలునుంచి విడుదలకు నిరాకరణ
బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌
మీరు చాలా ప్రభావశీలురని వ్యాఖ్య  
సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశాలున్నాయని వెల్లడి

ఈనాడు, దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ఆయనే కీలక వ్యక్తి (కింగ్‌పిన్‌) అని వ్యాఖ్యానిస్తూ బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించడంతో శివశంకర్‌రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది, కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ‘ఎఫ్‌ఐఆర్‌లో శివశంకర్‌రెడ్డి పేరు లేదు. అప్రూవర్‌గా మారిన వ్యక్తి 2021 జులైలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో తాను ఫలానా వ్యక్తిని చూశానని చెప్పారు తప్పితే ఆయన పేరు చెప్పలేదు. 2021 అక్టోబరు 26న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోనూ పేరు లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎ-1 కేవలం 90 రోజుల్లోపే బెయిల్‌ పొందారు. శివశంకర్‌రెడ్డి నుంచి ఎవరో డబ్బులు తీసుకున్నట్లు ఎవరి మాటల ద్వారానో తాను విన్నట్లు చాలా రోజుల తర్వాత ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు’ అని వివరించారు. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా జోక్యం చేసుకుంటూ.. ‘ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎ-1 కాదు.. శివశంకర్‌రెడ్డే’ అని వ్యాఖ్యానించారు. సింఘ్వీ స్పందిస్తూ.. ‘అది కేవలం అక్కడక్కడా వినిపిస్తున్న మాట తప్పితే ఇప్పటివరకూ శివశంకర్‌రెడ్డి పేరును ఎవరూ చెప్పలేదు. కానీ ఇక్కడ నేరం చేసిన ఎ-1 బెయిల్‌ మీద బయటికొచ్చారు. ఎ-4గా ఉన్న అప్రూవర్‌కు సీబీఐ కల్పించిన ప్రయోజనం కారణంగా ముందస్తు బెయిల్‌ ఇచ్చారు. ఎందులోనూ పేరులేని శివశంకర్‌రెడ్డి 11 నెలల నుంచి జైల్లో ఉన్నారు. ఆయన పాత్ర గురించి ఖరారు చేయడానికికానీ, తిరస్కరించడానికికానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ట్రయల్‌ కోర్టు చెప్పింది’ అని పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా జోక్యం చేసుకుంటూ.. ‘మీ క్లయింట్‌ చాలా ప్రభావశీలురు, సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు. సింఘ్వీ స్పందిస్తూ.. కావాలంటే మీరు ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తన క్లయింట్‌ ఎవరికో డబ్బులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ అని, అది కోర్టు ట్రయల్‌లో తేలుతుందని వాదించారు. అవతలి పక్షం కేసు ట్రయల్‌ను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నందున బెయిల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పులోని పేరా 13-17లో అన్ని వివరాలను స్పష్టంగా చెప్పిందని, అందువల్ల నిందితుడి విడుదలకు నిరాకరిస్తున్నామని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. శివశంకర్‌రెడ్డి ఇందులో లేరని మేం నమ్మడం లేదని, ఆయనే ఇందులో కింగ్‌పిన్‌ అని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా వ్యాఖ్యానించారు. కనీసం ఏదో ఒక ఉపశమనం ఇవ్వాలని శివశంకర్‌రెడ్డి తరఫు న్యాయవాది సింఘ్వీ విజ్ఞప్తి చేయగా, కుదరదని స్పష్టం చేస్తూ విచారణను ముగించారు.

సుప్రీంకోర్టు ప్రస్తావించిన హైకోర్టు తీర్పులోని ప్రధాన అంశాలు..
పిటిషనర్‌ పరిస్థితులను ప్రభావితం చేయగల రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. పోలీసు రికార్డుల ప్రకారం అతనిపై 31 క్రిమినల్‌ కేసులున్నాయి. దాన్నిబట్టి నిందితుడి చరిత్ర, నేర నేపథ్యం స్పష్టమవుతోంది. వివేకానందరెడ్డి హత్య వెనకున్న విస్తృత కుట్ర, సంఘటన జరిగిన స్థలంలో సాక్ష్యాధారాల చెరిపివేతపై ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతోంది. ఇలాంటి సమయంలో నిందితుడు డి.శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాడికికి చెందిన గంగాధర్‌రెడ్డి, అప్పటి సీఐ జె.శంకరయ్య, వివేకానందరెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇప్పటికే శివశంకర్‌రెడ్డి, ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనైనట్లు అనుమానాలున్నాయి. దర్యాప్తు సమయంలో గంగాధర్‌రెడ్డి అనే వ్యక్తి సీబీఐని ఆశ్రయించారు. శివశంకర్‌రెడ్డి 2019 ఆగస్టు 14న తన వద్దకు వచ్చి వివేకా హత్య కేసును తన మీద వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై మేజిస్ట్రేట్‌ ముందు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి 2021 నవంబరు 11న గంగాధర్‌రెడ్డి అంగీకరించారు. అయితే నవంబరు 29న గంగాధర్‌రెడ్డి తనను సీబీఐ ఒత్తిడి చేస్తోందంటూ మీడియా ముందు ప్రకటించారు. తర్వాత ఇదే అంశంపై అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్యకు పంపారు. తర్వాత సదరు డీఎస్పీ గంగాధర్‌రెడ్డి ఫిర్యాదుపై విచారణ పేరుతో పిలిపించి ఈ కేసులో

సాక్షి అయిన జగదీశ్వర్‌రెడ్డిని బెదిరించారు.

* పులివెందుల అప్పటి సీఐ శంకరయ్య మొదట మేజిస్ట్రేట్‌ ముందు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి అంగీకరించారు. తర్వాత ఆయన ముందుకురాలేదు. ఆపై వారానికి శంకరయ్యపై ఉన్న సస్పెన్షన్‌ ఎత్తేసి తిరిగి విధుల్లోకి చేర్చుకున్నారు.
* అధికార బలం కారణంగా నిందితులు సాక్షులను ప్రలోభ పెడుతున్నట్లు సీబీఐ తెలిపింది.
* శివశంకర్‌రెడ్డి సూచనల మేరకే వివేకానందరెడ్డి హత్యకు కుట్ర చేశారని.. హత్యకు నెలరోజుల ముందే ఇతర నిందితులకు భారీ మొత్తం ముట్టజెప్పారనేది ప్రధాన ఆరోపణలు. 2019 మార్చి 15న హత్య జరిగిన రోజు ఉదయం 6.30 గంటలకు ఇతను వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లినట్లూ ఆరోపణలున్నాయి. మృతుడు గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అలాగే పడకగది, స్నానాల గదిని శుభ్రం చేయడంలో, వివేకానందరెడ్డి గాయాలకు బ్యాండేజీలు వేయడంలో పాలుపంచుకున్నారు. ఎ-4గా ఉన్న షేక్‌ దస్తగిరికి ఫోన్‌ చేసి స్నేహితుడు తన పేరు, ఇతరుల పేర్లను సీబీఐ ముందు చెప్పొద్దని ఆదేశించినట్లు ఆరోపణలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని