అంకబాబుకు నోటీసివ్వబోతే తీసుకోలేదు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీసివ్వబోతే

Published : 30 Sep 2022 04:59 IST

ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు

కోర్టు షోకాజ్‌ నోటీసుకు సీఐడీ సమాధానం

గుంటూరు లీగల్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఫార్వర్డ్‌ చేశారని సీనియర్‌ పాత్రికేయుడు కొల్లు అంకబాబుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీసివ్వబోతే ఆయన తీసుకోలేదని.. ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని తొలగించేందుకు ప్రయత్నించారని సీఐడీ అధికారులు గురువారం గుంటూరు ఆరో అదనపు ఇన్‌ఛార్జి కోర్టుకు తెలియజేశారు. దీనిని తమ సిబ్బందితోపాటు అంకబాబు కారు డ్రైవర్‌ కూడా చూశాడన్నారు. విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. అంకబాబుకు 41ఏ నోటీసు ఇవ్వకుండా ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ ఈ నెల 23న కోర్టు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సమాధానంగా సీఐడీ సీఐ ఎస్‌.జగదీష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అంకబాబుకు 41ఏ నోటీసు ఇవ్వకుండా సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్‌కు ఇవ్వాలంటూ ఈ నెల 23న గుంటూరు ఆరో అదనపు ఇన్‌ఛార్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి తిరస్కరించి, ఆయనకు బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సీఐడీ సీఐ జగదీష్‌ సమాధానమిచ్చారు. ‘తనపై ఎలాంటి కేసులు లేవని అంకబాబు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ ఆయనపై వివిధ స్థాయిల్లో 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసుల్లో సీబీఐ అరెస్టు చేసిన నిందితులకు ఏడేళ్లలోపే శిక్షపడే సెక్షన్లు ఉన్నప్పటికీ వారికి కోర్టు రిమాండ్‌ విధించింది. అంకబాబు తనకున్న రాజకీయ పలుకుబడితో కేసు దర్యాప్తునకు ఆటంకాలు కలిగించడంతో అరెస్టు చేసి రిమాండ్‌ విధించాలని కోరాల్సి వచ్చింది’ అని సీఐ పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. తనపై చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఇకపై పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితంగా 41ఏ నోటీసుల నిబంధనను అమలు చేయాలని ఆదేశిస్తూ.. షోకాజ్‌ నోటీసును ముగించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts