రాష్ట్రంలో పశువులన్నింటికీ బీమా

రాష్ట్రంలోని పశువులన్నింటికీ బీమా కల్పించేలా అక్టోబరులో కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని, మొత్తం ప్రీమియంలో 80% ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

Published : 28 Sep 2022 05:52 IST

ప్రీమియంలో 80% ప్రభుత్వమే చెల్లిస్తుంది

పశు సంవర్ధక శాఖపై సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పశువులన్నింటికీ బీమా కల్పించేలా అక్టోబరులో కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని, మొత్తం ప్రీమియంలో 80% ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. పశు సంవర్ధకశాఖపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ... ‘ప్రమాదాలు, రోగాలతో పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇలాంటి సమయంలో వారికి బీమా అండగా నిలుస్తుంది. భూసార వైద్యుడిలాగే పశు వైద్యుడి విధానాన్ని అమలు చేయాలి. ఏటా క్రమం తప్పకుండా పశువుల ఆరోగ్యాలను పరిశీలించి, వివరాలను పశు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేయాలి. ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే గ్రామాల్లోని పశువులకూ వైద్యం అందాలి. లంపీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు. తక్కువ పెట్టుబడి, సేంద్రియ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై అమూల్‌ ఆధ్వర్యంలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని సీఎం జగన్‌ సూచించారు.

పశువుల ఆసుపత్రుల్లో నాడు-నేడు: మౌలిక వసతుల కల్పనకు పశువుల ఆసుపత్రుల్లోనూ నాడు-నేడు కింద పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ‘వైయస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవలను నిరంతరం సమీక్షించాలి’ అని సూచించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్‌ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పశుసంవర్థకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ పాల్గొన్నారు.

విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023 ప్రచారం ప్రారంభం: ‘విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023’ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. సంబంధిత బ్రోచర్లనూ ఆవిష్కరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సులువుగా గుర్తించేందుకు రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌ పోర్టల్‌ని ప్రారంభించారు. అరకు నుంచి వచ్చిన థింసా నృత్య కళాకారులతో జగన్‌ మాట్లాడారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని