ఏలూరు.. రైతు సెలయేరు

ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదాలు హోరెత్తగా ఏలూరు జిల్లాలో మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు అన్నదాతలు చేపట్టిన పాదయాత్ర కొనికి, సకల కొత్తపల్లి, సత్యవోలు, పెదపాడు మీదుగా కొత్తూరుకు సోమవారం చేరుకుంది.

Updated : 27 Sep 2022 07:57 IST

జిల్లాలో మహాపాదయాత్రకు ఘనస్వాగతం
నినాదాలతో హోరెత్తించిన అమరావతి రైతులు
పలు పార్టీలు, సంఘాల నాయకుల సంఘీభావం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే- దెందులూరు, పెదపాడు: ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని నినాదాలు హోరెత్తగా ఏలూరు జిల్లాలో మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగింది. అమరావతి నుంచి అరసవల్లి వరకు అన్నదాతలు చేపట్టిన పాదయాత్ర కొనికి, సకల కొత్తపల్లి, సత్యవోలు, పెదపాడు మీదుగా కొత్తూరుకు సోమవారం చేరుకుంది. మంగళవాయిద్యాలు, తీన్మార్‌ డప్పులు, అమరావతి పాటల మధ్య కోలాహలంగా సాగిన యాత్రకు గ్రామగ్రామాన జనం నీరాజనాలు పలికారు. పాదయాత్ర దారి ఇరువైపులా నిల్చొని పూల వర్షం కురిపించారు. రైతులకు దిష్టి తీసి హారతులు పట్టారు. రైతు రథానికి పూజలు చేస్తూ బిందెలతో నీరు పోస్తూ ముందుకు సాగనంపారు. యాత్రకు స్వాగతం   పలికేందుకు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బళ్లతో స్థానిక రైతులు ప్రదర్శన ఏర్పాటుచేశారు.

వైద్య విద్యార్థులు, న్యాయవాదుల మద్దతు
మహాపాదయాత్రకు వివిధ వర్గాలు మద్దతు ప్రకటించాయి. యువతుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసులవారు ఉత్సాహంగా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలవారే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల మహిళా రైతులు తరలివచ్చారు. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల విద్యార్థులు యాత్రలో పాల్గొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని వారు నినదించారు. పాదయాత్రలో ఏలూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన ఓ దివ్యాంగుడు యాత్రలో పాల్గొని రైతులతోపాటు నడిచారు. తాడేపల్లిగూడెం నుంచి పాదయాత్రలో పాల్గొన్న కవలలు రామలక్ష్మణ్‌ అందరినీ ఆకర్షించారు. విశాఖ వరకూ యాత్రలో పాల్గొంటామని వారు తెలిపారు. కష్టనష్టాలను భరిస్తూ రైతులు యాత్ర కొనసాగిస్తున్నారు. అమరావతి నుంచి పాదయాత్రలో నడుస్తున్న మహిళా రైతు వనజాక్షి కాళ్లకు బొబ్బలెక్కాయి. 

* రైతు పాదయాత్రకు మద్దతుగా బాపులపాడు గ్రామ రైతులంతా కలిసి రూ.1.75 లక్షల విరాళం అందజేశారు. పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామస్థులు రైతుల వైద్య సదుపాయాల కోసం రూ.50 వేలు, పాదయాత్రకు రూ.2.15 లక్షల విరాళం అందించారు.

మద్దతు పలికిన పార్టీలు, సంఘాలు
మాజీ మంత్రులు కె.జవహర్‌, పితాని సత్యనారాయణ, తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, ఏలూరు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి బడేటి చంటి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాలతీదేవి, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ తదితరులు యాత్రలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు.

రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు
అమరావతి రైతుల పాదయాత్ర మొదలుకానున్న కొనికి గ్రామంలో ఆదివారం రాత్రికి రాత్రే వైకాపా వర్గీయుల వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి.


15వ రోజు యాత్ర ఇలా..
ప్రారంభం: పెదపాడు మండలం కొనికి గ్రామం
ముగింపు: కొత్తూరు
నడిచిన దూరం: 15 కి.మీ.


కన్నెర్ర చేయడానికి రైతులేం తప్పు చేశారు?

ప్రశ్నించిన జేఏసీ నాయకులు

‘మేమంతా గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తుంటే.. కన్నెర్ర చేస్తే యాత్ర ఆగిపోతుందని మంత్రులు చెబుతున్నారు. కన్నెర్ర చేయడానికి రైతులేం తప్పు చేశారు? దొంగలంతా కలిసి ఒకే పార్టీలో చేరారు’ అని జేఏసీ నేత తిరుపతిరావు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో మొదటి రోజు పాదయాత్ర ముగిశాక విలేకరులతో ఆయన మాట్లాడారు. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనీ చేపట్టలేదని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నాయకులను సమీకరించి రెచ్చగొట్టేలా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అన్నారు. మరోవైపు సీపీఎస్‌ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారు. 2021 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తొడగొట్టిన మంత్రి ఏమయ్యారు?’ అని ఆయన ప్రశ్నించారు. అమరావతి వారికి అరసవల్లిలో ఏం పని అని.. శ్రీకాకుళంనుంచి పాదయాత్ర మొదలు పెడదామని మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారని మహిళా జేఏసీ నేత శైలజ వివరించారు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని