వచ్చే నెలాఖరుకు శ్రీశైలం ఆలయ భూముల సరిహద్దులు ఖరారు

వచ్చే నెలాఖరుకు శ్రీశైలం ఆలయానికి సంబంధించిన 4,130 ఎకరాలకు సరిహద్దులు గుర్తించి అందులో బృహత్‌ ప్రణాళికకు అనుగుణంగా.. పర్యావరణ, అటవీ నిబంధనలను

Published : 30 Sep 2022 03:18 IST

పర్యావరణ, అటవీ చట్టాలకు అనుగుణంగా ప్రగతి పనులు

ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వచ్చే నెలాఖరుకు శ్రీశైలం ఆలయానికి సంబంధించిన 4,130 ఎకరాలకు సరిహద్దులు గుర్తించి అందులో బృహత్‌ ప్రణాళికకు అనుగుణంగా.. పర్యావరణ, అటవీ నిబంధనలను అనుసరిస్తూ ప్రగతి పనులు చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ తెలిపారు. టైగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ పరిధిలో దేవస్థానం భూములు ఉండడంతో కొన్నేళ్లుగా సమస్య నెలకొందని వివరించారు. సమస్య పరిష్కారానికి అటవీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అటవీ, రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ రికార్డ్సు, దేవాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో సర్వే చేపడతాం. సరిహద్దులను గుర్తించిన తర్వాత రక్షణ చర్యలు తీసుకుంటాం. ఆయా భూముల్లో మొక్కలు పెంచేందుకు వీలుగా అటవీ శాఖ అధికారులను కేటాయించాల్సిందిగా సంబంధిత మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించారు. శ్రీశైల దేవస్థానం చుట్టుపక్కల ఉన్న కొన్ని సత్రాల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇకనుంచి ఆయా సత్రాల గదుల కేటాయింపు, ఇతర అంశాల పర్యవేక్షణకు త్వరలో పారదర్శక వ్యవస్థను ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. ప్రైవేటు భూములేవైనా ఈ దేవాలయ భూముల కింద పొరపాటున నమోదైతే సరిచేసి నిరభ్యంతర పత్రాలిస్తామని పేర్కొన్నారు. అక్టోబరు 2న మూల నక్షత్రం సందర్భంగా విజయవాడ దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులున్నాయంటూ తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌పై విలేకరులు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, అర్చకుల్లో కొందరు అధికార పార్టీకి, మరికొందరు తెదేపాకు అనుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. ప్రతి దానిపై స్పష్టతనివ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని