Polavaram: ఉమ్మడి సర్వేకు పట్టు

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపుపై సమగ్ర అధ్యయనం అవసరమని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలు

Updated : 30 Sep 2022 06:48 IST

పోలవరంపై కేంద్రాన్ని కోరిన పొరుగు రాష్ట్రాలు

ముంపుపై ఇప్పటికే శాస్త్రీయ అధ్యయనం జరిగింది: కేంద్రం

ఎంత వరదొచ్చినా కిందకు వెళ్లేలా నిర్మాణం: ఆంధ్రప్రదేశ్‌

పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే తీవ్ర నష్టం: తెలంగాణ

అభిప్రాయాలు చెప్పిన ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా

4 రాష్ట్రాలతో కేంద్ర జల్‌శక్తిశాఖ ఆన్‌లైన్‌లో భేటీ

7న సాంకేతిక సమావేశం నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాల ముంపుపై సమగ్ర అధ్యయనం అవసరమని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. ప్రభావిత రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి సర్వే నిర్వహించాలని కేంద్రాన్ని కోరాయి. అయితే ట్రైబ్యునల్‌ అవార్డు మేరకే ముంపును పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం జరుపుతున్నట్లు ఏపీ పేర్కొంది. ముంపుపై ఇప్పటికే శాస్త్రీయ అధ్యయనం జరిగిందని, ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో ఎక్కువ సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్నందున వచ్చే నెల ఏడో తేదీన సాంకేతిక సమావేశం నిర్వహిస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌, అటవీ పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ గుప్తా ఆధ్వర్యంలో నాలుగు భాగస్వామ్య రాష్ట్రాలతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, ఓ అండ్‌ ఎం ఈఎన్‌సీ నాగేందర్‌ రావు, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్‌, ఏపీ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌రెడ్డితో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల జల వనరులశాఖల అధికారులు పాల్గొన్నారు. డిసెంబరు 7న సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసు తదుపరి విచారణకు రానుంది. ఆలోగా రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి ఒక నివేదిక సమర్పించేందుకు కేంద్రం కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్‌ ఐఐటీ నివేదిక ప్రకారం పోలవరంలో బ్యాక్‌ వాటర్‌ సమస్య ఉంటుందని తేలిందని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. ఐఐటీ నివేదిక ప్రామాణికం కాదని, కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించిన నివేదికే ప్రామాణికమని జల సంఘం అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు కారణంగా ముంపు సమస్య ఉండదని అధ్యయనంలో తేలిందని కేంద్ర జల సంఘం సభ్యుడు ఖుష్విందర్‌ వోహ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్‌ తెలిపారు. భారీ స్థాయిలో వరద వచ్చినా కిందకు వెళ్లేలా పోలవరం నిర్మాణం జరుగుతోందని కేంద్ర జలసంఘం, ఆంధ్రప్రదేశ్‌ జల వనరులశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోసారి అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలు సరికాదు: కేంద్రం
వచ్చే నెల 7న దిల్లీలో నిర్వహించే సమావేశానికి రాష్ట్రాల నుంచి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లను పంపాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2009, 2011లో శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయని, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు పలు అపోహలు ఉన్నాయని తెలిపింది. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలు సరికాదని తెలిపింది. కరకట్ట నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధంగా ఉందని పేర్కొంది. ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాకపోవడంతోనే గతంలో సాధ్యపడలేదని స్పష్టం చేసింది. సాంకేతిక సమావేశం అనంతరం ఒడిశాలో పూర్తి స్థాయిలో, ఛత్తీస్‌గఢ్‌లోనూ నిలిచిపోయిన చోట్ల ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని పేర్కొంది.

మారిన పరిస్థితులకు అనుగుణంగా అధ్యయనం: తెలంగాణ
ప్రాజెక్టు స్పిల్‌వే డిజైన్‌లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ పేర్కొంది. ‘24 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే పంట పొలాలతో పాటు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏమిటి? దీనిపై ఇప్పటికే కేంద్రానికి సమగ్ర వివరాలతో ఒక లేఖ కూడా రాశాం. 50 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకుని వెనుక జలాల ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ప్రాజెక్టు పూర్తయ్యాక నీటిని నిల్వ చేసిన సమయంలో వచ్చే వరదలకు భద్రాచలం టెంపుల్‌ టౌన్‌, భార జల కర్మాగారం, భద్రాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, గిరిజన గ్రామాలతో పాటు అనేక ప్రాంతాలు ముంపుబారిన పడతాయి. వెనుక జలాల తీవ్రత ఉన్న పలు ప్రాంతాల్లో క్రాస్‌ సెక్షన్లు (ప్రొటెక్షన్‌ వర్క్స్‌) నిర్మించాల్సి ఉంటుంది. కుడి, ఎడమల నుంచి నదిలోకి 18 వాగులు వచ్చి కలుస్తాయి. గోదావరిలో నీటి మట్టం ఎక్కువ ఉన్న సమయంలో ఇవి పోటెత్తి ముంపు పెరుగుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పారామీటర్స్‌, సమాచార (డేటా) బట్వాడాలో పారదర్శకత ఉండాలి’ అని తెలంగాణ పేర్కొంది.

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే చేపట్టాలి: ఒడిశా
తమ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఒడిశా సూచించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రాజెక్టు వెనుక ముంపు ప్రాంతంలో 30 కిలోమీటర్లు ప్రొటెక్షన్‌ వర్క్స్‌ చేపడుతుండటం సాధారణమైన విషయం కాదని పేర్కొంది. సాంకేతిక సమావేశం అనంతరం మూడు నెలల్లోనే ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని కేంద్రం ప్రకటించడం ఆమోదయోగ్యం కాదని, మరికొంత గడువు తీసుకోవాలని సూచించింది. ముంపు ప్రాంతాలపై తమ రాష్ట్ర పరిధిలోనూ అధ్యయనం చేయాలని, పూర్తి స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని ఛత్తీస్‌గఢ్‌ కోరింది.


ఎలాంటి ఇబ్బందీ ఉండదు: ఏపీ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపు సమస్య, బ్యాక్‌ వాటర్‌తో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతాల్లో ఇబ్బంది ఉండదని ఏపీ అధికారులు పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంలో ప్రాజెక్టు నిర్మించుకునేందుకు అనుమతులున్నాయి. 500 ఏళ్లకు ఒకసారి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని, ఆ సామర్థ్యంతో వరద వచ్చినా ప్రవాహాలు ఆటంకం లేకుండా కిందకు వెళ్లేలా ప్రాజెక్టు ఆకృతులు రూపొందించాం. బ్యాక్‌ వాటర్‌ సమస్య పరిష్కారానికి ఛత్తీస్‌గడ్‌, ఒడిశా పరిధిలోని ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని వివరించారు. ప్రజాభిప్రాయం సేకరించాలని, దానికి సంబంధిత రాష్ట్రాల స్పందన కొరవడిందని పేర్కొన్నారు. దీనిపై వందల సంఖ్యలో లేఖలు రాశామన్నారు. ‘పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు వచ్చిందనేది సరికాదు. ప్రాజెక్టు నిర్మించకముందు ఏ స్థాయిలో నీరు నిలుస్తుందో.. నిర్మాణం తర్వాతా అంతేస్థాయిలో నిలుస్తుంది. అదే వరదకు అదే స్థాయిలో నీటిమట్టం ఉంటుంది. మార్పు ఉండదు, పోలవరం వల్లే ముంపు వస్తుందనేది సరికాదు. ఇంద్రావతి, శబరి వరద కారణంగా గతేడాది వరద తీవ్రత పెరిగింది. ఈ ఏడాదీ అందుకే ప్రభావం అధికంగా ఉంది’ అని ఏపీ అధికారులు చెప్పారు.


* పోలవరం ముంపుపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ దిల్లీలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొనే బృందాన్ని నీటిపారుదల శాఖ ఎంపిక చేసింది. శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా ఓ అండ్‌ ఎం ఈఎన్‌సీ నాగేందర్‌ రావు, సీఎంఓ ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్‌రెడ్డి, అంతరాష్ట్ర జల వనరుల విభాగం ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్‌ సభ్యులుగా ఉండనున్నారు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని