సీబీఐవి ఊహాజనిత ఆరోపణలు

ఓఎంసీ కేసులో అన్నీ చట్టప్రకారమే జరిగాయని, సీబీఐ చేసేవి ఊహాజనిత ఆరోపణలేనని మాజీ ఐఏఎస్‌ కృపానందం సోమవారం సీబీఐ కోర్టుకు నివేదించారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడైన గనుల శాఖ

Published : 27 Sep 2022 04:44 IST

 ఓఎంసీ కేసులో కృపానందం వాదన

సీబీఐ కోర్టులో డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో అన్నీ చట్టప్రకారమే జరిగాయని, సీబీఐ చేసేవి ఊహాజనిత ఆరోపణలేనని మాజీ ఐఏఎస్‌ కృపానందం సోమవారం సీబీఐ కోర్టుకు నివేదించారు. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడైన గనుల శాఖ మాజీ కార్యదర్శి కృపానందం దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై సీబీఐ ప్రధాన కోర్టు జడ్జి సీహెచ్‌.రమేశ్‌బాబు విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.శంకర్‌ వాదనలు వినిపిస్తూ.. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని, లైసెన్స్‌లకు సంబంధించి సీబీఐ తప్పుగా అర్థం చేసుకుందన్నారు. అంతేగాకుండా డిప్యూటీ కార్యదర్శి ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ ఆధారంగా తీసుకుందని, అయితే మొత్తం డ్రాఫ్ట్‌ నోట్‌ ఆయనే తయారు చేసి దానికి విరుద్ధంగా సాక్ష్యం చెబితే ఎలా చెల్లుబాటు అవుతుందన్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. ఎన్‌ఎండీసీ చట్టంలోని సెక్షన్‌ 19, 22 కింద విధి నిర్వహణలో పొరపాట్లకు అధికారులకు రక్షణ ఉంటుందన్నారు. దీంతో నిందితుల తరఫు వాదనలు ముగిశాయి. ఇప్పటికే ఇతర నిందితులైన తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపీ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ల డిశ్ఛార్జి పిటిషన్‌లపైనా వాదనలు ముగిశాయి. వీటిపై మంగళవారం సీబీఐ వాదనలు వినిపించనుంది. అనంతరం నిందితుల వాదనలు కొనసాగనున్నాయి. ఈ నెల 29లోగా ఓఎంసీ కేసులో డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ పూర్తి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ కోర్టు విచారణను వేగవంతం చేసింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని