రెండొంతుల సీట్లు అమ్మాయిలకే!

రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 76.97%, ప్రైవేటు బడులకు చెందిన 23.03% మంది విద్యార్థులకు సీట్లు

Published : 30 Sep 2022 03:18 IST

ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు సాధించిన 66% మంది విద్యార్థినులు

అబ్బాయిలకు 33శాతం

ఈనాడు, అమరావతి: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్‌ ఐటీల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 76.97%, ప్రైవేటు బడులకు చెందిన 23.03% మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. వీరిలో అమ్మాయిలు 66.04% ఉండగా.. అబ్బాయిలు 33.96% మంది ఉన్నారు. ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల కేటాయింపు ఫలితాలను గురువారం విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పదోతరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన వారికి 4శాతం వెయిటేజీ ఇచ్చి, అదనంగా 24 మార్కులు కలిపారు. మొత్తంగా ఏపీకి చెందినవారు 97.43%, తెలంగాణకు చెందిన వారు 2.57%మంది సీట్లు పొందారు. అత్యధికంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 11.24%, ఉమ్మడి గుంటూరు జిల్లాకు 10.53%, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 9.54% సీట్లు లభించాయి. అత్యల్పంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 3.11%మంది సీట్లు పొందారు. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు.

వచ్చే నెల 12 నుంచి కౌన్సెలింగ్‌..: నాలుగు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. నూజివీడు, ఇడుపులపాయల్లో అక్టోబరు 12, 13 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఒంగోలులో 14, 15, శ్రీకాకుళం క్యాంపస్‌లో 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుంది. తరగతులు 17నుంచి ప్రారంభమవుతాయి. సైనికోద్యోగులు, ఎన్‌సీసీ, క్రీడలు, స్కౌట్స్‌ కోటాకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున 160 సీట్లను కేటాయించలేదు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10శాతం సీట్లను ప్రత్యేకంగా కేటాయించారు. గత రెండేళ్లు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు కేటాయించారు. ఈ సమయంలో ప్రైవేటు విద్యార్థులు అత్యధికంగా సీట్లు సంపాదించారు. గత రెండేళ్లతో పోల్చితే ఈసారి ప్రభుత్వ విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts