డీజీపీ కోర్టుకు రావాలి

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు, వాహనాల సీజ్‌, కేసు నమోదు వ్యవహారంలో హైకోర్టు, డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను  అమలు చేయడంలో దిగువ స్థాయి పోలీసు అధికారులు నిర్లక్ష్యం చూపడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. దిగువ

Updated : 29 Sep 2022 06:20 IST

 రేషన్‌ బియ్యం వాహనాలను ఏఎస్సైలు సీజ్‌ చేయడంపై హైకోర్టు ఆక్షేపణ

ఈనాడు, అమరావతి: రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు, వాహనాల సీజ్‌, కేసు నమోదు వ్యవహారంలో హైకోర్టు, డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను  అమలు చేయడంలో దిగువ స్థాయి పోలీసు అధికారులు నిర్లక్ష్యం చూపడంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. దిగువ స్థాయి అధికారుల అరాచక వ్యవహారశైలి, కోర్టు ఉత్తర్వులపట్ల అవిధేయత చూపడంపై ఈనెల 30న స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డిని ఆదేశించింది. రేషన్‌ సరకులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను చట్టంలో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన అధికారి సీజ్‌ చేసి కేసు నమోదు చేసినప్పుడే అవి న్యాయస్థానం ముందు, సంబంధిత అధికారుల ముందు న్యాయ సమీక్షకు నిలుస్తాయని గుర్తు చేసింది. లేని పక్షంలో అలాంటి కేసులు చెల్లవని తెలిపింది. ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి.. రేషన్‌ సరకుల అక్రమ రవాణా విషయంలో తనిఖీలు, వాహనాల సీజ్‌, కేసు నమోదు చేయాలని గతంలో హైకోర్టు పలుమార్లు హెచ్చరించినా ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుళ్లు తనిఖీలు చేసి కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎస్సై హోదా కన్నా తక్కువ స్థాయి అధికారులు వాహనాలను సీజ్‌ చేయవద్దని డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులను దిగువ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇలాగైతే డీజీపీ శాంతిభద్రతలను ఎలా కాపాడతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై వాదన వినేందుకు నేరుగా డీజీపీ హాజరు కావాలని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నంద్యాల జిల్లా పాములపాడు ఏఎస్సై తనిఖీ నిర్వహించి.. లారీని సీజ్‌ చేసి, ఈ ఏడాది ఆగస్టు 11న కేసు నమోదు చేశారని పేర్కొంటూ షేక్‌ మహమ్మద్‌ రఫీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఆ వాహనాన్ని విడుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని