ప్రైవేటు ట్రావెల్స్‌ దసరా దోపిడీ

దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి నుంచి ఛార్జీల రూపంలో వీలైనంత ఎక్కువ పిండుకునేందుకు పలు ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. టిక్కెట్ల ధరలు భారీగా పెంచి ప్రయాణికులను దోపిడీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి.

Updated : 27 Sep 2022 07:00 IST

ఏసీలో రూ.500-600, నాన్‌ ఏసీలో రూ.300 వరకు అదనం

ఈనాడు, అమరావతి: దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే వారి నుంచి ఛార్జీల రూపంలో వీలైనంత ఎక్కువ పిండుకునేందుకు పలు ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు సిద్ధమయ్యాయి. టిక్కెట్ల ధరలు భారీగా పెంచి ప్రయాణికులను దోపిడీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. అక్టోబరు 5న దసరా నేపథ్యంలో.. వివిధ నగరాలు, వేర్వేరు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నవారు, ఉపాధి పనుల కోసం వచ్చిన వారు సొంతూరికి వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో కొందరు వెళ్లారు. మరికొందరు ఈనెల 30, అక్టోబరు 1, 2, 3 తేదీల్లో ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు టిక్కెట్ల ధరలను పెంచాయి. ఏసీ స్లీపర్‌లో సగటున రూ.500-600, ఏసీ సీటర్‌లో రూ.400, నాన్‌ ఏసీ స్లీపర్‌లో రూ.500, నాన్‌ ఏసీ సీటర్‌లో రూ.300 వరకు ధరలను పెంచాయి.

డిమాండున్న మార్గాల్లో ఎక్కువ..
*
విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ ఏసీ సర్వీసుల్లో ఇంద్రకు రూ.785, అమరావతికి రూ.800, నాన్‌ ఏసీలోని సూపర్‌ లగ్జరీకి రూ.650గా ఛార్జీలున్నాయి. అదే కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌లో ఏసీ రూ.1,100-1,200, స్లీపర్‌ రూ.1,200-1,500గా ఉన్నాయి. నాన్‌ ఏసీ స్లీపర్‌ రూ.1,200 వరకు ఉంది. మరికొన్ని ప్రముఖ ట్రావెల్స్‌ సంస్థలు ఏసీ సర్వీసుల్లో టిక్కెట్‌ ధరను రూ.2,000-2,500 వరకూ వసూలు చేస్తున్నాయి.
* విజయవాడ నుంచి కాకినాడకు ఆర్టీసీ ఇంద్ర రూ.490, సూపర్‌ లగ్జరీ రూ.400 ఉంటే... ఇదే ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.300-400 వరకూ అదనంగా ఛార్జీలను నిర్ణయించాయి.
* విజయవాడ నుంచి కడపకు ఆర్టీసీ ఇంద్ర సర్వీసు రూ.828 ఉంటే... ప్రైవేటు ట్రావెల్స్‌లో రూ.1,200-1,500 ఛార్జీగా ఉంది.
* విజయవాడ నుంచి అనంతపురం, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం.. ఇలా ఏ మార్గాల్లో చూసినా బాదుడు ఎక్కువగానే ఉంది.
* ఇక బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు వచ్చే ఏసీ సర్వీసుల్లో టిక్కెట్‌ ధరలను రూ.2వేల వరకు పెంచారు.
* హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాలకు వచ్చే సర్వీసుల్లోనూ వడ్డింపు అధికంగానే ఉంది.
* కొన్ని సంస్థలు విమాన ఛార్జీల మాదిరిగా ఏ రోజుకు ఆ రోజు రద్దీని బట్టి ధరలు పెరుగుతాయని, ముందే బుక్‌ చేసుకుంటే కొంత వరకూ ఉపశమనం ఉంటుందని చెబుతున్నాయి.
* ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు ఆన్‌లైన్‌లో టిక్కెట్ల ధరలు ఎంతో స్పష్టంగా పేర్కొంటూ ప్రయాణికులను దోపిడీ చేస్తున్నా... రవాణాశాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని