ఎండకు బెదరక... వానకు వెరవక!

జై అమరావతి.. నినాదాలతో పల్లెలు మారుమోగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మండే ఎండ.. ఆనక జోరువాన..

Published : 30 Sep 2022 06:00 IST

అమరావతే సంకల్పంగా ముందుకు సాగిన అన్నదాతలు

మహా పాదయాత్రకు పోటెత్తిన జనం

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే-దెందులూరు, పెదపాడు, ఏలూరు గ్రామీణ: జై అమరావతి.. నినాదాలతో పల్లెలు మారుమోగాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మండే ఎండ.. ఆనక జోరువాన.. అయినా వెరవక రైతులు ముందుకు సాగారు. రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అరసవల్లి దాకా చేపట్టిన మహా పాదయాత్ర 18వ రోజు ఏలూరు జిల్లాలో కొనసాగింది. దెందులూరు మండలంలో గ్రామగ్రామానా జనం నీరాజనాలు పలికారు. కొవ్వలి గ్రామంలో గురువారం ఉదయం 9 గంటలకు వేంకటేశ్వర స్వామి రథానికి రైతులు పూజలు చేశారు. అమరావతి ఐకాస నేత యుగంధర్‌ శంఖం పూరించి యాత్రను ప్రారంభించారు. రాజకీయ పార్టీలతోపాటు వివిధ వర్గాల వారు పాల్గొని మద్దతు తెలిపారు.

పూలవాన కురిసింది...
దెందులూరు గ్రామ ప్రారంభంలో యాత్రకు జనం భారీగా తరలి వచ్చారు. ఆకుపచ్చని బెలూన్లు, కండువాలు ఊపుతూ రైతులను ఆహ్వానించారు. హైవే ఫ్లైఓవర్‌ పైనుంచి పూల వర్షం కురిపించారు. గ్రామస్థులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. రెండు కి.మీ. పొడవునా రహదారంతా కిక్కిరిసింది. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో రైతులకు గుమ్మడికాయలతో దిష్టితీశారు. రైతులకు స్థానికులు పులిహోర, అల్పాహారం, మజ్జిగ, తాగునీటి సీసాలు, ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌, శీతల పానీయాలు అందించారు. దెందులూరు మీదుగా రైతుల యాత్ర శ్రీరామవరం చేరుకుంది.

వైకాపా కవ్వింపులు
దెందులూరు నుంచి రైతుల యాత్ర శ్రీరామవరం చేరుకోగానే స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా మండల కన్వీనర్‌ కామిరెడ్డి నాని నివాసం దగ్గర కొందరు వైకాపా వర్గీయులు ఆ పార్టీ జెండాలు చూపుతూ కవ్వింపు చర్యలకు దిగారు. జై వైకాపా అంటూ నినాదాలు చేశారు. రైతులు జై అమరావతి అంటూ నినదించారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొద్ది సమయానికే పరిస్థితి అదుపులోకి వచ్చింది. శ్రీరామవరంలో భోజన విరామం అనంతరం యాత్ర మేదినరావుపాలేనికి చేరుకుంది. ఓపక్క జోరుగా వానపడుతున్నా గ్రామస్థులు తడుస్తూనే రైతులకు స్వాగతం పలికారు. రామారావుగూడెం, చల్లచింతలపూడి మీదుగా సాగి పెరుగుగూడెంలో యాత్ర ముగిసింది.

అడుగడుగునా మద్దతు
రైతుల పాదయాత్రకు వివిధ వర్గాలవారు మద్దతు ప్రకటించారు. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు వచ్చి కళాకారులతో కలిసి తీన్మార్‌ వాయించారు. దళిత ఐకాస, కొమిరేపల్లి మాల మహాసేన, గౌడ సంఘం, అంబేడ్కర్‌ యువత, దళిత బహుజన ఐకాస నాయకులు మద్దతు పలికారు. రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల విద్యార్థులూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి నియోజకవర్గ రైతులు సంఘీభావం తెలిపారు. ఏలూరు జిల్లా రైతాంగ సమాఖ్య, జిల్లా రైతు సంఘం, నూజివీడు, తిరువూరు నియోజకవర్గాల రైతులు మద్దతు ప్రకటించారు.

పాల్గొన్న ప్రముఖులు
తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి, జనసేన రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.


18వ రోజు యాత్ర ఇలా..

* ప్రారంభం: ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలి
* ముగింపు: దెందులూరు మండలం పెరుగుగూడెం
* నడిచిన దూరం: 15 కిలోమీటర్లుఉత్తరాంధ్రకు వస్తే... కాళ్లు నరుకుతామంటున్నారు

అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: నాయకుల మాటలు నమ్మి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వైకాపా కార్యకర్తలకు అమరావతి ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి సూచించారు. ఏలూరుజిల్లా దెందులూరు మండలంలో 18వ రోజు పాదయాత్ర సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్రకు వస్తే కాళ్లు నరుకుతాం అని కొందరు వైకాపా కార్యకర్తలు అంటున్నారు. ఈరోజు మాపై టమాటాలు, గుడ్లు, రాళ్లు వేయడానికి విఫలయత్నం చేశారు. కార్యకర్తలూ మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు’ అని అన్నారు. గ్రామాల్లో ప్రజలు వర్షాన్ని లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారని వివరించారు. అమరావతి ఐకాస కోకన్వీనర్‌ తిరుపతిరావు మాట్లాడుతూ... ‘వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా సహనం కోల్పోం. గాంధేయ మార్గంలోనే పాదయాత్ర చేస్తాం. యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే తట్టుకోలేక మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అని విమర్శించారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని