సొంత జిల్లాల్లోనే డీఈలుగా ఉంటాం!

రహదారులు, భవనాలశాఖలో పలువురు డీఈలు నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాల్లోనే శాశ్వతంగా కొనసాగేందుకు లాబీయింగ్‌ చేస్తున్నారు. పని సర్దుబాటు కింద పోస్టింగు పొంది,

Published : 29 Sep 2022 03:33 IST

 నిబంధనల మినహాయింపునకు ఆర్‌అండ్‌బీ డీఈల లాబీయింగ్‌

ఓ మంత్రి బంధువు ద్వారా ప్రయత్నాలు?

ఈనాడు, అమరావతి: రహదారులు, భవనాలశాఖలో పలువురు డీఈలు నిబంధనలకు విరుద్ధంగా సొంత జిల్లాల్లోనే శాశ్వతంగా కొనసాగేందుకు లాబీయింగ్‌ చేస్తున్నారు. పని సర్దుబాటు కింద పోస్టింగు పొంది, ఇప్పుడు నిబంధనల నుంచి మినహాయింపు తీసుకునేందుకు ఓ మంత్రి బంధువు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆర్‌అండ్‌బీలో డీఈలకు ఈఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో.. పలు డివిజన్లలో డీఈల పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో వేర్వేరు జిల్లాల్లో పని చేస్తున్న డీఈలు.. పని సర్దుబాటు పేరుతో తమ సొంత జిల్లాలకు వచ్చి చేరారు. అయితే ఇవన్నీ తాత్కాలికమే. డీఈ కేడర్‌లో సొంత జిల్లాలో పని చేయకూడదనే నిబంధన ఉంది. అయినా రాష్ట్రంలో దాదాపు 23 మంది డీఈలు సొంత జిల్లాల్లో ఉండేలా మినహాయింపు ఇప్పించాలంటూ కొద్దిరోజుల కిందట.. ఓ అమాత్యుని వ్యవహారాలు చూసే అతని సమీప బంధువును సంప్రదించారు. ఆయన ప్రోద్బలంతో ఉన్నతాధికారులు దస్త్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు.

ఈ దస్త్రం విషయంలో రవాణా, ఆర్‌అండ్‌బీ కీలక అధికారి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి ఆయన ఈ దస్త్రాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఒకసారి మినహాయింపు ఇస్తే, అంతా ఇలాగే అడుగుతారని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా ఎలాగైనా దీనికి ఆమోదం తెప్పించుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అమాత్యుని బంధువు తలచుకుంటే ఏదైనా చేయగలరనే ఉద్దేశంతో డీఈలు ఆయనతో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. జూన్‌లో జరిగిన బదిలీల్లోనూ ఓ ఉద్యోగి ద్వారా ఆ బంధువే చక్రం తిప్పారనే విమర్శలు వచ్చాయి. బదిలీల్లో ఇంజినీర్లు ఆశించిన చోటుకు పంపేందుకు పెద్దఎత్తునే వసూళ్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇపుడు డీఈలకు సొంత జిల్లాకు మినహాయింపు ఇప్పించేందుకు వాళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని