రైల్వేజోన్‌ సాధ్యం కాదు

ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించిన షాక్‌ నుంచి విశాఖ ప్రజలు తేరుకోక ముందే రైల్వేశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని ఆ

Updated : 28 Sep 2022 06:46 IST

విశాఖ కేంద్రంగా ఏర్పాటు లాభదాయకం కాదని రైల్వేశాఖ స్పష్టీకరణ

దానిపై మీ స్థాయిలో నిర్ణయం తీసుకోవద్దు... కేబినెట్‌కు పంపాలన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి

మిగతా డిమాండ్లకు తెలంగాణ అధికారుల అభ్యంతరం

రాజధానికి రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని ఏపీ విజ్ఞప్తి

విభజన సమస్యలపై దిల్లీలో సమావేశం

ఈనాడు - దిల్లీ

ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించిన షాక్‌ నుంచి విశాఖ ప్రజలు తేరుకోక ముందే రైల్వేశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు మంగళవారం కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కుండ బద్దలుకొట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య విభజన సమస్యల పరిష్కారంతో పాటు, ఆ చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుపై ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో రైల్వేబోర్డు అధికారులు జోన్‌ అంశంపై స్పష్టత ఇచ్చారు. కొత్త జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకే ఆ డీపీఆర్‌ను ఆమోదించలేదని పేర్కొన్నట్లు సమాచారం. అందుకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తంచేసినట్లు తెలిసింది. లాభదాయకం కాదనే దానికి చట్టపరంగా హామీ ఇచ్చారని, లాభాలు వస్తే ఏ చట్టంతో అవసరం లేకుండా రైల్వేశాఖ ఏర్పాటు చేసేదని చెప్పారు. లాభం లేకపోయినా రాజకీయ కారణాల దృష్ట్యా కేంద్రం దేశంలో ఎన్నో జోన్లను ఏర్పాటుచేసిందని, అందువల్ల విశాఖ జోన్‌ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ సమయంలో కేంద్రహోంశాఖ కార్యదర్శి జోక్యం చేసుకుంటూ జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదన్న నిర్ణయం మీ స్థాయిలోనే తీసుకోవద్దని, ఆ విషయాన్ని కేబినెట్‌ ముందు పెడితే, దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని సూచించినట్లు తెలిసింది.

ఏపీ అధికారులు రాజధానికి మరో రూ.వెయ్యి కోట్లు కోరినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు ఇస్తామన్నారని, ఇప్పటివరకు రూ.1,500 కోట్లు ఇచ్చినందున మిగిలిన రూ.1,000 కోట్లను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తిచేసినట్లు తెలిసింది. అందుకు కేంద్ర అధికారులు స్పందిస్తూ ఇప్పటివరకు చేసిన ఖర్చులకు లెక్కలు చెబితే మిగిలిన నిధుల విడుదల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీ అధికారులు శివరామకృష్ణన్‌ కమిటీ రాజధాని నిర్మాణానికి రూ.29వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పినందున, ఆమేరకు నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది.

విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9లోని సంస్థలను షీలాబిడే సిఫార్సుల ప్రకారం, షెడ్యూల్‌ 10లోని సంస్థలను జనాభా ప్రాతిపదికన పంచాలని ఏపీ అధికారులు కోరగా, అందుకు తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. హెడ్‌క్వార్టర్స్‌ అన్న పదంపై కోర్టులో కేసులు దాఖలయ్యాయని, అవి తేలేవరకూ షీలాబిడే కమిటీ సిఫార్సుల అమలుకు వీల్లేదని స్పష్టంచేశారు. షెడ్యూల్‌ 10లోని ఆస్తులు ఎక్కడున్నవి ఆ రాష్ట్రానికే చెందుతాయని, నగదును మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం పంచుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పిందని, ఆ విషయంలో మార్పులు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఎఫ్‌సీని విభజించాలని ఏపీ అధికారులు కోరగా, అలా చేయాలంటే హెడ్‌క్వార్టర్స్‌ అన్న పదంపై స్పష్టత రావాలని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఈ సంస్థకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న 238 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని, ఇప్పటికీ ఈ విషయం కోర్టులో ఉందని చెప్పారు. ఆ భూమి విషయాన్ని పక్కనపెట్టి, మిగిలిన ఆస్తుల విభజనను పూర్తిచేయాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రహోంశాఖ కార్యదర్శి స్పందిస్తూ హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకొని ఈ కేసును పరిశీలించాలని సిబ్బందికి చెప్పారు.

కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఉమ్మడి సంస్థల ఖర్చులు, విదేశీ ఆర్థికసాయంతో చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల పంపిణీపై చర్చ జరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం కాగ్‌ సాయం తీసుకోవడానికి రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. పౌరసరఫరాల కార్పొరేషన్‌ విభజనకు ముందు తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఉపయోగించుకున్న క్యాష్‌ క్రెడిట్‌ బకాయిలను చెల్లించేలా చూడాలని ఏపీ అధికారులు కోరగా, తెలంగాణ అధికారులు అందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం విడుదల చేసే ఆహార సబ్సిడీలో తెలంగాణ వాటాను బదిలీ చేస్తామని ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌ లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆ క్యాష్‌క్రెడిట్‌ అసలును చెల్లిస్తామని తెలంగాణ అధికారులు షరతు విధించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 50, 51, 56 కింద ఉన్న పన్ను విషయాల్లోని లోపాలను సరిదిద్దుతూ విభజన చట్టాన్ని సవరించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో పన్ను రీఫండ్‌లు ఏవైనా ఉంటే అవి ఆ ప్రాంతానికే చెందుతాయని, పన్ను బకాయిలు ఉంటే రెండు రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన చెల్లించాలని చెప్పారని, దీనివల్ల రీఫండ్‌లలో ఎక్కువ భాగం తెలంగాణకు వెళ్తుంటే, బకాయిల్లో ఎక్కువ భారాన్ని ఏపీ ప్రభుత్వం భరించాల్సి వస్తోందని, ఈ లోపాన్ని సరిదిద్దుతూ చట్టసవరణ చేయాలని ఏపీ అధికారులు కోరారు. అందుకు తెలంగాణ వారు ససేమిరా అన్నారు. తెలంగాణ ఏర్పాటైన 8 ఏళ్ల తర్వాత చట్టాన్ని సవరించడం కుదరదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల గురించి అడగ్గా... నీతి ఆయోగ్‌ అయిదేళ్లకే ఆ నిధులను సిఫార్సు చేసిందని, ఇప్పటికే ఆ మొత్తం ఇచ్చామని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటివరకు రూ.1,750 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,049 కోట్లకే వినియోగ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిందని, మిగిలిన లెక్కలు చెప్పిన తర్వాత తదుపరి విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమావేశంపై ఏపీ ప్రభుత్వ అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. సానుకూలంగా జరిగిందని.. మూడు, నాలుగు అంశాల్లో ఏపీకి అనుకూలంగా ఉత్తర్వులు రావొచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, ఆర్థికశాఖ కార్యదర్శి నటరాజ్‌ గుల్జార్‌, రోడ్లు, భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, పౌరసరఫరాలశాఖ కార్యదర్శి అరుణ్‌కుమార్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి, దిల్లీలో ఏపీ భవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో తమ ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనల గురించి 5 పేజీల పత్రికా ప్రకటన విడుదల చేయగా, ఏపీ అధికారులు ఏమీ చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని డిమాండ్లకూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అన్ని సమస్యలూ అపరిష్కృతంగానే మిగిలినట్లయింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts