నిబంధనల సాకులు.. ‘మీ సేవ’కు బ్రేకులు!

ప్రజలకు అందుబాటులో సేవలను అందించే మీసేవ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అవి అందించే ముఖ్యమైన ఆన్‌లైన్‌ సేవలను క్రమంగా తగ్గిస్తోంది. వాటిని వార్డు/గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తోంది.

Published : 27 Sep 2022 05:25 IST

కీలక సేవలను నిలిపేసిన ప్రభుత్వం
సంక్షేమ పథకాలకు.. చెల్లని ధ్రువీకరణలు

ఈనాడు, అమరావతి: ప్రజలకు అందుబాటులో సేవలను అందించే మీసేవ కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. అవి అందించే ముఖ్యమైన ఆన్‌లైన్‌ సేవలను క్రమంగా తగ్గిస్తోంది. వాటిని వార్డు/గ్రామ సచివాలయాలకు బదిలీ చేస్తోంది. పైగా గ్రామ సచివాలయాల నుంచి తీసుకున్న ధ్రువపత్రాలే వివిధ సంక్షేమ పథకాలకు చెల్లుబాటు అయ్యేలా చేస్తోంది. మీసేవ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.

మీసేవ అందించే పలు కీలక సేవలను ప్రభుత్వం ఏడాదిగా నిలిపేస్తూ వస్తోంది. పేరుకు 553 సేవలున్నా.. అందులో ప్రజలకు ఎక్కువగా అవసరమైనవి 25 మాత్రమే. ప్రస్తుతం ఆర్‌వోఆర్‌ 1బి, ఆదాయ, కుల ధ్రువీకరణ వంటివే అందుబాటులో ఉన్నాయి. మ్యుటేషన్‌లో భాగంగా టైటిల్‌ డీడ్‌, పాస్‌బుక్‌ సేవలు, అడంగల్‌లో సవరణలు, ఎఫ్‌ఎంబీ, కొత్త రేషన్‌ కార్డులకు దరఖాస్తు, వాటిలో సవరణలు, ఆధార్‌ ఈకేవైసీ, జిల్లా స్థాయి సర్వే వంటి వాటిని తొలగించి.. సచివాలయాలకు బదిలీ చేసింది. దీంతో మీసేవలో లావాదేవీల సంఖ్య సుమారు 50 శాతానికి పడిపోయిందని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. సేవలపై వచ్చే ఆదాయం పెరిగితే.. అందుకు అనుగుణంగా నిర్వాహకుల కమీషన్‌నూ పెరగాలి. ప్రభుత్వం ‘ఏ’ కేటగిరీ సేవలకు రుసుమును రూ.35 నుంచి రూ.40కి, ‘బి’ కేటగిరీ సేవలకు రూ.45 నుంచి రూ.50కి పెంచింది. ఆ మొత్తాన్నీ ప్రభుత్వమే తీసుకుంటోంది. పెంపుతో మీసేవ నిర్వాహకులకు ఒరిగిందేమీ లేదు. కమీషన్‌నూ మొత్తాన్నీ ప్రతి నెలా చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. రాష్ట్రంలోని 11వేల మీసేవ కేంద్రాలతో ప్రతి నెలా ప్రభుత్వశాఖలకు సుమారు రూ.15 కోట్ల ఆదాయం సమకూరుతోంది.

సచివాలయంలో తీసుకుంటేనే చెల్లుబాటు!
చేయూత పథకం కోసం ప్రభుత్వం అందించే దరఖాస్తుపై సచివాలయం నుంచి తీసుకున్న ధ్రువపత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొనడం గమనార్హం. ప్రజలను సచివాలయాల వైపు వెళ్లేలా చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిబంధనలు తెస్తోందని మీసేవ నిర్వాహకుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ ఆరోపించారు.
* బయోమెట్రిక్‌ ద్వారా నిర్వాహకులు వేలిముద్రలు వేస్తేనే సర్వర్‌లోకి లాగిన్‌ అయ్యేలా ప్రభుత్వం సాంకేతికతలో మార్పులు తీసుకొచ్చింది. ఒక కేంద్రంలో నలుగురు ఆపరేటర్లు ఉంటే ప్రతి ఒక్కరి లాగిన్‌కూ నిర్వాహకుడు అవసరమవుతోంది. దీంతో ఇతర పనులు మానుకుని అక్కడే ఉండాల్సి వస్తోంది.  
* సంయుక్త కలెక్టర్లు జారీ చేసిన ప్రొసీడింగ్‌, మీసేవ కేంద్రాలను నిర్వహించే ప్రైవేటు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలు పంపాలని 30శాతం కేంద్రాలకు అధికారులు లాగిన్‌కు అవకాశం నిలిపివేశారని నిర్వాహకులు తెలిపారు. ఎప్పుడో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడెక్కడ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts