మెట్ట పంటలకు బెట్ట దెబ్బ

ఖరీఫ్‌లో వర్షాభావం వెంటాడుతోంది. 20 రోజులుగా వానల్లేకపోవడంతో.. పలు మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల

Updated : 28 Sep 2022 05:27 IST

20 రోజులుగా చినుకు జాడ లేదు

వాడిపోతున్న వేరుసెనగ నెర్రెలిస్తున్న పత్తి పొలాలు

రైతుల్లో ఆందోళన

ఈనాడు, అమరావతి: ఖరీఫ్‌లో వర్షాభావం వెంటాడుతోంది. 20 రోజులుగా వానల్లేకపోవడంతో.. పలు మండలాల్లో బెట్ట పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు వానల్లేక, ఇటు ఎండలు పెరగడంతో ఉదయం 10 గంటలకే పైర్లు తలవాలుస్తున్నాయి. కురిసిన చోటే కుండపోత వానలతో.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అధిక శాతం మండలాల్లో ఒకటి రెండు రోజులు కుండపోతగా కురిసి.. తర్వాత వానలే పడలేదు. దీంతో లక్షలాది ఎకరాల్లో వేరుసెనగ సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి వాడిపోతోంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఇటీవల నాటిన మిరప మొక్కలు అక్కడక్కడా ఎండుముఖం పడుతున్నాయనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వానలు కురిసినా.. ఇటీవల వరకు వర్షాభావం నెలకొనడంతో కొన్నిచోట్ల మొక్కజొన్న ఎండుముఖం పట్టింది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వారం నుంచి వానలు లేవు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ చిరుజల్లులే కురిశాయి.

106 మండలాల్లో లోటే..
ఖరీఫ్‌ ఆరంభం నుంచి చూస్తే రాష్ట్రంలో 106 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. వైఎస్‌ఆర్‌ జిల్లాలో దువ్వూరు (-57.3), రాజుపాలెం (-56.2), కమలాపురం (-52.2), బి.కోడూరు (-47.8), బద్వేలు (-45.2), కాశినాయన (-43.7), పోరుమామిళ్ల (-43.2), చాపాడు (-40.0), వీరపునాయనిపల్లె (-39.4), ఎర్రగుంట్ల (39.4), కలశపాడు (-37.7), పెండ్లిమర్రి (-35.2), పెద్దముడియం (-34.2), ముద్దనూరు (-32.9) మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది.
* ప్రకాశం జిల్లా తాళ్లూరు (-57.1), యర్రగొండపాలెం (-47.6), అర్ధవీడు (-38.9), సంతనూతలపాడు (-34.2)మండలాలతోపాటు ఒంగోలు, పెద్దారవీడు, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, జరుగుమల్లి, పుల్లలచెరువు, జరుగుమల్లి, మద్దిపాడు, కొత్తపట్నం, దొనకొండ, సింగరాయకొండ మండలాల్లో లోటు వర్షపాతం ఉంది.

* పల్నాడు జిల్లా బెల్లంకొండ, అమరావతి, దాచేపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, గురజాల, దుర్గి, సత్తెనపల్లి, కారంపూడి, ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు, గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, వీరులపాడు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు, గుడ్లూరు, కందుకూరు, రాపూరు, కలువోయ మండలాల్లోనూ లోటు వర్షపాతం నమోదైంది.

* రాష్ట్రంలోని పలు మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే ఉంది. అయితే అక్కడా పైర్లు బెట్టకొచ్చి వాడుముఖం పట్టాయి. ఒకటి రెండు రోజులు కుండపోత వానలు పడటంతో వర్షపాత శాతం పెరిగినా.. 15 రోజుల నుంచి కురవలేదని రైతులు పేర్కొంటున్నారు.


కీలక సమయంలో వానల్లేక..

రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతం వేరుసెనగ కాపు దశలో ఉంది. ఈ దశలో వానల్లేకపోవడంతో కాయ గట్టిపడదనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల పైరు ఎండుముఖం పట్టింది. దిగుబడిపై ఆశ వదులుకుంటున్న రైతులు.. అక్కడక్కడా పైరు దున్నేస్తున్నారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. పల్నాడు, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో పత్తి ఎండుముఖం పడుతోంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పత్తి, ఆముదం పంటలు బెట్టబారిన పడ్డాయి.


38 డిగ్రీల స్థాయిలో ఎండలు

సాధారణంగా సెప్టెంబరులో 33 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలే ఉంటాయి. అయితే ఇప్పుడు 38 డిగ్రీలను దాటాయి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉంది. రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో 50% లోపే నమోదవుతోంది. శనివారం అత్యధికంగా కావలిలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లోని వివిధ ప్రాంతాల్లో 34 డిగ్రీలకు మించి నమోదయ్యాయి.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని