బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం

తిరుమలలో బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఏడు తలల శేష

Published : 28 Sep 2022 05:53 IST

పెద్దశేషవాహన సేవలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్‌

శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

ఈనాడు, తిరుపతి: తిరుమలలో బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఏడు తలల శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి.. పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాత్రి 7.45 గంటల సమయంలో ముందుగా బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తలపై పట్టువస్త్రాలు పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని స్వామికి సమర్పించారు. అనంతరం వకుళమాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామిని దర్శించుకొని.. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం పొందారు. తర్వాత మాడ వీధులలో పెద్ద శేష వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు ముఖ్యమంత్రికి హారతి ఇచ్చి ఆశీర్వచనాలు అందించారు.  2023 సంత్సరానికి సంబంధించిన క్యాలెండర్లను, వచ్చే ఏడాదికి సంబంధించిన డైరీని సీఎం విడుదల చేశారు. ధర్మకర్తల మండలి సభ్యులు మోరంశెట్టి రాములు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను ముఖ్యమంత్రితో ఆవిష్కరింపజేశారు. ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి సీఎంను తీసుకువచ్చి తులాభారంపై కూర్చోబెట్టి బియ్యంతో తులాభారం వేశారు. ముఖ్యమంత్రి బరువు సుమారు 82 కిలోలు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

విద్యుత్తు సరఫరాలో అంతరాయం..
సీఎం వాహన మండపం వద్దకు చేరుకున్న సమయంలో 3 నుంచి 5 సెకన్ల పాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తిరుమల మొత్తం విద్యుత్తు ఉండగా వాహన మండపం వద్దనే సరఫరా నిలిచిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తితిదే అధికారులతోపాటు సీఎం భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే సరఫరా పునరుద్ధరణతో ఊపిరి పీల్చుకున్నారు.

అరగంటలోనే స్వామి దర్శనం
సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి రెండురోజుల నుంచి రద్దీ నామమాత్రంగానే ఉంది. సోమవారం 52,682 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇదే స్వల్పం. మంగళవారం ఉదయం కూడా రద్దీ లేకపోవడంతో మధ్యాహ్నం వరకు 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

సీవీఎస్‌వోతో వాగ్వాదం..
తిరుపతి మేయర్‌ బంధువు తులసీయాదవ్‌, సునీల్‌చక్రవర్తి, పెంచలయ్య తదితరులు ముఖ్యమంత్రి వచ్చే ముందు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించేందుకు చూశారు. మహద్వారం వద్ద సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా.. వారు వాగ్వాదానికి దిగారు. పది నిమిషాల పాటు వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వచ్చే సమయం కావడంతో లోపలకు అనుమతించలేనని ఆయన గట్టిగా వాదించినా.. చివరికి అనుమతించారు. సీఎం జగన్‌ వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, రోజా, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

నేడు పరకామణి భవనం ప్రారంభం
బుధవారం ఉదయం తిరుమలలో నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నసత్రం కేంద్రం ఎదురుగా రూ. 23 కోట్లతో దీన్ని నిర్మించారు. వేమిరెడ్డి ప్రభాకరెడ్డి దంపతులు నూతనంగా నిర్మించిన అతిథిగృహాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు.


చిత్రంగా తితిదే ప్రదర్శన..!

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక కల్యాణవేదికలో తితిదే ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రారంభించి పరిశీలించారు. శ్రీవారిని దర్శించుకున్న దేశ రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రుల ఫొటోలను ఇక్కడ ఉంచారు. ఇందులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కొందరు ప్రముఖుల ఫొటోలు పెట్టినా వారి పేర్లు, హోదా వివరాలు రాయలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో అసలు పెట్టనేలేదు. తర్వాత హడావుడిగా ఫొటో పెట్టినా తెదేపా అధినేత పేరును ప్రస్తావించలేదు. చివరకు పొరపాటును సరిదిద్దే క్రమంలోనూ చంద్రబాబు ఫొటోకు మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి పేరున్న స్టిక్కర్‌ పెట్టడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని