తెదేపా హయాంలో నమోదైన ఏసీబీ కేసుల పునస్సమీక్ష

రాష్ట్రంలో తెదేపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ నమోదు చేసిన కేసులన్నింటినీ (రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ట్రాప్‌ కేసులు మినహా) పునస్సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం

Updated : 30 Sep 2022 05:50 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తెదేపా హయాంలో ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ నమోదు చేసిన కేసులన్నింటినీ (రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ట్రాప్‌ కేసులు మినహా) పునస్సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్‌ విభాగం ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితోపాటు ఆయా కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు సంబంధించిన శాఖల కార్యదర్శులను కమిటీలో సభ్యులుగా నియమించింది. కేసులు పరిశీలించి వాటి పరిష్కారానికి సరైన, సాధ్యమైన మార్గం సూచించాలని ఆదేశించింది. కమిటీ నిర్ణయం నియమ నిబంధనలకు లోబడి.. విజిలెన్స్‌ స్కీమ్‌కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఈ నెల 21న ఇచ్చిన ఆదేశాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై 2014-19 మధ్య రాష్ట్ర స్థాయి ఉద్యోగులు పలువురిపై కేసులు నమోదయ్యాయి. వారిలో కొందరు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.వంద కోట్లకుపైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు. ఈ కేసులన్నింటినీ ఉన్నత స్థాయి కమిటీ ఇప్పుడు సమీక్షించనుంది. ‘2014 నుంచి 2019 మధ్య పలువురు ప్రభుత్వోద్యోగులు వేధింపులకు గురయ్యారు. వారిని తప్పుడు పద్ధతుల్లో ఏసీబీ కేసుల్లో ఇరికించారు. వారికి న్యాయం చేసేందుకు సీనియర్‌ ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు చేయండి’ అంటూ 2019 అక్టోబరు 14న ఒకసారి, 2020 ఫిబ్రవరి 18న మరోసారి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. కమిటీని ఏర్పాటు చేసి, కేసులను పునఃపరిశీలిస్తామని 2019 డిసెంబరు 10న రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌తోపాటు సలహామండళ్ల సలహాలు తీసుకుని ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అని సమీర్‌శర్మ ఉత్తర్వుల్లో వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు