CM Jagan: ఇదే ఫైనల్‌ వార్నింగ్‌

‘ఇకపై ఇలా అయితే కుదరదు.. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికీ తిరగాల్సిందే. పనితీరు మార్చుకోకపోతే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు

Updated : 29 Sep 2022 11:54 IST

మీరు మారకపోతే కొత్త అభ్యర్థులు వస్తారంతే

27 మంది ‘గడప గడపకూ’ 10 రోజులు కూడా తిరగలేదు

వీళ్లలో ఆరుగురు మంత్రులు

ఇకపై రోజుకు ఎన్ని గంటలు తిరిగారో తేలుస్తా

మీరంటే ప్రేమ ఉన్నా.. గెలవలేకపోతే టికెట్‌ ఇవ్వలేను

మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఇకపై ఇలా అయితే కుదరదు.. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికీ తిరగాల్సిందే. పనితీరు మార్చుకోకపోతే ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కొత్త అభ్యర్థులొస్తారు. ఇప్పటి నుంచి ప్రజల్లో తిరిగితేనే మీరు గెలవగలరు. మీరు గెలిస్తేనే మనందరం నిలవగలం. అందువల్ల గెలవలేని వారికి టికెట్లు ఇచ్చేది ఉండదు’ అని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులతో సీఎం సమావేశం నిర్వహించారు. ‘మొహమాటాల్లేవు. ఇదే చివరి హెచ్చరిక. గడప గడపకూ తిరగాల్సిందే. షార్ట్‌ కట్స్‌ లేవు. వారానికి 4 రోజులు, నెలకు 16 రోజులు తిరగాల్సిందే. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు ఇప్పటికీ ఈ కార్యక్రమంలో సరిగా తిరగడం లేదు. ఇవన్నీ ఇకపై కుదరవు’ అని హెచ్చరించారు.

గంటల లెక్కన నివేదికలు తీస్తా

‘కొంతమంది ఒక్కో సచివాలయం పరిధిలో నాలుగైదు ఇళ్లకు వెళ్లొచ్చేసి మొత్తం పూర్తి చేశామనేస్తున్నారు. ఆ సచివాలయ పరిధిలోని అన్ని గడపలకూ వెళితేనే మీరు తిరిగినట్లు. లేకపోతే లెక్కలోకి తీసుకోం. ఆ సచివాలయాల పరిధిలో మీరు మళ్లీ తిరగాల్సిందే. లేకపోతే వాటి పరిధిలో మీరు ప్రతిపాదించే పనుల మంజూరు, వాటికి నిధుల కేటాయింపు ఉండవు. ఇన్ని రోజులు తిరిగేశామనే లెక్క కోసం చాలా మంది చేస్తున్నారు. అలాంటివి కుదరవు. నెలకు 16 రోజులు తప్పనిసరిగా తిరగాల్సిందే. ఇకపై ఈ 16 రోజుల్లో ఎన్ని గంటలు ఏయే గ్రామాల్లో, ఏయే ప్రాంతాల్లో ఎన్ని గడపలకు తిరిగారనేదీ కూడా తేలుస్తాం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలందరి వెంటా ఐప్యాక్‌ ప్రతినిధి ఒక్కొక్కరు చొప్పున ఉంటారు, మీ కదలికలను వాళ్లు రిపోర్ట్‌ చేస్తారు’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘ఇప్పటి వరకూ 10 మంది చాలా బాగా చేశారు, కానీ, వాళ్ల పేర్లు ఇప్పుడు చదివితే వాళ్లను పెంచి మిగిలినవాళ్లను తగ్గించినట్లవుతుందని ప్రకటించడం లేదు’ అని సీఎం చెప్పారు.

ఆర్నెల్ల ముందే అభ్యర్థులు

‘ఎన్నికలకు 19 నెలల సమయం ఉంది. ఇది చాలా కీలక సమయం. ఇకమీదట కూడా మీ పనితీరును మార్చుకోకపోతే కష్టం. మీలో ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలున్నాయి. ప్రతి ఒక్కరూ నాతో అడుగులు వేశారు. అందుకే ఎవర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. పనితీరు బాగాలేని వాళ్ల గేర్‌ మార్చడమే నా లక్ష్యం. అయినా తీరు మార్చుకోకపోతే, ఓడిపోతారని తెలిసీ మీకు టికెట్లు ఇవ్వలేం కదా? ఎన్నికలకు ఆరు నెలల ముందే సర్వే చేయిస్తాను. మీలో ప్రజాదరణ ఉన్నవారికే మళ్లీ టికెట్లు ఇస్తాను’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

ఆర్థిక మంత్రివి తిరక్కపోతే ఎలా రాజా?

10 రోజులు కూడా తిరగని వారి పేర్లను ముఖ్యమంత్రి చదివిన సమయంలో సమావేశ మందిరంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కనిపించకపోవడంతో.. ‘అదే పనిగా విమానంలో ఎక్కించుకుని వచ్చానే. రాజా ఎక్కడున్నాడు? లోపలికి రమ్మనండి’ అని సీఎం పిలిపించినట్లు తెలిసింది. లోపలికి వచ్చిన బుగ్గనతో సీఎం మాట్లాడుతూ...‘ఎంతో నమ్మకంతో ఆర్థిక శాఖ వంటి కీలక బాధ్యత కూడా అప్పగించాం కదా. మీ నియోజకవర్గంలోనే తిరగకపోతే ఎలా? తిరగాలి కదా’ అని అన్నట్లు సమాచారం.

మా అబ్బాయిలు తిరుగుతున్నారంటే కుదరదు

‘కొంతమంది మా అబ్బాయిలు తిరుగుతున్నారని చెబుతున్నారు. వాళ్లనే తిప్పుతున్నారు. అవేవీ కుదరవు. మీ బిడ్డల్ని ప్రమోట్‌ చేయాలనుకుంటే చేసుకోండి. కానీ ఈసారికి మీరే పోటీ చేయాలి. మీతో నాకు ర్యాపో, అనుబంధం ఉంది, మీరు పోటీ చేయాలి’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ‘మా వారసులకు అవకాశం కావాలని అని మన నాని, రాజా లాంటివాళ్లు అడుగుతున్నారు’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పేర్లను సీఎం ప్రస్తావించినట్లు సమాచారం. పేర్ని నాని కల్పించుకుంటూ ‘నేను పోటీ చేయలేను, మా అబ్బాయి చేస్తాడు’ అని చెప్పబోగా ‘లేదు నువ్వే చేయాలి, ఈసారి కూడా నాతోపాటు నువ్వుండాలి’ అని సీఎం అన్నట్లు తెలిసింది. ‘నేను పార్టీకి పూర్తి సమయం పని చేస్తున్నాను. పోటీ మాత్రం చేయలేను’ అని నాని సమాధానమివ్వగా.. ‘కాదు.. ఈసారి చేయి’ అని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది.

ప్రాంతీయ సమన్వయకర్తలు విఫలమయ్యారు

‘ఎమ్మెల్యేలు తిరగకపోతే వారి ప్రాంతానికి సంబంధించిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాల్సిందే. ప్రాంతీయ సమన్వయకర్తలుగా సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బాలినేని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఫెయిలయ్యారు. మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత అప్పగిస్తే, పని చేయకపోతే ఎలా? మీరు చేయలేకపోతే చెప్పండి.. చేసే వాళ్లకు బాధ్యతనిస్తా’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఈ 27 మంది సంగతి చూడండి

‘గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ఇప్పటివరకూ కనీసం 10 రోజులు కూడా తిరగని వారు దాదాపు 27 మంది ఉన్నారు’ అని వారి పేర్లను ముఖ్యమంత్రి చదివి వినిపించారు. ‘డిసెంబరులో మళ్లీ కలిసి సమీక్షించుకుందాం.. అప్పటికి తిరగనివారు ఉండకూడదు.. ఇప్పుడు ఈ 27 మంది పేర్లు చదువుతున్నా. అప్పుడు సున్నా పేర్లుండాలి’ అని సీఎం చెప్పినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..

గడప గడపకూ సరిగా తిరగని మంత్రులు

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విశ్వరూప్‌, రోజా, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత

ఎమ్మెల్యేలు

ధనలక్ష్మి (రంపచోడవరం)

జి.శ్రీనివాసులు నాయుడు (నిడదవోలు)

గ్రంధి శ్రీనివాస్‌ (భీమవరం)

ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి)

శాసనసభాపతి తమ్మినేని సీతారాం (ఆమదాలవలస)

వల్లభనేని వంశీ (గన్నవరం బాధ్యుడు)

దూలం నాగేశ్వరరావు (కైకలూరు)

మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు గ్రామీణ)

శ్రీధర్‌రెడ్డి (పుట్టపర్తి), నవాజ్‌ బాషా (మదనపల్లి)

మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట)

అదీప్‌రాజ్‌ (పెందుర్తి), శిల్పా చక్రపాణి (శ్రీశైలం)

ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట)

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి)

శ్రీనివాసులు (రైల్వేకోడూరు)

బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు) (ఈ ఎమ్మెల్యే పేరును సీఎం చదవడంపై పూర్తి స్పష్టత రాలేదు)

నియోజకవర్గ బాధ్యులు

తోట త్రిమూర్తులు (మండపేట)

ఎంపీ మార్గాని భరత్‌ (రాజమహేంద్రవరం సిటీ)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని