కృష్ణంరాజు పేరిట స్మృతివనం

దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు పేరిట మొగల్తూరు సముద్ర తీరంలో రెండెకరాలను కేటాయించి స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుచేస్తామని

Updated : 30 Sep 2022 05:58 IST

మొగల్తూరులో సంస్మరణ సభలో పర్యాటకశాఖ మంత్రి రోజా వెల్లడి

మొగల్తూరు, భీమవరం, న్యూస్‌టుడే: దివంగత సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు పేరిట మొగల్తూరు సముద్ర తీరంలో రెండెకరాలను కేటాయించి స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుచేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, కృష్ణంరాజు కుటుంబాల మధ్య సత్సంబంధాలున్నాయని వివరించారు. రాజకీయాల్లో కృష్ణంరాజు మంచిపేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ఆయనతో కలిసి తాను ఒక్క చిత్రంలోనే నటించానని, చిత్రీకరణ సమయంలో నవ్వుతూ అందరినీ పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. కన్నప్ప అన్నా, బ్రహ్మన్న పేరు చెప్పినా కృష్ణంరాజు గుర్తుకొస్తారని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్‌, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

జనసంద్రమైన మొగల్తూరు
మొగల్తూరు జనసంద్రమైంది. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి సినీ హీరో ప్రభాస్‌ హాజరవుతారన్న సమాచారంతో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అభిమానులకు ప్రభాస్‌తోపాటు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కుటుంబీకులు అభివాదం చేశారు. ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లండని ఆప్యాయంగా ప్రభాస్‌ మైక్‌లో చెప్పడంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

25 రకాలతో విందు భోజనం  
మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభకు తరలివచ్చిన అతిథుల కోసం 25 రకాల వంటకాలు తయారు చేయించారు. చందువా వేపుడు, నాటుకోడి కూర, వేట మాంసం, బూరి, స్వీటు, రాజుగారి రొయ్యల బిర్యానీ, మటన్‌ దమ్‌ బిర్యాని, మిక్స్‌డ్‌ బిర్యానీ, పులిహోర, చేపల పులుసు, పండుగప్ప వేపుడు, నెత్తళ్లు, పీతల వేపుడు, కోడి మాంసం కూర, రొయ్యల కూర, నాలుగు రకాల అన్నాలు, కూరగాయలు వడ్డించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని