హారతులు పట్టి.. అమరావతికి జై కొట్టి..

అడుగడుగునా హారతులు పడుతూ, పూలు చల్లుతూ స్వాగతాలు... అన్నదాతలకు సంఘీభావం తెలుపుతూ అమరావతి నినాదాలు... ఏలూరు జిల్లాలో మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని

Published : 29 Sep 2022 03:33 IST

 రైతుల మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ స్వాగతం

ఏలూరులో వాడవాడలా పూల వర్షం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-దెందులూరు, ఏలూరు అర్బన్‌, గ్రామీణ, తూర్పువీధి: అడుగడుగునా హారతులు పడుతూ, పూలు చల్లుతూ స్వాగతాలు... అన్నదాతలకు సంఘీభావం తెలుపుతూ అమరావతి నినాదాలు... ఏలూరు జిల్లాలో మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అరసవల్లి దాకా రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర 17వ రోజూ కోలాహలంగా సాగింది. ఏలూరు జిల్లా కొత్తూరులో బుధవారం ఉదయం రైతులు స్వామివారి రథానికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. వంగాయగూడెం సెంటర్లో మహిళలు ఆకుపచ్చని బెలూన్లు ఊపుతూ రైతులకు స్వాగతం పలికారు. ఏలూరులో రైతులను స్థానికులు పూలపై నడిపించారు. హారతులు పడుతూ, గుమ్మడి, కొబ్బరి కాయలతో దిష్టితీశారు. యాత్రలో పాల్గొన్న రైతులకు స్థానికులు అల్పాహారాలు, మజ్జిగ, శీతలపానీయాలు, తాగునీరు అందించారు. ఏలూరులో 2 కిలోమీటర్ల మేర జనం పోటెత్తారు. అమరావతి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రైతులకు స్వాగతం పలకడానికి కొవ్వలి, పోతునూరు గ్రామస్థులు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ప్రదర్శనగా వచ్చారు. దెందులూరు మండలం కొవ్వలిలో వేంకటేశ్వరస్వామి రథానికి గజమాలతో స్వాగతం పలికారు. జూట్‌ మిల్లు కార్మికులు భారీ ఎత్తున కదిలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా న్యాయవాదుల సంఘం సభ్యులు.. రైతులతో కలిసి నడిచారు. ఏలూరుకు చెందిన 15 మంది దివ్యాంగులు సంఘీభావం తెలిపారు. వీరితో పాటు తెదేపా నాయకుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు పాదయాత్రలో పాల్గొని నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని చందలూరు గ్రామం నుంచి రైతులు తరలివచ్చారు. ఎన్‌ఆర్‌ఐల సంఘం సభ్యులు అమెరికా నుంచి వచ్చి హాజరయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా ఆంధ్రానగర్‌ గ్రామానికి చెందిన కె.రవికుమార్‌, జి.రామకృష్ణ, ఎస్‌.రాంబాబు, నాయుడు శేఖర్‌ తదితరులతో కూడిన 8 మంది బృందం రెండు రోజుల నుంచి పాదయాత్రలో పాల్గొంటోంది.

పాల్గొన్న ప్రముఖులు: మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు నియోజకవర్గం తెదేపా ఇన్‌ఛార్జి బడేటి చంటి, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు, రమేశ్‌ ఆసుపత్రుల ఛైర్మన్‌ సీతారామమోహనరావు రైతులకు మద్దతు పలికారు.

17వ రోజు యాత్ర ఇలా..

* ప్రారంభం: ఏలూరు జిల్లా కొత్తూరు

* ముగింపు: కొవ్వలి

* నడిచిన దూరం: 14 కిలోమీటర్లు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని