సంక్షిప్త వార్తలు(21)

అధునాతన బ్యాటరీ పరిజ్ఞానం దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా మారుతోందని కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారు జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దకాలంగా బ్యాటరీల వినియోగంలో గణనీయమైన మార్పులొచ్చాయని, సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు,

Updated : 29 Sep 2022 06:29 IST

ఆర్థిక వ్యవస్థలో కీలకంగా బ్యాటరీ పరిజ్ఞానం

రక్షణమంత్రి శాస్త్ర సలహాదారు సతీశ్‌రెడ్డి

ఈనాడు, విశాఖపట్నం: అధునాతన బ్యాటరీ పరిజ్ఞానం దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా మారుతోందని కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సలహాదారు జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దకాలంగా బ్యాటరీల వినియోగంలో గణనీయమైన మార్పులొచ్చాయని, సెల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల వినియోగం భారీగా పెరగడంతో ఆయా సంస్థలు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో తయారుచేసేలా పరిశోధనలు చేస్తున్నాయని గుర్తు చేశారు. బుధవారం విశాఖలోని నావికా సమరశాస్త్ర సాంకేతిక ప్రయోగశాలలో (ఎన్‌ఎస్‌టీఎల్‌) ‘ఎలక్ట్రో కెమికల్‌ ఎనర్జీ కన్వర్షన్‌ అండ్‌ స్టోరేజ్‌-2022’ (ఈకోస్‌-2022) అనే అంశంపై ప్రారంభమైన 2 రోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈకోస్‌ కన్వీనర్‌ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమైన బ్యాటరీల్లో మరిన్ని విప్లవాత్మకమైన పరిజ్ఞానాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్‌.ఎస్‌.టి.ఎల్‌. సంచాలకుడు వై.శ్రీనివాసరావు, ‘నావల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌’ డైరెక్టరు జనరల్‌ బి.హెచ్‌.వి.ఎస్‌.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


సీఎంఏలో మెరిసిన రాష్ట్ర విద్యార్థులు

ప్రకాశం విద్యార్థికి జాతీయ స్థాయి 8వ ర్యాంకు

తర్లుపాడు, పలమనేరు, న్యూస్‌టుడే: కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(సీఎంఏ) ఇంటర్‌, తుది పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు జాతీయ ర్యాంకులు సాధించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకట కాశిరెడ్డి సీఎంఏ తుది పరీక్షలో జాతీయస్థాయి 8వ ర్యాంకు సాధించారు. మంగళవారం ‘కాస్ట్‌ అకౌంటెంట్్స ఆఫ్‌ ఇండియా’ ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. పరీక్షకు 18 వేల మంది హాజరు కాగా అందులో 1,241 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో వెంకట కాశిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించడం గమనార్హం. ఆటో డ్రైవర్‌ గొలమారి వెంకటరెడ్డి కుమారుడు కాశిరెడ్డి. తండ్రి కష్టాన్ని చూసి పట్టుదలతో చదివినట్లు కాశిరెడ్డి తెలిపారు. 

* చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన రిషబ్‌ ఓస్వాల్‌, భాగీరథి శశిశ్రీనివాస్‌ ఇద్దరూ సీఎంఏ ఇంటర్‌లో వరుసగా మొదటి, మూడో ర్యాంకు సాధించారు.


రోడ్డు చూడ తరమా..

నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలోని బనగానపల్లి-నంద్యాల ప్రధాన రహదారిలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో రహదారి గుంతలు పడి అధ్వానంగా మారింది. సుమారు 100 మీటర్ల దారిలో 100కుపైగా గుంతలు ఉండటం గమనార్హం. అధికారులు నామమాత్రంగా మరమ్మతులు చేస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. సమీపంలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పట్టించుకున్న నాథుడే లేరని పట్టణ ప్రజలు వాపోతున్నారు. వర్షం పడిందంటే మరీ దారుణంగా ఉంటుంది. 

- న్యూస్‌టుడే, బనగానపల్లి పట్టణం


విశాఖ నుంచి సీబీఐ అదనపు కోర్టుల తరలింపు

హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి. కర్నూలు న్యాయవిభాగం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఉన్న రెండో అదనపు సీబీఐ కోర్టును కర్నూలుకు, మూడో అదనపు సీబీఐ కోర్టును విజయవాడకు తరలించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్‌ (నియామకాలు), (పరిపాలన-ఎఫ్‌ఏసీ) ఆలపాటి గిరిధర్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుల తరలింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను (పీడీజే) కోరారు. 2020 ఫిబ్రవరి 10న ప్రభుత్వం ఇచ్చిన జీవో 25కు అనుగుణంగా సీబీఐ కేసులను సంబంధిత విచారణ పరిధిలోని న్యాయస్థానాలకు బదిలీ చేయాలని విశాఖలోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా, కర్నూలు జిల్లాల పీడీజేలతో సంప్రదింపుల అనంతరం సీబీఐ అదనపు కోర్టుల తరలింపునకు హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. సీబీఐ న్యాయస్థానం కర్నూలు రావడంపట్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.ఆర్‌.కృష్ణ, ప్రధాన కార్యదర్శి కాటం రంగడుతోపాటు పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.


ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పనుల నిలిపివేత

వెంకటాచలం, న్యూస్‌టుడే: కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం భవన నిర్మాణ పనులను బుధవారం నిలిపివేశారు. సంబంధిత స్థలం తమదని కొందరు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్లు రెవెన్యూ వర్గాలు అనధికారికంగా తెలిపాయి. ఈ కేంద్రానికి సొంత భవనం నిర్మించేందుకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో 5.05 ఎకరాలను ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు పనులను ఆపేశారు.


3 రోజులు భారీ వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంట గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. వీటి ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు తెలంగాణతో పాటు, కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం, తమిళనాడు,పాండిచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. గత రెండు రోజులుగా ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఏలూరు జిల్లా చాట్రాయిలో 118.5, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 80.0, ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం కొర్లమండలో 76.75 మి.మీ గరిష్ఠ వర్షపాతం నమోదైంది.


నేడు ‘పోలవరం’ ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల కారణంగా రాష్ట్ర పరిధిలో ఏర్పడనున్న ముంపు నష్టంపై తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు వాణిని వినిపించనుంది. పోలవరం ప్రాజెక్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గురువారం ఆన్‌లైన్‌ వేదికగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ మురళీధర్‌ హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న ప్రాంతంపై ఉమ్మడి సర్వే నిర్వహించేందుకు ప్రభావిత రాష్ట్రాల ఈఎన్‌సీలతో కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ముంపు ప్రాంతాల రక్షణకు చేపట్టాల్సిన నిర్మాణాలు, స్థానిక పరీవాహకంలో వాగులు పోటెత్తి ఏర్పడుతున్న నష్టం అంచనాకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని తెలంగాణ గట్టిగా కోరే అవకాశాలు ఉన్నాయి.


మధ్యప్రదేశ్‌ బొగ్గును మాకివ్వండి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు (ఏపీఎండీసీ) చెందిన సుల్యారీ గని (మధ్యప్రదేశ్‌) నుంచి వచ్చే బొగ్గును ఏపీ జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు వినియోగించుకునే వెసులుబాటును కల్పించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. బొగ్గు కొరత కారణంగా థర్మల్‌ ప్లాంట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ గని నుంచి మూడేళ్లపాటు బొగ్గు సరఫరాకు నిర్వహించిన టెండరును అదానీ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు అదే బొగ్గును జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు వాడుకునేలా అనుమతించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఒప్పందం నుంచి వైదొలిగేలా అదానీ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. దీనిపై అదానీ స్పందన ఆధారంగా కేంద్రం నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ బొగ్గు గనికి 8 కి.మీల దూరంలో అదానీకి థర్మల్‌ కేంద్రం ఉంది. ఈ కారణంగా ఆ సంస్థ అంగీకరిస్తుందా అనే సందేహం అధికారుల్లో ఉంది.


జీఎంఆర్‌, ఏపీ మారిటైం బోర్డుదే బాధ్యత

మడ అడవులకు నష్టంపై ఎన్జీటీ స్పష్టీకరణ

ఈనాడు, చెన్నై: కాకినాడ తీరంలో డ్రెడ్జింగ్‌ పనులతో మడ అడవులు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించిన నేపథ్యంలో ఏపీ మారిటైం బోర్డు, జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌లను బాధ్యుల్ని చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దక్షిణాది జోన్‌ (చెన్నై) తీర్పు వెల్లడించింది. పరిహారాన్ని చెల్లించడంతో పాటు అక్కడ పచ్చదనం పూర్వ స్థితికి వచ్చేలా చేయాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులోని ఎల్‌ఎన్‌జీ ఇంపోర్ట్‌ ఫెసిలిటీ ప్రాజెక్టును తీసుకురావడంతో పాటు 7వ బెర్త్‌లో జెట్టీ ఏర్పాటు చేయడం, డ్రెడ్జింగ్‌ పనులతో పర్యావరణ విఘాతానికి పాల్పడుతున్నారంటూ విశాఖకు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, కాకినాడకు చెందిన పర్యావరణవేత్త కె.మృత్యుంజయరావు 2020లో ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కోరం సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, డాక్టర్‌ సత్యగోపాల్‌ విచారణ చేపట్టారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్‌ కె.రామకృష్ణన్‌ తీర్పు వెల్లడించారు. పనులు పూర్తయ్యాక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఎస్‌సీజెడ్‌ఎంఏకు 6 నెలల గడువు ఇచ్చారు.


నీటి కొరత ఉన్న బేసిన్‌ నుంచి మళ్లింపు సరికాదు

కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణలో తెలంగాణ సాక్షి పండిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: నీటి కొరత ఉన్న పరీవాహకం(బేసిన్‌) నుంచి మళ్లింపు సరికాదని, మిగులు జలాలున్న పరీవాహకం నుంచి మాత్రమే మళ్లించడం సమంజసమని కృష్ణా ట్రైబ్యునల్‌ ఎదుట తెలంగాణ తరఫు సాక్షి, కేంద్ర జలసంఘం మాజీ సభ్యుడు చేతన్‌ పండిట్‌ చెప్పారు. బుధవారం దిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ విచారణ ప్రారంభమెంiది. ఈ సందర్భంగా సాక్షిని ఏపీ తరఫు న్యాయవాది వెంకటరమణి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. కేడబ్ల్యూడీటీ-1లో పేర్కొన్న అంశాల్లో ప్రొటెక్షన్‌(రక్షణ), ప్రియారిటీ(ప్రాధాన్యం)లకు తేడా ఉందని చేతన్‌ పండిట్‌ స్పష్టతనిచ్చారు. కృష్ణా బేసిన్‌ బయట వినియోగం చట్టబద్ధం కాదని చెప్పడం లేదని, బేసిన్‌ లోపల అవసరాలు తీరకుండా బయటికి తరలించడం సరికాదన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. విచారణకు తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ రామకృష్ణారావు, అంతరాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్‌, ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ విజయకుమార్‌ తదితరులు హాజరయ్యారు.


ధర్మాసనం వద్దకు ఏపీహెచ్‌ఎంఈఎల్‌ డైరెక్టర్ల కుదింపు వివాదం

ఈనాడు, అమరావతి: ఏపీ విభజన చట్ట ప్రకారం తొమ్మిదో షెడ్యూల్‌లో ఉన్న ఏపీ భారీ యంత్రాల, ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో (ఏపీహెచ్‌ఎంఈఎల్‌) డైరెక్టర్ల సంఖ్య కుదింపుపై వ్యాజ్యాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్‌ బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చే విషయమై తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లిలో ఉన్న ఏపీహెచ్‌ఎంఈఎల్‌లో 89శాతం సింగరేణి కాలరీస్‌కు వాటా ఉంది. కొండపల్లి ప్రాంత రైతులకు 11శాతం వాటా ఉంది. రైతుల ప్రతినిధులుగా ఏపీహెచ్‌ఎంఈఎల్‌లో ముగ్గురు డైరెక్టర్లు కొనసాగుతున్నారు. సింగరేణి కాలరీస్‌ తరఫున ఏడుగురు డైరెక్టర్లు ఉంటున్నారు. రైతుల తరఫు డైరెక్టర్ల సంఖ్యను మూడు నుంచి ఒకరికి కుదించే నిమిత్తం.. ఏపీహెచ్‌ఎంఈఎల్‌ ఎండీ ఈనెల 5న వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించబోతున్నారంటూ రైతుల తరఫున ముగ్గురు డైరెక్టర్లు కూచిపూడి శ్రీనివాసరావు, పీఎస్‌ఆర్‌ వెంకటేశ్వరరావు, జె శేషగిరిరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 1న విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి జనరల్‌ బాడీ సమావేశం, ఇ-ఓటింగ్‌ ప్రక్రియను నిలుపుదల చేశారు. మరోవైపు హైకోర్టు రిజిస్ట్రీపై ఆరోపణలతో ఏపీహెచ్‌ఎంఈఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) కె.ప్రసాదరావు ఈ వ్యాజ్యంలో గతంలో కౌంటరు వేయడంపై పిటిషనర్ల తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ అభ్యంతరం తెలిపారు. రిజిస్ట్రీకి దురుద్దేశాలు ఆపాదిస్తూ కౌంటరు వేయడాన్ని న్యాయమూర్తీ తప్పుబట్టారు. దీంతో కౌంటరును ఉపసంహరించుకున్న ప్రసాదరావు.. తాజాగా మరో కౌంటరు వేసి అందులో క్షమాపణలు కోరారు.


వెబ్‌సైట్‌లో ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో మార్కుల కోసం రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థుల ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.


ఏపీ బెవరేజెస్‌, ఎక్సైజ్‌శాఖలపై పిటిషన్‌ కొట్టివేసిన సీసీఐ

దిల్లీ: మద్యం కొనుగోళ్లలో ఏపీ బెవరేజెస్‌, ఏపీ ఎక్సైజ్‌శాఖలు పక్షపాతం వహిస్తున్నాయంటూ ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్‌ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఇస్వాయ్‌) వేసిన పిటిషన్‌ను కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొట్టివేసింది. కాంపిటీషన్‌ చట్టంలోని సెక్షన్‌ 4ను ఉల్లంఘించారన్న ఆరోపణలను నిరూపించే ప్రాథమిక ఆధారాలేమీ లేనందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు సీసీఐ ఈ నెల 19న ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది.  దేశంలో మద్యం వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ స్పిరిట్స్‌, వైన్స్‌ కంపెనీలు ఇస్వాయ్‌లో సభ్యత్వం కలిగి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌ బెవరేజేస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీబీసీఎల్‌), ఏపీ ఎక్సైజ్‌ శాఖ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ తమ బ్రాండ్ల మద్యాన్ని కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల తాము నష్టపోతున్నామని ఆ కంపెనీలు పిటిషన్‌ వేశాయి. అయితే దీనికి ప్రాథమిక ఆధారాలేమీ లేనందున పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సీసీఐ వెల్లడించింది.


రాష్ట్రానికి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు

ఈనాడు, అమరావతి: పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు రాష్ట్రానికి రావడం సంతోషమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అమర్‌నాథ్‌ ఈ అవార్డును అందుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఆయన కలిసి ఈ అవార్డు వివరాలను తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రికి వివరించారు.  


చిత్తడి నేలల ఆక్రమణలపై సమాచార సేకరణకు కమిటీ: మంత్రి పెద్దిరెడ్డి

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న చిత్తడి నేలల్లో కొంత మేర ఆక్రమణలున్నాయి. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2వ కాంటూరు వరకూ చేపల చెరువులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సీజన్‌లో సాగు చేస్తున్నారు. వీటన్నింటిపై నిర్దిష్ఠమైన సమాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్యవసాయ, అటవీశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం....’’ అని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.  సచివాలయంలో బుధవారం చిత్తడి నేలల పరిరక్షణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రెండు నెలల్లోగా ఈ కమిటీ ప్రాథమిక నివేదికను మండలికి సమర్పించాలని ఆదేశించారు. వాటి ఆధారంగా జీవనోపాధులకు విఘాతం లేకుండా జీవజాలం మనుగడకు ముప్పు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.


ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌ నైపుణ్యాలు: అజయ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రోబోటిక్స్‌ వంటి నైపుణ్య శిక్షణ అందించడంపై దృష్టి సారించామని నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇండో యూరో సింక్రనైజేషన్‌ సంయుక్తగా నిర్వహించిన డేటా సైన్సు హాకథాన్‌లో గెలుపొందిన విద్యార్థులకు బుధవారం ఆయన బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన లిక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల విద్యార్థులకు రూ.25 వేలు, ద్వితీయ బహుమతి పొందిన ఆచార్య నాగార్జున వర్సిటీ విద్యార్థులకు రూ.15 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన ట్రిపుల్‌ ఐటీ నూజివీడు విద్యార్థులకు రూ.10 వేలు నగదు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,500 మంది విద్యార్థులకు డేటా సైన్స్‌పై సర్టిఫికేషన్‌కోర్సు నిర్వహించారు. వీరికి 12నెలలు ఇంటర్న్‌షిప్‌ ఇచ్చారు.  


ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఎంపిక జాబితా విడుదల నేడు

ఈనాడు, అమరావతి: ట్రిపుల్‌ ఐటీలకు ఎంపిక విద్యార్థుల జాబితాను గురువారం మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేయనున్నారు. ఈ ఏడాది నాలుగు ప్రవేశాలకు కలిపి 44,208మంది దరఖాస్తు చేశారు. క్రీడలు, ఎన్‌సీసీ కోటాకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున వీరికి జాబితాను విడిగా ఇవ్వనున్నారు.


జాషువాకు ముఖ్యమంత్రి జగన్‌ నివాళి

ఈనాడు, అమరావతి: మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ‘కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి గుర్రం జాషువా. పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయవాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు.


బలహీనవర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి కవి: చంద్రబాబు

తన రచనల ద్వారా బడుగుబలహీనవర్గాలకు అండగా నిలిచిన వ్యక్తి కవి గుర్రం జాషువా అని చంద్రబాబు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా దళిత జనోద్ధరణకు నడుం కడదామని ట్వీట్‌ చేశారు.


ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా చలో పార్లమెంటు: యూటీఎఫ్‌

ఈనాడు, అమరావతి: జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) ఉపసంహరించుకోవాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిసెంబరులో చలో పార్లమెంట్‌ నిర్వహించనున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వరరావు, ప్రసాద్‌ తెలిపారు. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.


పెన్నా జలాల కేసు ఉపసంహరణకు ఏపీకి సుప్రీంకోర్టు అనుమతి

దిల్లీ: ఉత్తర పెన్నా నదీజలాల పంపకం విషయంలో కర్ణాటకతో నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు అంతర్రాష్ట్ర ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేయాల్సిందిగా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ 19 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన ఓ కేసును సుప్రీంకోర్టు బుధవారం మూసివేసింది. 2003లో ఆ వ్యాజ్యం దాఖలైనప్పటి నుంచి పెన్నాలో భారీగా నీరు ప్రవహించిన సంగతిని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతించింది. ట్రైబ్యునల్‌ ఏర్పాటు కోసం కేంద్రాన్ని సంప్రదించడం వంటి ఇతర మార్గాలను అన్వేషించేందుకు స్వేచ్ఛ కల్పించింది. ‘‘ఇప్పటికే 19 ఏళ్లు గడిచాయి. తాత్కాలిక ఉపశమనం కల్పించాలా? వద్దా? అనే కోణంలో ఇప్పుడు ఆలోచించడం చాలా కష్టం. ఈ కాలంలో అనేక పనులు జరిగి ఉండొచ్చు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ వ్యాజ్యం వ్యవహారంలో సాక్ష్యాల నమోదు ప్రక్రియ 2012 ఏప్రిల్‌ 10నే ముగిసింది. అప్పటినుంచి విచారణ మాత్రం జరగలేదు. ఈ కేసులో ప్రస్తావించిన నది తెలంగాణలో ప్రవహించదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడంతో.. వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకునేందుకు ఏపీని అనుమతించింది.


పంచాయతీల ఖాతాల్లో నిధులు జమ చేయించండి

కేంద్రానికి ఏపీ పంచాయతీ పరిషత్‌ వినతి

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదల చేసిన నిధులను తక్షణమే పంచాయతీ ఖాతాల్లో జమ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, ఏపీ రాష్ట్ర పంచాయతీ పరిషత్‌ ఛైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ కార్యాలయంలో వారు వినతిపత్రాన్ని అందజేశారు. ‘రాష్ట్రంలోని 13,300 పంచాయతీలకు  15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.948.35 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ దారి మళ్లించాయి. తక్షణమేచర్యలు తీసుకోవాలి...’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని