రెండేళ్లలోగా వచ్చేవి ఐదే!

రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 8 తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే ఉన్నాయి. వైఎస్‌ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడపలో 3 ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి. ఇపుడు ఆయన

Published : 30 Sep 2022 03:18 IST

కొత్త వైద్య కళాశాలలపై రాష్ట్ర ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే

రాష్ట్రంలో ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 8 తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే ఉన్నాయి. వైఎస్‌ హయాంలో ఒంగోలు, శ్రీకాకుళం, కడపలో 3 ప్రభుత్వ కళాశాలలు వచ్చాయి. ఇపుడు ఆయన కుమారుడి ఆధ్వర్యంలోని వైకాపా ప్రభుత్వంలో మరో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నాం. మొత్తం 28లో 20 కళాశాలల్ని మేమే కట్టాం. కడుతున్నాం. అలాంటపుడు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనటం న్యాయమేనా?

- శాసనసభలో ఈ నెల 21న సీఎం జగన్‌

కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు. కానీ శాసనసభలో ఆయన చెప్పినట్లు 17 కొత్త వైద్య కళాశాలలూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వచ్చే అవకాశం లేదు. ఐదు మాత్రమే వస్తాయి. మిగిలిన 12 కళాశాలలు రావాలంటే 300 పడకలతో అనుబంధ ఆసుపత్రులు ఏర్పాటై తప్పనిసరిగా మూడేళ్లపాటు నడవాలి. వాటి నిర్మాణాలు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సిద్ధమైనప్పటికీ.. వాటిలో తరగతులు ప్రారంభించాలంటే.. 2026 లేదా 2027 వరకు సమయం పడుతుంది. అదికూడా ప్రణాళిక ప్రకారం జరిగితేనే సాధ్యమవుతుంది. ఈలోపు ప్రస్తుత జగన్‌ ప్రభుత్వ పదవీకాలం 2024 మార్చి లేదా ఏప్రిల్‌తో ముగుస్తుంది.

ఈనాడు, అమరావతి: కొత్తగా వైద్య కళాశాలల స్థాపనలో అనేకరకాల సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా నిధుల సంక్షోభం వెంటాడుతోంది. వాటి ఏర్పాటుకు 7,880 కోట్లు అవసరమవుతాయి. ఆ నిధుల గురించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. కొత్తగా ప్రకటించిన 17 కళాశాలల్లో ఐదింటికి మాత్రమే కేంద్రం నుంచి నిధులకు ఆమోదం లభించింది. బ్యాంకులు, నాబార్డు ద్వారా రుణాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఏదోలా వచ్చేస్తాయన్న ఉద్దేశంతో నిర్మాణాలు ప్రారంభించినా.. నిధుల లభ్యతను బట్టి మాత్రమే ఇవి వేగాన్ని అందుకుంటాయి. నిధులు పొందే మార్గాలపై స్పష్టత లేకుండానే 17 కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం కొత్తగా ప్రకటించినవాటిలో ఐదు కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచే ప్రవేశాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతి లభించే వరకు చెప్పలేని పరిస్థితి. నవంబరు లేదా డిసెంబరులో ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలు జరిపి, నిర్మాణాల పట్ల సంతృప్తి చెంది, ఆమోదం తెలిపే వరకు ప్రవేశాల ప్రారంభంపై సస్పెన్స్‌ తప్పదు. ఇపుడు సాధ్యం కాకుంటే 2024-25లోనే తరగతులు ప్రారంభమవుతాయి. నంద్యాల, మచిలీపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరంలో జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మార్చే పనులు యుద్ధప్రాతిపాదికన జరిగితేనే యూజీలో 150 చొప్పున 750 సీట్లు ఎన్‌ఎంసీ కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

ఆసుపత్రులు పూర్తయ్యేదెప్పుడు?
పులివెందుల, పాడేరు, అనకాపల్లి, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, మార్కాపురం, పెనుకొండ, మదనపల్లి, ఆదోని, పార్వతీపురంలో వైద్య కళాశాలలు రావాలంటే అక్కడ 300 పడకలతో రోగులకు నిరాంటకంగా మూడేళ్లపాటు చికిత్స అందించాలి. అలాగే.. 30 పడకలు ఎమర్జెన్సీ విభాగంలో ఉండాలి. 300 పడకల అవసరాలకు తగ్గట్లు వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు సమకూరాలి. వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాలు జరగాలి. 300 పడకలకు తగ్గట్లు నిర్మాణాలు జరిగేందుకు వచ్చే ఏడాది డిసెంబరు వరకు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. పులివెందుల, పాడేరు, అనకాపల్లి నిర్మాణాల పనుల్లో కాస్త పురోగతిలో ఉండగా.. మిగిలినచోట్ల పనులు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. అనకాపల్లిలో స్థల సమస్య రావడంతో నర్సీపట్నానికి మార్చారు. ప్రభుత్వం ప్రకటించినట్లు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తయి, మూడేళ్లపాటు 300 పడకలతో ఆసుపత్రులు కొనసాగితేనే ఎంబీబీఎస్‌లో తరగతుల ప్రారంభానికి దరఖాస్తు చేసేందుకు వీలుంటుంది.

సంకట స్థితిలో బ్యాంకులు
ప్రభుత్వం మాత్రం ఏకకాలంలో 17 వైద్య కళాశాలలు ప్రారంభించేలా హడావుడి చేస్తోంది. కొత్తవాటి ఏర్పాటు, ప్రస్తుత బోధనాసుపత్రుల అభివృద్ధికి కలిపి రూ. 11,700 కోట్లు కావాలి. ఇంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ప్రతిపాదించిన రీపేమెంట్‌ విధానం సంతృప్తికరంగా లేనందున అవి రుణాలు ఇచ్చేందుకు సంశయిస్తున్నాయి. నిధుల సంక్షోభం కారణంగా ఈ నిర్మాణాలు ఎంతవరకు సాఫీగా జరుగుతాయో సంబంధిత వర్గాలు చెప్పలేకపోతున్నాయి. రీపేమెంట్‌ విధానంలో కొత్త వైద్య కళాశాలల్లో ‘బి’ కేటగిరి సీట్లకు ఫీజులు వసూలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. బ్యాంకులు మాత్రం సంకటస్థితిలో ఉన్నాయి. జాతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం ఆసుపత్రులు నడిపి, మౌలిక సదుపాయాలు కల్పించి యూజీలో సీట్ల కేటాయింపు కోసం దరఖాస్తు చేస్తేనే ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీల కోసం రాష్ట్రానికి వస్తాయి. అప్పటివరకు ఇక్కడ జరిగే నిర్మాణాలతో ఎన్‌ఎంసీకి సంబంధం ఉండదు.

కేంద్రం నుంచి మూడింటికే సాయం?
ఒక్కో కొత్త కళాశాల ఏర్పాటుకు రూ. 7,880 కోట్లు అవసరమవుతాయి. నాబార్డు నుంచి దశలవారీగా నిధుల రాక మొదలైంది. ప్రస్తుత కళాశాలలు, బోధనాసుపత్రుల అభివృద్ధికి మరో రూ. 3,820 కోట్లు అవసరం అవుతున్నాయి. కేంద్రం నుంచి వివిధ రకాల పద్దుల కింద నిధులు పొందేందుకు ప్రభుత్వం  ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం కళాశాలలకు రూ. 195 కోట్ల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొంతమేర నిధులు వచ్చాయి. ఇవికాకుండా పాలకొల్లు, బాపట్ల, మదనపల్లి, పెనుకొండ, నర్సీపట్నం, మార్కాపురం, ఆదోనిలో కళాశాలలకు కూడా ఆర్థిక సాయం అందచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కొత్త జిల్లాల దృష్ట్యా ఆర్థిక సహకారం అవసరమని ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు