డిజిటల్‌ చెల్లింపులకు ‘మోకాలడ్డు’

చిల్లర దుకాణాలు.. రోడ్డు పక్కన టిఫిన్‌ బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ ఎక్కడైనా జీపే, ఫోన్‌పే లాంటి డిజిటల్‌ మార్గాల్లో బిల్లులు చెల్లించగలం. కానీ, ఏటా దాదాపు రూ.25 వేల కోట్ల

Updated : 28 Sep 2022 05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇప్పటికీ నగదే..

పారదర్శకతకు తిలోదకాలు... అక్రమాలకు తలుపులు

ఏటా రూ.25 వేల కోట్ల లావాదేవీలన్నీ నగదులోనే

డిజిటల్‌ చెల్లింపులు తెస్తామని నెలలు గడుస్తున్నా కానరాని చర్యలు

ఈనాడు, అమరావతి

చిల్లర దుకాణాలు.. రోడ్డు పక్కన టిఫిన్‌ బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ ఎక్కడైనా జీపే, ఫోన్‌పే లాంటి డిజిటల్‌ మార్గాల్లో బిల్లులు చెల్లించగలం. కానీ, ఏటా దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన సరకు అమ్ముతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం డబ్బులిస్తేనే మందు ఇస్తారు. ‘ఓన్లీ క్యాష్‌.. నో డిజిటల్‌ పేమెంట్‌’ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీనిపై అధికారుల్ని ప్రశ్నిస్తే... ‘త్వరలోనే’ అంటూ దాటవేస్తున్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా కార్యాచరణ లేదు. ఉద్దేశపూర్వకంగానే మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల్ని అనుమతించట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగదు లావాదేవీలనే అనుమతించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏ వెసులుబాటు కోసం ఇలా చేస్తున్నారన్నది  మిస్టరీగానే ఉంది.

పారదర్శకత కోసం అవసరమంటూనే... 

‘ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెడతాం. లావాదేవీల్లో పారదర్శకత, అక్రమాల నిరోధం కోసం డిజిటల్‌ చెల్లింపుల్ని అమలుచేస్తాం’ అని 2021-22 సంవత్సరానికి సంబంధించి మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ గతేడాది అక్టోబరు 1న జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అయినా ఇప్పటివరకూ డిజిటల్‌ చెల్లింపుల ఏర్పాట్లకు అతీ గతీ లేకపోవడంలో ఆంతర్యమేంటి? అక్రమాలకు సహకరిస్తున్నట్లు కాదా? పారదర్శకతకు పాతరేసినట్లు కాదా?

15 రోజుల్లో అన్నారు... మూడు నెలలు దాటిపోయింది 

‘మరో 15 రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తెస్తాం’ అని ఈ ఏడాది మార్చి 20న నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ సమాధానమిచ్చారు. మూడు నెలలు దాటినా ఇప్పటికీ ఎక్కడా ఆ ఊసే లేదు. కనీసం ప్రయోగాత్మకంగానైనా ఎక్కడా అమలు చేయలేదు.

రోజుకు రూ.70 కోట్లు... ఏడాదికి రూ.25,200 కోట్లు 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలున్నాయి. వాటిలో రోజుకు సగటున రూ.70 కోట్ల విలువైన మద్యం అమ్ముతారు. ఆ లెక్కన నెలకు రూ.2,100 కోట్లు, ఏడాదికి రూ.25,200 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తుంటారు. ఇంత వ్యాపారం జరుగుతున్నా ఎక్కడా డిజిటల్‌ చెల్లింపులకు ఆస్కారం లేదు. నగదు చెల్లించి మద్యం కొనాల్సిందే. 

నగదు మాయం వంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది కదా! 

మద్యం విక్రయాల ద్వారా వచ్చిన నగదును సిబ్బంది మాయం చేశారని, లెక్కల్లో చూపించకుండా అవకతవకలకు పాల్పడ్డారనే ఘటనలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. నగదు లావాదేవీల వల్లే ఇలా జరుగుతోంది. అదే డిజిటల్‌ చెల్లింపులైతే ఇలాంటి అక్రమాలకు ఆస్కారమే ఉండదు. అయినా కానీ ప్రభుత్వం నగదు లావాదేవీలకే మొగ్గుచూపటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

దేశవ్యాప్తంగా రోజుకు రూ.20 వేల కోట్ల ఆన్‌లైన్‌ చెల్లింపులు 

దేశవ్యాప్తంగా రోజుకు సగటున రూ.20 వేల కోట్ల మేర డిజిటల్‌ చెల్లింపులు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మన్‌కీ బాత్‌లో చెప్పారు. ఓ వైపు కేంద్రం నగదు చలామణీని తగ్గించే చర్యలు చేపడుతుంటే.. రాష్ట్రప్రభుత్వం స్వయంగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారంలో నగదును మాత్రమే అనుమతించటం వెనుక ఉన్న కారణాలేమిటి? అనేది అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం సీఎఫ్‌ఎంఎస్‌తో ఇంటిగ్రేట్‌ చేసే ప్రక్రియ నడుస్తోందని, అది పూర్తయిన తర్వాత డిజిటల్‌ లావాదేవీలు అందుబాటులోకి తీసుకొస్తామని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు.


ఆర్టీసీ బస్సుల్లోనూ డిజిటల్‌ లావాదేవీలు.. ఇక్కడెందుకు లేవు?

‘ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనేవారిలో ఎక్కువమంది రోజుకూలీలు, ఏ పూట సంపాదనను ఆ పూట ఖర్చు చేసేవారే. వారికి డిజిటల్‌ పేమెంట్లపై అవగాహన ఉండదు. వారి ఖాతాల్లో డబ్బులూ ఉండవు. డిజిటల్‌ చెల్లింపులు ప్రవేశపెట్టినా ఆ లావాదేవీలు నామమాత్రంగానే ఉంటాయి. దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదు’ అని ఎక్సైజ్‌ అధికారులు అనధికారిక సంభాషణల్లో చెబుతున్నారు. అదే నిరుపేదలు, రోజుకూలీలు సహా అనేకమంది సామాన్యులు నిత్యం ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో ఇటీవల డిజిటల్‌ చెల్లింపులకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, యాప్‌ల ద్వారా చెల్లించి, బస్సుల్లో టికెట్లు తీసుకునే వీలు కల్పించింది. రోజుకు రూ.16 కోట్ల రాబడి వచ్చే ఆర్టీసీ బస్సుల్లోనే ఇలా చేస్తున్నప్పుడు మద్యం దుకాణాల్లో ఎందుకు వీలు కావట్లేదో, దాని లోగుట్టు ఏమిటో? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts