డిసెంబరు 21కల్లా ఐదు లక్షల ఇళ్లు

రాష్ట్రంలో డిసెంబరు 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షల ఇళ్లు, 1.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం

Published : 30 Sep 2022 06:39 IST

నిర్మాణ లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం

20 రోజుల్లో ఇళ్ల స్థలాల ఆడిటింగ్‌ పూర్తవ్వాలి

గ్రామ, వార్డు సచివాలయాల్లో మంజూరు చేసిన పనుల్ని నెల రోజుల్లో ప్రారంభించాలి

స్పందనపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు

ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో డిసెంబరు 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షల ఇళ్లు, 1.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేనాటికే విద్యుత్‌, తాగునీరు, మురుగునీటిపారుదల కాలువ సదుపాయాలు కల్పించాలని నిర్దేశించారు. మిగిలిపోయిన లబ్ధిదారులకు ఫేజ్‌-3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విశాఖపట్నంలో కేటాయించిన 1.24 లక్షల ఇళ్ల నిర్మాణం అక్టోబరు నాటికి మొదలయ్యేలా చూడాలని సూచించారు. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిటింగ్‌ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో పూర్తవ్వాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సమీక్షించారు. స్పందనపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు, సూచనలివీ..

మంజూరైన నెల రోజుల్లో పనులు మొదలవ్వాలి
గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన పనుల్ని నెల రోజుల్లోగా ప్రారంభించాలి. మొత్తం 15,004 గ్రామ/ వార్డు సచివాలయాల్నీ ఈ కార్యక్రమం కింద కవర్‌ చేస్తున్నాం. ఒక్కో గ్రామ/వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నాం. ఆ పనుల్లో ఎలాంటి ఆలస్యానికి, అలసత్వానికి తావివ్వద్దు. ఎమ్మెల్యే, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది నెలలో కనీసం ఆరు సచివాలయాల్ని సందర్శించాలి. ఒక్కో సచివాలయం పరిధిలో ఎమ్మెల్యే కనీసం రెండు రోజులపాటు కార్యక్రమంలో పాల్గొనాలి. రోజులో కనీసం ఆరు గంటలపాటు కార్యక్రమం నిర్వహించాలి. ఇప్పటికే కార్యక్రమం జరిగి పనులు మంజూరు చేయనిచోట అక్టోబరు 5లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఈ-క్రాప్‌ నమోదు నూరు శాతం జరగాలి
నూటికి నూరుశాతం ఈ-క్రాప్‌ నమోదు పూర్తి చేయాలి. ఈ సీజన్‌లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా.. 96 శాతం ఈ-క్రాపింగ్‌ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 4శాతాన్ని శుక్రవారానికి పూర్తి చేయాలి. రైతుల్ని పొలాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకుని, వివరాలు నమోదు చేసే ప్రక్రియ శుక్రవారానికి పూర్తవ్వాలి. రెండో దశ కింద అక్టోబరు 3లోగా గ్రామ వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు బయోమెట్రిక్‌ ద్వారా వాటిని అధీకృతం చేయాలి. అక్టోబరు 10లోగా కేవైసీలు పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి 15లోగా రైతులకు ఈ-క్రాప్‌లో రశీదులివ్వాలి. 15 నుంచి సోషల్‌ ఆడిట్‌ చేయాలి. 25నుంచి వారంపాటు తుది జాబితాను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1నుంచి పోర్టళ్లలో అందుబాటులో ఉంచాలి.

ఉపాధి పనులకు సగటు వేతనం పెరగాలి
ఉపాధి హామీ పనులకు ఇప్పటి వరకు సగటు వేతనం రూ.210.02గా ఉంది. కనీసం రూ.240 వేతనం అందాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,400 కోట్ల బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే విడుదల చేస్తాం. ఇప్పటి వరకు 17.05 కోట్ల పనిదినాలు సృష్టించడం అభినందనీయం.

* 4,500 గ్రామ సచివాలయాలకు డిసెంబరులోగా కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ సౌకర్యం అందుతుంది. అక్కడ డిజిటల్‌ లైబ్రరీలు పూర్తి చేయాలి.

* భూహక్కు-భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటి వరకు 5,738 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లైయింగ్‌ పూర్తయింది. 2,662 గ్రామాలకు సంబంధించిన ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదల చేశాం.

అర్జీదారుతో సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేయాలి
స్పందనలో వచ్చే అర్జీల పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారుకు ఫోన్‌ ద్వారా తెలియజేయాలి. అర్జీదారుతో లొకేషన్‌లో సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహించాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి.

* సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. వీటిలో సాధించిన పురోగతి ఆధారంగా కలెక్టర్ల పనితీరు, సమర్థతను నిర్ణయిస్తాం.

* ప్రతి ఇంట్లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు మాక్‌కాల్స్‌ చేసి దిశ పనితీరును పర్యవేక్షించాలి.

* ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నెంబర్‌ 14400 ఉన్న పోస్టర్‌ అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలి. ఆ పోస్టర్‌ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ముఖ్య అధికారిని బాధ్యుణ్ని చేయండి.

* బెంగళూరు- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే సహా వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూసేకరణపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలి.

* అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత విడుదల చేస్తున్నాం. అదే రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇస్తున్నాం. వసతి దీవెన నవంబరు 10న విడుదల చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని