ఈఎస్‌ఐలో వైద్యం ఇష్టారాజ్యం!

పేరుకు అవి కార్మికుల రాజ్య బీమా కేంద్రాలు. కానీ వైద్యం విషయంలో అక్కడంతా ఇష్టారాజ్యమే కొనసాగుతోంది. కార్మికుల వైద్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది.

Published : 30 Sep 2022 03:18 IST

అన్నిచోట్లా మందుల కొరతే

కిట్లు లేక అందని ఆరోగ్య పరీక్షలు

ఎక్స్‌రేలకూ తప్పని ఇబ్బంది

ఔషధ కంపెనీలకు బకాయిలు

ఈనాడు, అమరావతి, ఈనాడు, యంత్రాంగం: పేరుకు అవి కార్మికుల రాజ్య బీమా కేంద్రాలు. కానీ వైద్యం విషయంలో అక్కడంతా ఇష్టారాజ్యమే కొనసాగుతోంది. కార్మికుల వైద్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో ఔషధాల కొరత వేధిస్తోంది. మందుల సరఫరా కంపెనీలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని కంపెనీలకు ఇండెంట్‌ పెట్టినా స్పందించడంలేదు. యాంటిబయోటిక్‌, పెయిన్‌కిల్లర్‌, గ్యాస్ట్రిక్‌, గుండె సంబంధిత వ్యాధుల ఔషధాలు రోగులకు సరిపడా లేని దుస్థితి. డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో హర్మోన్ల పరీక్షలు తప్ప మిగిలిన అన్నింటినీ చేయాల్సి ఉన్నా ఎక్స్‌రేలకే దిక్కులేకుండా పోయింది. ఈ తీరుపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా... ఆందోళన కలిగించే విషయాలు వెల్లడయ్యాయి.

కేంద్రం నిధులిస్తున్నా...
రాష్ట్రవ్యాప్తంగా 12.69 లక్షల మంది ఈఎస్‌ఐ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.2,750 చొప్పున రాష్ట్రానికి కేంద్రం నిధులిస్తోంది. దీనికి ఒక శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి ఈఎస్‌ఐ సేవలందించాలి. కేంద్రం వాటా క్రమం తప్పకుండా వస్తున్నా కార్మికులకు సరైన వైద్యం అందడం లేదు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈఎస్‌ఐలో వైద్యసిబ్బంది అరకొరగా ఉన్నారు. బీసీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌, జ్వరం వంటి వాటికి కూడా పూర్తిస్థాయిలో ఔషధాలు అందుబాటులో లేవు. ఇటీవల రూ.2.30 కోట్ల ఔషధాలకు ఇండెంట్‌ పెడితే వాటిలో సగమే వచ్చాయి.

* విశాఖపట్నం ఆస్పత్రిలో స్కానింగ్‌ సమస్య ఉంది. విజయవాడలో టీటీ ఇంజక్షన్ల కొరత నెలకొంది.

* తిరుపతి ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేసిన రోగులకు వాపు తగ్గేందుకు ఇచ్చే మందులు లేవు. 100 ఎం.ఎల్‌. సెలైన్‌ బాటిళ్ల కొరత నెలకొంది. ఆస్పత్రిలో మూడు నెలలకు రూ.రెండు లక్షల చొప్పున అవసరమైన మందులను బయట మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ థైరాయిడ్‌ తదితర కీలకమైన పరీక్షలు చేయడం లేదు.

* సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ, శ్రీసిటీ, మాంబట్టు సెజ్‌ తదితర ప్రాంతాల పరిశ్రమల్లో పనిచేస్తున్న 70 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం సూళ్లూరుపేటలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా 2010లో డయాగ్నొస్టిక్‌ కేంద్రం ప్రారంభించారు. కొన్నేళ్లుగా ఎక్స్‌రే, రక్త పరీక్షలకు తిరుపతికి సిఫార్సు చేస్తున్నారు. మందులూ అరకొరగానే ఉంటున్నాయి. ఇక్కడ 13 మంది వైద్య నిపుణులు, నలుగురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు పని చేయాల్సి ఉండగా... చిన్న పిల్లల వైద్యుడు, సివిల్‌ అసిస్టెంట్‌ మాత్రమే ఉన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని