సంక్షిప్త వార్తలు(25)

కేసీ కాలువ పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పొలాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువలు లేవు. దీంతో కాలువ గట్లపై మోటార్లు పెట్టుకొని రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు

Updated : 30 Sep 2022 06:26 IST

పైపుల వరస.. సాగుకు ప్రయాస

కేసీ కాలువ పరిధిలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పొలాలకు నీటిని మళ్లించేందుకు పిల్ల కాలువలు లేవు. దీంతో కాలువ గట్లపై మోటార్లు పెట్టుకొని రెండు కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసుకుని నీటిని మళ్లించుకుంటున్నారు. కర్నూలు మండల పరిధిలోని నిడ్జూరు-ఆర్‌.కుంతలపాడు గ్రామాల మధ్య రైతులు.. ఇలా కాలువలో పైపులు వేసుకుని పంటలు పండించుకుంటున్నారు.

- ఈనాడు, కర్నూలు


రాజధాని ఉద్యమ కేసుల్లో కోర్టుకు హాజరైన రైతులు

ఈనాడు, అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నందుకు... వివిధ సందర్భాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో రాజధాని గ్రామాల రైతులు కొందరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మూడు కేసులకు సంబంధించి రైతు ఐకాస నాయకుడు పువ్వాడ సుధాకర్‌ సహా పలువురు రైతులు బుధ, గురువారాల్లో మంగళగిరి కోర్టుకు విచారణకు హాజరయ్యారు. రెండు కేసుల విచారణను నవంబరు 9కి, మరోకేసు విచారణను నవంబరు 10కి కోర్టు వాయిదా వేసింది. తుళ్లూరులోని దీక్షా శిబిరం దగ్గర తమ విధులకు ఆటంకం కలిగించారంటూ... సుధాకర్‌ సహా 17 మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద 2020లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు ఆధ్వర్యంలో కమిటీని నియమించడాన్ని నిరసిస్తూ మల్కాపురంలో ఆందోళన చేసినందుకు 15 మంది రైతులపై 2019లో రెండు కేసులు నమోదయ్యాయి. కోర్టుకు హాజరైన రైతుల్లో వాకచర్ల వీరాంజనేయులు, ధనేకుల వెంకటసుబ్బారావు, మార్టిన్‌ లూథర్‌, మనోజ్‌ తదితరులున్నారు.


రూ.2,500 కోట్ల రుణం తీసుకోనున్న ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రుణాన్ని సమీకరించుకోనుంది. ఈ మేరకు బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్‌బీఐ ద్వారా వాటిని విక్రయించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బాండ్ల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.20,000 కోట్ల మార్కెట్‌ రుణాలను తీసుకోగా తాజాగా రూ.2,500 కోట్ల రుణాలను సమీకరించుకుంటోంది.


కొత్తమ్మకు కోటొక్క ముర్రాటలు

శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళిలో రెండు రోజులుగా జరుగుతున్న కొత్తమ్మతల్లి జాతర గురువారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపుగా జంగిడి(నైవేద్యం)ని ఆలయానికి చేర్చారు. భక్తులు అమ్మవారికి ముర్రాటలు (కలశంలో పవిత్ర జలం) సమర్పించారు.

- న్యూస్‌టుడే, కోటబొమ్మాళి


అసెంబ్లీ కన్సల్టెంట్‌గా రామాచార్యులు

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ సచివాలయ కన్సల్టెంట్‌గా పి.పి.కె.రామాచార్యులు నియమితులయ్యారు. బుధవారం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజ్యసభ సచివాలయ సలహాదారుగా పని చేస్తున్న ఆయన ఆ బాధ్యతలను వదులుకుని ఏపీ అసెంబ్లీ సచివాలయంలో చేరారు. ఈ పదవిలో ఏడాదిపాటు ఉంటారని అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇది తాత్కాలిక నియామకమని, ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆయనను ఎప్పుడైనా ఈ పదవి నుంచి తొలగించవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ సచివాలయంలోని సహాయ విభాగాధికారి స్థాయి నుంచి ఇతర అధికారులకు పార్లమెంటరీ విధానాలపై రామాచార్యులు శిక్షణ ఇస్తారని తెలిపారు.


‘ఈనాడు’ వార్తకు స్పందన.. నేటి ఎంబీఏ పరీక్షలు వాయిదా

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే: ఒకే రోజు రెండు పరీక్షల కారణంగా ఆందోళనకు లోనవుతున్న ఎంబీఏ విద్యార్థులకు కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఊరటనిచ్చే నిర్ణయాన్ని వెలువరించింది. ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఉన్న రోజునే యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహిస్తోంది. దీనిపై ‘ఒకే రోజు రెండు పరీక్షలు.. ఆందోళనలో అభ్యర్థులు’ శీర్షికన గురువారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం కంట్రోలర్‌.. శుక్రవారం జరగాల్సిన ఎంబీఏ పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30న జరగాల్సిన పరీక్షలను అక్టోబరు 11న నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


క్యాట్‌-2022కు 2.56 లక్షల మంది దరఖాస్తు

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాల (క్యాట్‌-2022)కు ఈసారి దాదాపు 2.56 లక్షల మంది దరఖాస్తు చేశారు. నవంబరు 27న ప్రవేశ పరీక్ష జరగనుంది. ఐఐఎం బెంగళూరు ఈ పరీక్ష నిర్వహిస్తోంది.


ఆడిట్‌ విభాగంలో విభజించు పాలించు విధానం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆడిట్‌ విభాగం ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ ఆర్‌.హరిప్రకాశ్‌ ఏకపక్ష, నిరంకుశ విధానాలు అనుసరిస్తున్నారని ఆడిట్‌ ప్రభుత్వోద్యోగుల సంఘం ఆరోపించింది. ఆడిటర్‌లను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా వర్గీకరించి విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించింది. జిల్లాల విభజన సందర్భంగా నిబంధనలు పక్కనపెట్టి ప్రొవిజినల్‌ కేటాయించారని ధ్వజమెత్తింది. వీటిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండు చేసింది. 15 రోజుల్లోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమంలోకి వెళ్తామని, ఆడిట్‌ విభాగం రాష్ట్ర డైరెక్టర్‌కు గురువారం నోటీసు అందజేసింది. ఈ మేరకు సంబంధిత సంఘం అధ్యక్షుడు బీవీఎస్‌ రవికుమార్‌ ప్రకటన విడుదల చేశారు.


కారుణ్య నియామకాలపై ఉత్తర్వులు

విధుల్లో ఉంటూ మరణించే గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశాన్ని కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌, రెండు వీఆర్వో సంఘాలు గురువారం తెలిపాయి. డిగ్రీ అర్హత ఉంటే రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌ లేదా తత్పమాన ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారని అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, ఆంజనేయకుమార్‌ చెప్పారు.


పరీవాహక రైతుల ప్రయోజనాలే ముఖ్యం

కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణలో తెలంగాణ సాక్షి పండిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జల వివాదాల ట్రైబ్యునళ్ల కేటాయింపులు ఎలా ఉన్నప్పటికీ నిర్ణీత నదీ పరీవాహకం (బేసిన్‌)లోని రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు, తెలంగాణ తరఫు సాక్షి చేతన్‌ పండిట్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రైబ్యునల్‌ విచారణలో రెండో రోజు గురువారం ఏపీ న్యాయవాది అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ‘‘బేసిన్‌ బయటికి నదీ జలాలు మళ్లిస్తే లోపల ప్రాంతంలో ఉన్న రైతులకు, పంటలకు నష్టం జరుగుతుంది. అది విద్యుదుత్పత్తి ద్వారానా.. ఇంకో రీతిలోనా.. అనేది ఇక్కడ ముఖ్యం కాదు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చకొచ్చిన అంశాలకన్నా తుది నిర్ణయాలకు ప్రాధాన్యం ఉంటుంది. తెలంగాణ ఏర్పడే నాటికే 40 శాతం కృష్ణా జలాలు పరీవాహకం బయటి ప్రాంతానికి మళ్లిస్తున్నారు. ఇలాంటి అసమతుల్య పరిస్థితులే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి దారితీశాయి. అప్పటికే ట్రైబ్యునళ్లు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. రెండు ట్రైబ్యునళ్ల అవార్డులను తాను వ్యతిరేకించడం లేదని, నదీ జలాలకు సంబంధించి అసమతుల్యతను కొంతవరకైనా సరిచేయాలనేది తన అభిప్రాయమని ఈ సందర్భంగా తెలిపారు.

* సెప్టెంబరు 28 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన ట్రైబ్యునల్‌ విచారణ గురువారం ముగిసింది.


వ్యవసాయ కూలీలకూ పరిహారం చెల్లించాల్సిందే
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు

ఈనాడు, అమరావతి: గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు బీడు భూములనిచ్చే రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.30 వేల చొప్పున కౌలు చెల్లిస్తామన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి... వాటిపైనే ఆధారపడి జీవించే వ్యవసాయ కూలీలు, పశుపోషకులు గుర్తుకురాకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ‘అభివృద్ధి పేరుతో వేల ఎకరాల పంట పొలాలను రైతుల నుంచి లాక్కుని అదానీ, అంబానీలాంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి రైతుల నుంచి ఒక్కోచోట 1,500 నుంచి 2వేల ఎకరాలు తీసుకుని యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదం. వేల ఎకరాలు సేకరించే సమయంలో ఆయా భూములపై ఆధారపడి జీవించే వారికీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అమరావతి రైతుల నుంచి సేకరించిన భూములకు ఎలాంటి పరిహారం అందుతుందో... రాజధాని రైతులను చూస్తే అర్ధమవుతోంది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై కేసులు

ఈనాడు, అమరావతి: విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అక్రమంగా నిల్వ చేసిన, అధిక ధరలకు అమ్ముతున్న ఎనిమిది దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 53 దుకాణాల్లో గురువారం సోదాలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై నిత్యావసర చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ శంఖబ్రత బాగ్చీ ఒక ప్రకటనలో తెలిపారు.


టెట్‌లో 58% మందికి అర్హత

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో 58.07% మంది అర్హత సాధించినట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్‌కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను శుక్రవారం నుంచి వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.


బొగ్గు బకాయిల చెల్లింపు వ్యాజ్యం ఉపసంహరణ

ఈనాడు, అమరావతి: కోకింగ్‌ కోల్‌ బొగ్గును సరఫరా చేసినందుకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బకాయిలు చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని టాటా ఎన్‌వైకే షిప్పింగ్‌ సంస్థ ఉపసంహరించుకుంది. ఈ నెల 28న జరిగిన విచారణలో ఆ సంస్థ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బకాయి సొమ్ము చెల్లించినందున వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతించాలని కోరారు. అందుకు హైకోర్టు అంగీకరించింది. ఈ సంస్థ వ్యాజ్యం కారణంగా గంగవరం పోర్టులో విశాఖ ఉక్కుకు చెందిన బొగ్గును జప్తు చేస్తూ ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.


ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మంత్రుల కమిటీ పునరుద్ధరణ

ఈనాడు, అమరావతి: ఒప్పంద ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ, అనుబంధ విషయాలపై అధ్యయానికి మంత్రుల కమిటీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రివర్గంలో మార్పులు చేసినందున దీన్ని పునరుద్ధరించారు. కమిటీలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధన, అటవీ, మైనింగ్‌ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైద్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రి విడదల రజిని, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. సెర్ప్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, వారికి 27% మధ్యంతర భృతి(ఐఆర్‌), కెరీర్‌ అడ్వాన్సుమెంట్‌, పదోన్నతులు, అన్ని కేటగిరీల వారిని సొంత జిల్లాలకు బదిలీలు చేసే అంశాలపై అధ్యయనం చేసి, సిఫార్సులు చేసే బాధ్యతలను మంత్రుల కమిటీకి అప్పగించారు.


రైతులను అవమానించడం తగదు
ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం ధ్వజం

ఈనాడు, అమరావతి: బాపట్ల జిల్లా కొల్లూరులో పంట రుణాల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కేసులు పెట్టి, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, కార్యదర్శి ఎం.హరిబాబు తెలిపారు. చట్టప్రకారం రుణాలివ్వని అధికారులపై కేసులు పెట్టాలన్నారు. రైతులు ఆందోళన చేసే రహదారిలోనే మంత్రి ప్రయాణిస్తుండటంతో.. ఆయన మెప్పు కోసమే హడావుడిగా పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని రుణాలు ఇప్పించాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండు చేశారు.


పోలీసు జూడో పోటీల విజేతలకు అభినందనలు

ఈనాడు, అమరావతి: దిల్లీలో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన ఏడో జాతీయ పోలీసు జూడో క్లస్టర్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఏపీ పోలీసులను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం తన కార్యాలయంలో అభినందించారు. ఎస్‌.ఫరాహతుల్లా, ఎస్‌.మహుబూబ్‌ బాషా(నంద్యాల), డీఎన్‌వీ రత్నంబాబు(ప్రకాశం), ఏ.శ్రావణి(నెల్లూరు), పి.కల్పన(కర్నూలు), షంషేర్‌(చిత్తూరు)లను అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు.


పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లకు మార్గదర్శకాలు

ఈనాడు, అమరావతి: పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి 2022ఏడాదికి ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి మార్గదర్శకాలను వెల్లడించింది. ఈ విద్యుత్‌ సంస్థల నుంచి మస్ట్‌రన్‌ విధానంలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ అంతా డిస్కంలు తీసుకోవాలని తెలిపింది. దీనికి ధర్మల్‌ విద్యుత్‌ను కలిపి బండిల్డ్‌ పవర్‌ విధానంలో తీసుకోవాలని సూచించింది. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి పలు నిబంధనలను పేర్కొంది. వీటిని విద్యుత్‌ పంపిణీ లైసెన్సులున్న సంస్థలన్నీ పాటించాలని తెలిపింది.


‘ప్రైవేటీకరణలో భాగమే  విద్యుత్‌ బస్సుల ప్రాజెక్టు’

ఈనాడు, అమరావతి: ఆర్టీసీ ప్రైవేటీకరణలో భాగంగానే విద్యుత్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారని స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఆర్టీసీయే ఈ విద్యుత్‌ బస్సులు నడపాలని కోరింది. సాధారణంగా ఆర్టీసీలో అద్దె బస్సుల విధానమంటే... కొందరు యజమానులు కంపెనీల నుంచి బస్సులు కొని, నడుపుతుంటారని తెలిపింది. విద్యుత్‌ బస్సుల విషయంలో కంపెనీయే నడుపుతోందన్నారు. ప్రతి వంద బస్సులకు 500 మంది ఆర్టీసీ ఉద్యోగాలకు ఎసరు కలిగినట్లేనని ఆందోళన వ్యక్తంచేసింది.


ఎన్‌ఎంఎంఎస్‌కు దరఖాస్తుల స్వీకరణ 30 నుంచి

ఈనాడు, అమరావతి: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ ఉపకార వేతనాల పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌)కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఈనెల 30 నుంచి అక్టోబరు 31 వరకు స్వీకరిస్తామన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, పరీక్ష రుసుము ఓసీ, బీసీలకు రూ.100, ఎస్సీ, ఎస్టీలకు రూ.50గా నిర్ణయించినట్లు తెలిపారు.


అతిథి అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని అతిథి అధ్యాపకుల సర్వీసు రెన్యువల్‌కు అనుమతిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వృత్తి విద్యాధికారి, కళాశాల ప్రిన్సిపల్‌, ఆయా సబ్జెక్టుల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, రెన్యువల్‌ చేయాలని సూచించారు.


సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ఐద్వా

ఈనాడు, అమరావతి: వివాహ బంధంతో సంబంధం లేకుండా అబార్షన్‌ హక్కుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి తెలిపారు. దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో మహిళలు రక్షణ, వైద్య పర్యవేక్షణ లేని అబార్షన్ల కారణంగా చనిపోతున్నారని చెప్పారు. అవాంఛిత గర్భాలను తొలగించుకోవడానికి సుప్రీంతీర్పు ముందడుగుగా అభివర్ణించారు. వివాహ బంధంలోనూ బలవంతపు లైంగిక చర్యను అత్యాచారంగా పరిగణించాలన్నారు.


ఏపీఐఐసీ ఎండీగా నారాయణ భరత్‌గుప్తాకి అదనపు బాధ్యత

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ఛైర్మన్‌, ఎండీగా పనిచేస్తున్న అస్సాం కేడర్‌ ఐఏఎస్‌ అధికారి జె.వి.ఎన్‌.సుబ్రహ్మణ్యం గురువారం ఆ పోస్టు నుంచి రిలీవయ్యారు. డిప్యుటేషన్‌ గడువు ముగియడంతో ఆయన అస్సాం కేడర్‌కు తిరిగి వెళుతున్నారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్న నారాయణ భరత్‌గుప్తాకి ఏపీఐఐసీ వీసీ, ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పరీక్ష ‘కీ’ విడుదలకు డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌-2) పరీక్షలకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేయాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పరీక్ష రాసిన వారందరి మార్కులు తెలిసేలా, పేరు, రిజర్వేషన్‌, వచ్చిన మార్కులతో కూడిన జాబితాను విడుదల చేయాలన్నారు. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌తోపాటు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని