బోధనార్థం.. ఇదం శరీరం

కొన్ని దశాబ్దాల కిందట రక్తదానం చేయాలన్నా వెనకాడేవారు. తర్వాత క్రమంగా అవయవదానాలూ మొదలయ్యాయి. తమ ఆప్తులు జీవన్మృతులుగా మారినప్పుడు (బ్రెయిన్‌డెడ్‌) వారి శరీరంలోని అవయవాలను అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా తమవారిని అమరులను చేయొచ్చన్న అవగాహన పెరిగింది. ఇప్పుడు..

Updated : 27 Sep 2022 06:07 IST

రాష్ట్రంలో పెరుగుతున్న పార్థివదేహ దానాలు 

ముందుగానే వైద్యకళాశాలలకు అంగీకారపత్రం 

 ఈనాడు, అమరావతి

కొన్ని దశాబ్దాల కిందట రక్తదానం చేయాలన్నా వెనకాడేవారు. తర్వాత క్రమంగా అవయవదానాలూ మొదలయ్యాయి. తమ ఆప్తులు జీవన్మృతులుగా మారినప్పుడు (బ్రెయిన్‌డెడ్‌) వారి శరీరంలోని అవయవాలను అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా తమవారిని అమరులను చేయొచ్చన్న అవగాహన పెరిగింది. ఇప్పుడు.. తమ ఆప్తుల పార్థివదేహాలను వైద్య కళాశాలలకు దానం చేసేందుకూ ముందుకొస్తున్నారు. 

మానవ శరీరంలో వివిధ అవయవాల అమరిక తీరును వైద్య విద్యార్థులకు తొలి సంవత్సరంలోనే నేర్పుతారు. అందుకోసం వారికి మృతదేహాల అవసరం ఉంటుంది. అనాటమీ గురించి విద్యార్థులకు నేర్పించేటప్పుడు మృతదేహంలో ఒక్కో భాగాన్నీ తొలగిస్తారు. తర్వాత మళ్లీ వాటిని లోపల పెట్టేస్తారు. గతంలో ఇవి దొరకడం గగనంగా ఉండేది. క్రమంగా ప్రజలు ముందుకు రావడంతో పరిస్థితి కొంత మెరుగయ్యింది. కొంతకాలం క్రితం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సతీమణి వసుమతి పార్థివదేహాన్ని తిరుపతిలోని ఎస్వీ వైద్యకళాశాలకు అప్పగించారు. విశాఖలోని ఆంధ్ర, కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలకు 2019 నుంచి ఇటీవల వరకు 41, 24 భౌతికకాయాలు దానంగా వచ్చాయి. కర్నూలు, గుంటూరు, విజయవాడ వైద్యకళాశాలలకూ మృతదేహాలు దానంగా వస్తున్నాయి.

శ్మశానాల చుట్టూ తిరిగేవాళ్లం
వైద్య కళాశాలలు ప్రారంభించిన తొలినాళ్లలో విద్యార్థుల శిక్షణకు అవసరమైన మృతదేహాలు దొరక్క.. శ్మశానాల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయని కొందరు సీనియర్‌ వైద్యులు చెబుతున్నారు. కేంద్రప్రభుత్వం అనాటమీ చట్టాన్ని 1948లో అమలుచేయగా తొలి దేహదానం 1956లో మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. విశాఖ ఆంధ్రా వైద్యకళాశాలలో ప్రతియేటా 250 మంది విద్యార్థులు ఎంబీబీఎస్‌లో చేరుతారు. వీరిలో 20-25 మంది విద్యార్థులకు ఒక్కో మృతదేహాన్ని కేటాయిస్తారు. తిరుపతి ఎస్వీ వైద్యకళాశాల అనాటమీ విభాగ ప్రొఫెసర్‌ ఒకరు ‘విదేశాల్లో ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో సంతకాలు తీసుకుని మరణానంతరం పార్థివదేహాలు అప్పగించేలా పలువురు తల్లిదండ్రులు ముందే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు’ అని తెలిపారు. విజయవాడకు చెందిన సీనియర్‌ అధ్యాపకులు మాట్లాడుతూ ‘తాత ఎస్‌.మాలేకొండమ రాజు (97) పార్థివదేహాన్ని కొద్దికాలం కిందట గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలకు అప్పగించాం. ఆయన మరణానంతరం కుటుంబంలో అందరం చర్చించుకుని, నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దానం చేశాం’ అని తెలిపారు.

పలు రకాలుగా..
సాధారణంగా మార్చురీ విభాగానికి వచ్చే నాన్‌ ఎమ్మెల్సీ కేసులకు పోలీసుశాఖ నుంచి నాట్‌ట్రేస్డ్‌ సర్టిఫికెట్‌ వస్తే.. వాటినే వైద్యకళాశాలలకు అందజేస్తున్నారు. కర్నూలు బోధనాసుపత్రిలో ఏడాదికి నాలుగైదు అనాథ మృతదేహాలు వస్తున్నాయి. గుంటూరులోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల తమ మరణానంతరం మృతదేహాలు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తంచేస్తూ పలువురు లేఖలు అందజేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల నుంచి అన్‌క్లెయిమ్డ్‌ మృతదేహాలను ఒక్కోటి రూ.25వేలకు కొంటున్నట్లు ఒక ప్రైవేటు వైద్య కళాశాల యాజమాన్య ప్రతినిధి చెప్పారు. అయితే.. ఈ వివరాలు వెలుగులోకి రావట్లేదు. 2017 జనవరి నుంచి 2021 నవంబరు వరకు 64 అన్‌క్లెయిమ్డ్‌ మృతదేహాలను ఆస్పత్రులు, పరిశోధన సంస్థలకు విక్రయించడం ద్వారా తిరువనంతపురం వైద్యకళాశాలకు రూ.6.40 లక్షలు వచ్చాయి. వీటిని ఆస్పత్రి అభివృద్ధి నిధికి జమచేస్తున్నారు.

స్పష్టమైన మార్గదర్శకాలు లేక..
మృతదేహాల దానానికి మార్గదర్శకాలు స్పష్టంగా లేకపోవడంతో ఒక్కోచోట ఒక్కోరకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. దీనివల్ల ఉన్నతాశయంతో పార్థివదేహాల దానానికి ముందుకొచ్చేవారికి కళాశాలల నిర్వాహకుల నుంచి సహకారం లభించట్లేదు. వైద్య కళాశాలలకు పార్థివదేహాలను అప్పగించిన తర్వాత మళ్లీ చూసేందుకు కుటుంబసభ్యులను అనుమతించరు. ‘మృతదేహాలను కనీసం వాళ్లే తెప్పించుకుని, తగిన గౌరవమిచ్చే సంస్కృతి కనిపించట్లేదు. సహజమరణ ధ్రువీకరణ పత్రం కోసం ఒత్తిడి తేకుండా చూడాలి’ అని సావిత్రీబాయి ఫులే ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

ముందే అంగీకారం తెలపాలి
ఎవరైనా చనిపోకముందే.. మరణానంతరం తమ శరీరదానానికి అంగీకారం తెలియజేయాలి. ఒకవేళ తమవారి మృతదేహాలను కుటుంబసభ్యులు దానం చేయాలనుకుంటే రాతపూర్వకంగా తెలియచేయాలి. రిజిస్టర్డ్‌ వైద్యులు సహజ మరణంగా ధ్రువీకరిస్తేనే ఇలా తీసుకోవాలన్నది నిబంధన. మరణించిన ఆరు గంటల్లోగా మృతదేహాన్ని అప్పగించాలి, అది సాధ్యం కాకపోతే ఆస్పత్రి మార్చురీలో భద్రపరచాలి.


అన్‌క్లెయిమ్డ్‌ బాడీలు ఇస్తే కొరత తీరుతుంది

అన్‌క్లెయిమ్డ్‌ బాడీలు దొరకడానికి, వాటిని స్వీకరించడానికి ఎక్కువ సమయం పడుతోంది. అవి ఇస్తే వైద్యకళాశాలలకు కొరత తీరుతుంది. మాకు పార్థివదేహాలు అందగానే వాటిని ఎంబామింగ్‌ చేస్తాం. దీనివల్ల ఎంత కాలమైనా అవి చెడిపోకుండా ఉంటాయి. విశాఖలో సేవాసంస్థల చొరవ వల్ల 2019లో 20, 2020లో 10, 2021లో ఏడు, 2022లో మూడు చొప్పున మృతదేహాలు వైద్యకళాశాలకు అందాయి.

- డాక్టర్‌ రవీంద్ర కిషోర్‌, అనాటమీ విభాగాధిపతి, ఆంధ్ర వైద్య కళాశాల, విశాఖ


ప్రభుత్వం నుంచి గుర్తింపు ఇవ్వాలి

మరణానంతరం శరీరం కాలి బూడిద కావడం, లేదా మట్టిలో కలిసేకన్నా భావి వైద్యులకు జ్ఞానప్రదానం చేసేందుకు శరీరదానం ఉపయోగపడుతోంది. అందుకే పార్థివదేహాలను దానంగా ఇచ్చేందుకు కుటుంబసభ్యులు ముందుకొస్తున్నారు. ఇలా దానం చేసేవారికి ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటే క్రమంగా దానాలు పెరుగుతాయి.

- గూడూరు సీతామహాలక్ష్మి, కన్వీనర్‌, ఏపీ బాడీ డోనార్స్‌ అసోసియేషన్‌


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని