పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేత

మహిళా శిశు సంక్షేమశాఖలో అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా భర్తీ చేసే విస్తరణ అధికారుల గ్రేడ్‌-2 (సూపర్‌వైజర్లు) పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Published : 30 Sep 2022 03:18 IST

విస్తరణ అధికారులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: మహిళా శిశు సంక్షేమశాఖలో అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా భర్తీ చేసే విస్తరణ అధికారుల గ్రేడ్‌-2 (సూపర్‌వైజర్లు) పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రాత పరీక్షకు హాజరైన అందరు అభ్యర్థులకు ఆంగ్లంలో ప్రావీణ్య పరీక్షను నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టింది. నోటిఫికేషన్‌ ప్రకారం రెండు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని గుర్తు చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 14కు వాయిదా వేసింది. ఈ శాఖలో పని చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను.. విస్తరణ అధికారులుగా నియమించేందుకు ప్రభుత్వం ఈ నెల 5న నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాత పరీక్షకు 45 మార్కులు, ఆంగ్లంలో ప్రావీణ్యానికి 5 మార్కులుగా నిర్ణయించింది. 18న రాతపరీక్ష నిర్వహించింది. ఆంగ్లంలో ప్రావీణ్యం పరీక్ష నిర్వహించకుండా ఫలితాల విడుదలకు సిద్ధమవుతోందని పేర్కొంటూ సగుర్తి కల్పన, ఎం.హైమావతి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ‘నోటిఫికేషన్‌కు అనుగుణంగా పోస్టుల భర్తీ జరగడం లేదు. సెప్టెంబరు 24న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ జారీ చేసిన మెమోతో భర్తీ ప్రక్రియ పక్కకు మళ్లింది. రాత పరీక్షకు హాజరైన వారందరికి ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష నిర్వహించాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని