వాహన రద్దీకి కొరతలేదు.. విస్తరణకు చొరవలేదు

దేశంలో అనేక రాష్ట్రాల్లో వాహనరద్దీ తక్కువగా ఉన్న జాతీయ రహదారులనూ విస్తరిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం సుదీర్ఘమైన కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 విస్తరణను కేంద్రం విస్మరిస్తోంది.

Published : 27 Sep 2022 05:25 IST

రాష్ట్రంలో కీలమైనది కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి
526 కి.మీ. మాత్రమే ఆరు వరుసలు
ఇంకా 451 కి.మీ. నాలుగు వరుసలకే పరిమితం
విస్తరణకు ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు

దేశంలో అనేక రాష్ట్రాల్లో వాహనరద్దీ తక్కువగా ఉన్న జాతీయ రహదారులనూ విస్తరిస్తున్నారు. మన రాష్ట్రంలో మాత్రం సుదీర్ఘమైన కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 విస్తరణను కేంద్రం విస్మరిస్తోంది. అత్యధిక వాహనరద్దీ ఉండే ఈ రహదారిలో ఇంకా నాలుగు వరుసలుగా ఉన్న భాగాన్ని వెంటనే ఆరు వరుసలుగా విస్తరించాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దీన్ని పూర్తిగా విస్తరించేలా చూడటంలోనూ విఫలమవుతున్నారు. ఫలితంగా 451 కి.మీ. ఇంకా నాలుగు వరుసలతోనే కొనసాగుతోంది.

స్వర్ణ చతుర్భుజి కింద.. దేశంలో నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ రెండు దశాబ్దాల కిందట నిర్మించిన జాతీయ రహదారుల్లో చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌-16 కూడా ఒకటి. అది మన రాష్ట్రానికి జీవనాడి. ఏపీ, తమిళనాడు నుంచి ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణాకు ఇదే ఏకైక ప్రధాన రహదారి. సరకు రవాణాతోపాటు, నౌకాశ్రయాలకు రాకపోకలు, పారిశ్రామిక అభివృద్ధికీ ఇదే కీలకం. అలాంటి జాతీయ రహదారిలో వాహనరద్దీ అధికంగా ఉన్నా.. దీన్ని ఆరు వరుసలుగా విస్తరించడంలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్లక్ష్యం చూపిస్తోంది.

కోల్‌కతా నుంచి చెన్నై వరకు నాలుగురాష్ట్రాల మీదుగా 1,620 కి.మీ. వెళ్లే జాతీయరహదారి-16లో.. అత్యధికభాగం మన రాష్ట్రంలోనే ఉంది. ఇచ్ఛాపురం నుంచి తడ వరకు 977 కి.మీ.మేరకు ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నాలుగు నౌకాశ్రయాలతోపాటు, కొత్తగా నిర్మించ తలపెట్టిన మూడు నౌకాశ్రయాలకు చేరుకునేందుకు ఈ రహదారే ఆధారం. రాష్ట్రం నుంచి ఏ ఉత్పత్తులను ఎక్కడకు పంపాలన్నా ఈ జాతీయ రహదారిపైనే రాకపోకలు సాగించాలి. ఇంతటి కీలకమైన రహదారిని పూర్తిస్థాయిలో ఆరు వరుసలుగా విస్తరించట్లేదు. మొత్తం 977 కి.మీ.ల్లో 526 కి.మీ. ఆరు వరుసలతో ఉంటే.. మిగిలిన 451 కి.మీ.లు నాలుగు వరుసలకే పరిమితమైంది.

వాహన రద్దీ ఉందని గుర్తించినా..
నిత్యం ప్రయాణించే సగటు వాహనాల సంఖ్య (పాసింజర్‌ కార్‌ యూనిట్స్‌-పీసీయూ)ను బట్టి ఇంజినీర్లు వాహన రద్దీని అంచనా వేస్తారు. 40వేల పీసీయూలు ఉన్న మార్గాలను నాలుగు నుంచి ఆరు వరుసలుగా విస్తరించేలా ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనలు మార్చింది.
* ఇచ్ఛాపురం నుంచి నర్సన్నపేట వరకు 111 కి.మీ.లు నాలుగు వరుసలకే పరిమితమైంది. ఈ సెక్షన్‌లో వాహన రద్దీ తక్కువగా ఉందంటూ.. సామర్థ్య పెంపునకు 15చోట్ల అండర్‌పాస్‌ల నిర్మాణం, సర్వీసు రోడ్లు, కొన్నిచోట్ల కూడళ్ల అభివృద్ధి పనులే చేశారు.
* అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య 159 కి.మీ.లలో వాహనరద్దీ 40 వేల పీసీయూలు ఉంది. సూర్యాపేట-ఖమ్మం-దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే.. అనకాపల్లి-రాజమహేంద్రవరం సెక్షన్‌లో వాహన రద్దీ అనూహ్యంగా పెరగనుంది. అయినా ఇది నాలుగు వరుసలకే పరిమితమైంది.
* కొవ్వూరు-గుండుగొలను మధ్య 70 కి.మీ. 4వరుసల రహదారిని కొత్తగా విస్తరించారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం, విశాఖపట్నంవైపు వెళ్లే వాహనాలన్నీ ఇటే ప్రయాణిస్తున్నాయి. దీనిని 6వరుసలుగా విస్తరించేందుకు భూసేకరణసైతం చేశారు. ఇందులో వంతెనలు, ఇతర నిర్మాణాలను ఆరు వరుసల కోసం నిర్మించారు. కానీ రహదారిని 4 వరుసలకే  పరిమితం చేశారు.
* నెల్లూరు-తడ మధ్య 111 కి.మీ.ల్లో వాహనరద్దీ 45వేల పీసీయూల వరకు ఉంది. దీనిని వెంటనే ఆరు వరుసలుగా విస్తరించాలి. కానీ ఈ సెక్షన్‌ బీవోటీలో 2031 వరకు ప్రస్తుత గుత్తేదారుకు గడువు ఉందనే కారణంతో.. విస్తరించడం లేదు.

ఆరు వరుసలైతే ఉపయోగాలివి
ఎన్‌హెచ్‌ను ఆరు వరుసలుగా విస్తరిస్తే.. వాహనాలు 100-120 కి.మీ. వేగంతో వెళ్లొచ్చు. ఆరు వరుసలతోపాటు, ఇరువైపులా రెండేసి వరుసలతో మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్లేందుకు సర్వీసు రోడ్లు అందుబాటులోకి వస్తాయి. పలు కూడళ్లలో కొత్తగా వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. రహదారికి ఇరువైపులా కంచె వేసి పశువులు రాకుండా చూస్తారు. దీనివల్ల ప్రమాదాల నియంత్రణకు అవకాశం కలుగుతుంది.


పట్టుబట్టి తెచ్చేవారు ఏరీ?

అనేక రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం సానుకూలంగా ఉంది. వీటికి నిధులిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఎన్‌హెచ్‌-16ను కూడా పూర్తిగా ఆరువరుసలు చేయొచ్చు. ఇటీవలే అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య 159 కి.మీ. విస్తరించేందుకు సానుకూలత వ్యక్తం చేసి, డీపీఆర్‌ తయారీకి ఆదేశాలిచ్చారు. ఇంకా ఇచ్ఛాపురం-నరసన్నపేట, కొవ్వూరు-గుండుగొలను, నెల్లూరు-తడ సెక్షన్లలోనూ ఆరు వరుసలకు నేతలు పట్టుబడితే.. విస్తరణకు పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నాయి. ఆయా సెక్షన్లు బీవోటీ, టీవోటీ కింద ఉన్నా.. కేంద్రం తలచుకుంటే విస్తరణ సాధ్యమేనని పేర్కొంటున్నారు.

- ఈనాడు, అమరావతి

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts