మీ భూములు మాకివ్వండి

రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రైతులకు మేలు జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడాలన్నా ‘గ్రీన్‌ ఎనర్జీ’తోనే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి

Updated : 29 Sep 2022 06:57 IST

 ప్రభుత్వమే బీళ్లను లీజుకు తీసుకుంటుంది  

ముఖ్యమంత్రి జగన్‌ పిలుపు

రామ్‌కో సిమెంటు పరిశ్రమకు ప్రారంభోత్సవం 

ఈనాడు, కర్నూలు: రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రైతులకు మేలు జరగాలన్నా, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగు పడాలన్నా ‘గ్రీన్‌ ఎనర్జీ’తోనే సాధ్యపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఎక్కడైనా రైతులు ముందుకొస్తే ప్రభుత్వం వారి నుంచి భూములు లీజుకు తీసుకుని ప్రాజెక్టులు ఏర్పాటు చేయిస్తుందని చెప్పారు. ఎకరాకు ఏటా రూ.30,000 చొప్పున చెల్లిస్తుందని చెప్పారు. ప్రతి రైతు, ఎమ్మెల్యే దీనిపై ఆలోచించాలని సూచించారు. 33 ఏళ్లు, 55 ఏళ్లు.. ఎన్నయినా కావొచ్చు సంవత్సరానికి ఎకరానికి రూ. 30,000 చొప్పున ఇస్తుందని తెలిపారు. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతామని తెలిపారు. బీళ్లుగా ఉన్న భూముల్లో విండ్‌, సోలార్‌ వంటి పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టులు తీసుకొస్తామని తెలిపారు. ఒక ప్రదేశంలో కనీసం 500 మెగావాట్లు ఉత్పత్తి అయ్యేలా 1,500-2,000 ఎకరాలు క్లస్టర్‌గా చేయగలిగితే బాగుంటుందని, ఈ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు, రైతులు ఉపయోగించుకోవాలని సూచించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రామ్‌కో సిమెంటు పరిశ్రమను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ లైమ్‌ స్టోన్‌ ఖనిజం ఉన్నప్పటికీ, గతంలో ఎలాంటి పరిశ్రమలు రాలేదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రామ్‌కో పనులు ప్రారంభించి, కేవలం 30 నెలల్లోనే వేగంగా పూర్తి చేయడం గొప్ప మార్పునకు చిహ్నమని అభివర్ణించారు. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’కు ఇదో ఉదాహరణ అన్నారు.

అందుబాటులోకి 20,000 ఉద్యోగాలు

నంద్యాల జిల్లా పాణ్యం పరిధిలోని పిన్నాపురంలో గ్రీన్‌కో సంస్థ తలపెట్టిన 5,400 మెగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు ఇటీవలే శంకుస్థాపన చేశామని, దీంతో 2,600 ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం చెప్పారు. గ్రీన్‌ ఎనర్జీకి పెద్దపీట వేసి.. గ్రీన్‌కో, ఇండోసాల్‌, ఆర్సిలర్‌ మిత్తల్‌, అదానీ కంపెనీలకు రూ. 72,188 కోట్ల ప్రాజెక్టులకు అనుమతులిచ్చామన్నారు. మూడు నాలుగేళ్లలో ఇవి పూర్తవుతాయని, దాదాపుగా 20,000 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

రాష్ట్రం ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా’ కనిపించడం చాలా ముఖ్యమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇది సువర్ణాక్షరాలతో రాయాల్సిన విషయమన్నారు. 2021-22లో 11.43 శాతం అత్యధిక వృద్ధి రేటుతో దేశంలో నంబర్‌ వన్‌గా నిలవడం గొప్ప మార్పని చెప్పారు. 

ఎగుమతులు పెరిగేలా చర్యలు

రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగుచోట్ల 6 పోర్టులుంటే, తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడు (శ్రీకాకుళం)లలో మరో నాలుగు పోర్టులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని సీఎం జగన్‌ చెప్పారు. ప్రతి 50 కి.మీ.కు ఒక ఫిషింగ్‌ హార్బర్‌ కానీ, ఒక పోర్టు కానీ ఉండేలా చూసి ఎగుమతులు పెరగడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ‘ఆంధ్రలో రామ్‌కో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఆనందంగా ఉందనే సందేశం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆ పరిశ్రమ బ్రాంచ్‌లకు తెలిసేలా ఆంగ్లంలో మాట్లాడతాను’ అంటూ సీఎం చివరిలో సందేశం ఇచ్చారు. ఏ సాయం కావాలన్నా పరిశ్రమల మంత్రి ఫోన్‌ కాల్‌కు అందుబాటులో ఉంటారని రామ్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.ఆర్‌.వెంకట్రామరాజాను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్‌, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎమ్మెల్సీ భగీరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెదేపా హయాంలో శంకుస్థాపన

సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు దశాబ్దాల క్రితమే రామ్‌కో సంస్థ మైనింగ్‌ కోసం పట్టా భూములను దశలవారీగా కొనుగోలు చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో గత ప్రభుత్వం యాజమాన్యంతో చర్చించి సింగల్‌ విండో విధానంలో అన్ని అనుమతులు ఇచ్చింది. పరిశ్రమ విస్తరణకు మరో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబరు 12న ఈ పరిశ్రమ శంకుస్థాపనకు నిర్ణయించగా.. కొన్ని కారణాల వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కాలేక, వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు.


తిరుగు ప్రయాణంలోనూ వయా హైదరాబాద్‌ 

ముఖ్యమంత్రి పర్యటన

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ తిరుపతి, నంద్యాల జిల్లాల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలోనూ విజయవాడకు నేరుగా రాలేదు. ప్రత్యేక విమానంలో కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి, 10 నిమిషాల్లోనే అక్కడి నుంచి గన్నవరం బయలుదేరారు. ముఖ్యమంత్రి మంగళవారం తిరుపతి వెళ్లేటప్పుడు గన్నవరం నుంచి నేరుగా తిరుపతికి వెళ్లకుండా.. మొదట హైదరాబాద్‌కు, అక్కడి నుంచి తిరుపతికి వెళ్లారు. విజయవాడ నుంచి ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భారతీరెడ్డి హైదరాబాద్‌ వరకు వెళ్లారు. ఆమెను అక్కడ దిగబెట్టి సీఎం తిరుపతి వెళ్లారు. తిరుమలలో కార్యక్రమాలు ముగిశాక బుధవారం ఆయన నంద్యాల జిల్లాకు వెళ్లి సిమెంటు ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అది ముగిశాక మళ్లీ అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట చేరుకుని 1.40కి అక్కడి నుంచి బయల్దేరి తాడేపల్లి వచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని