సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు

తెల్ల కాగితాలపై 2021 నవంబరు 1కి ముందు (సాదా బైనామా-ఆన్‌ రిజిస్టర్డ్‌ స్టాంపు పేపర్లు) జరిగిన భూలావాదేవీల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated : 29 Sep 2022 05:18 IST

విడుదల చేసిన రెవెన్యూశాఖ

ఈనాడు, అమరావతి: తెల్ల కాగితాలపై 2021 నవంబరు 1కి ముందు (సాదా బైనామా-ఆన్‌ రిజిస్టర్డ్‌ స్టాంపు పేపర్లు) జరిగిన భూలావాదేవీల క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. చిన్న, మధ్య తరహా రైతులై ఉండి ఐదు ఎకరాల వరకు బీడు, తడి భూమి 2.5 ఎకరాల వరకూ ఉంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు లేకుండా యజమానులకు హక్కులు కల్పిస్తారు. మిగిలిన వారి నుంచి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరిస్తారు. ఈ నిర్ణయం వ్యవసాయ భూములకే వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎసైన్డ్‌ భూములను పరిగణనలోకి తీసుకోరు. తగిన ఆధారాలతో 2023 డిసెంబరు 31 వరకూ గ్రామ/వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. చివరిగా 2020 మే 31తో ముగిసిన గడువును రెవెన్యూశాఖ పొడిగించింది. ఇంతకుముందు 2000 డిసెంబరు 31కి ముందు జరిగిన భూముల లావాదేవీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. తాజా నిర్ణయం మేరకు 2021 ముందు వరకూ జరిగిన లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని 30 రోజుల్లోగా తహసీల్దార్లు పరిష్కరించాలి. దరఖాస్తులపై స్థానికంగా విచారణ జరిపించాలి. డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లేవని.. విచారణకు చుట్టుపక్కల రైతులు రాలేదని, వారు సంతకాలు చేసేందుకు నిరాకరించారనే కారణాలతో దరఖాస్తులను తిరస్కరించకూడదు. దరఖాస్తుదారుడు కాకుండా ఇతరులు విచారణ జరపాలని కోరినప్పుడు, దరఖాస్తుదారుడు రాలేదని దరఖాస్తులను వెనక్కి పంపకూడదు. అనివార్య పరిస్థితుల్లో విచారణ వాయిదా వేయాల్సి వస్తే వారంలోగా మళ్లీ విచారించాలని రెవెన్యూశాఖ ఆదేశించింది. ఆధారాల కింద క్రాప్‌ సబ్సిడీ, పీఎం కిసాన్‌ మంజూరు, వైఎస్సార్‌ భరోసా, సీసీఆర్‌సీ కార్డులు, వాటర్‌ యూజర్‌ రికార్డులు, సున్నా వడ్డీ వంటి పథకాల అర్హత వివరాలను పరిగణనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని