దేవాదాయశాఖలో పాతుకుపోయిన పీఏ తొలగింపు

చాలాకాలంగా దేవాదాయశాఖ మంత్రుల వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) ఉంటూ, పలు వ్యవహారాలు చక్కబెట్టడంలో అందెవేసిన చేయిగా పేరున్న వ్యక్తికి ప్రస్తుత దేవాదాయ మంత్రి చెక్‌పెట్టారు. తన వద్ద విధులు నిర్వహించవద్దంటూ తొలగించారు.

Published : 27 Sep 2022 05:25 IST

ప్రస్తుత, మాజీ మంత్రుల మధ్య ఆధిపత్యపోరే కారణం

ఈనాడు, అమరావతి: చాలాకాలంగా దేవాదాయశాఖ మంత్రుల వద్ద వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) ఉంటూ, పలు వ్యవహారాలు చక్కబెట్టడంలో అందెవేసిన చేయిగా పేరున్న వ్యక్తికి ప్రస్తుత దేవాదాయ మంత్రి చెక్‌పెట్టారు. తన వద్ద విధులు నిర్వహించవద్దంటూ తొలగించారు. అయితే ఆయన వెంటనే మాజీ మంత్రి వద్దకు వెళ్లి, మరో ప్రజాప్రతినిధి వద్ద విధులు నిర్వహించేలా సిఫార్సు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత, మాజీ దేవాదాయశాఖ మంత్రుల మధ్య ఆధిపత్యేపోరే దీనికి కారణమని తెలుస్తోంది. దేవాదాయశాఖ మంత్రులుగా నియమితులయ్యేవారి వద్ద పొరుగుసేవల ఉద్యోగి ఒకరు చాలాకాలంగా  పీఏగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు అన్నవరం దేవస్థానం నుంచి జీతం చెల్లిస్తున్నారు. గత మంత్రి వద్ద పనిచేసే సమయంలో ఆయన తరపున తితిదే పాటు, వివిధ ప్రధాన ఆలయాల్లో దర్శనాలు తదితరాలన్నీ ఈయనే చూసేవారు. దుర్గగుడికి చెందిన మాడపాటి అతిథిగృహంలో ఓ సూట్‌ రూమ్‌ను ఏళ్లతరబడి తాను ఉండేందుకు ఉంచుకున్నారు. దీనికి రోజుకు రూ.2,500 వరకు అద్దె ఉండగా, ఉచితంగా అందులో ఉంటున్నారు. కొందరు అధికారులపై కూడా పెత్తనం చేస్తుంటారనే పేరుంది. దేవాదాయ మంత్రిగా వెలంపల్లి శ్రీనివాస్‌ స్థానంలో కొట్టు సత్యనారాయణ వచ్చిన తరవాత ఆయనకూ పీఏగా కొనసాగారు.

సమాచారం చేరవేశారని..
మాజీ మంత్రి వెలంపల్లి, ప్రస్తుత మంత్రి కొట్టు సత్యనారాయణ మధ్య కొద్ది రోజులుగా ఆధిపత్యపోరు సాగుతోంది.  దుర్గగుడి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగానికి కొట్టు సత్యనారాయణ పలు సూచనలు చేశారు. అయితే మాజీ మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రం గతంలో ఉన్న విధానమే కొనసాగేలా చూశారు. దీనిపై కొట్టు సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వద్ద సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాజీ మంత్రికి పీఏ చేరవేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చి, అతడిని తొలగించినట్లు సమాచారం. అయితే ఆ పీఏ వెంటనే మాజీ మంత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం దుర్గగుడి ఉత్సవాలకు వచ్చే మాజీ మంత్రి అనుయాయులు, తదితరులకు దర్శనాల ఏర్పాట్లు చూసుకునే బాధ్యత చేపట్టారని తెలిసింది. ఉత్సవాల అనంతరం కొత్తగా ఓ కీలక బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రతినిధి వద్ద పీఏగా చేరేందుకు మాజీ మంత్రి సిఫార్సు చేసినట్లు సమాచారం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts