కేంద్రం నిధులిస్తామంటే రాష్ట్రం తీసుకోదేం?

కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులిస్తామంటే తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. కొన్ని పథకాలను రాష్ట్ర ఖాతాలో వేసుకుని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Published : 27 Sep 2022 03:59 IST

కొన్ని పథకాలకు ప్రతిపాదనలూ పంపలేదు
కేంద్ర పథకాలకు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరు?
కేంద్ర మంత్రి నారాయణస్వామి ప్రశ్న

ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులిస్తామంటే తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. కొన్ని పథకాలను రాష్ట్ర ఖాతాలో వేసుకుని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘పార్టీలు వేరైనా దేశానికి ప్రధాని ఒకరే కదా.. కేంద్ర పథకాలకు ఆయన ఫొటో ఎందుకు పెట్టరు?’ అని ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏపీలో అమలుపై సమీక్షించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘వివిధ పథకాల కోసం కేంద్రం 2021-22లో ఏపీకి రూ.2,837 కోట్లు కేటాయించింది. ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలిస్తే ఇంకా నిధులివ్వడానికి సిద్ధమే. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం వద్దనడమేంటి? కేంద్ర నిధులు ఎంత వీలైతే అంత తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం కొన్ని కేంద్ర పథకాలనే అమలు చేస్తోంది. పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలే రాలేదు’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘ఏపీలో కొన్ని పథకాల అమలుపై అసంతృప్తి, ఇంకొన్నింటి అమలుపై సంతృప్తితో ఉన్నా. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కార్డులు ఇప్పటికీ రాష్ట్రంలో ఇవ్వలేదు. గృహనిర్మాణాలకు సంబంధించిన సమాచారం కేంద్రానికి పూర్తిగా పంపలేదు. జలజీవన్‌ మిషన్‌ (జేజేఎం) అమలు సరిగా లేదు’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో 125 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్‌ నీరు తాగుతున్నారు. వీటిలో 15 గిరిజన గ్రామాలున్నాయి. జలజీవన్‌ మిషన్‌ కింద ఏపీలో 54 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల్లో మిగతా 41 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించా. ఉద్దానం, ఎ.కొండూరులో కిడ్నీ వ్యాధితో అనేక మంది చనిపోతున్న సంఘటనలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని