చింతపల్లి ఎంపీపీపై అనర్హత వేటు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావుపై అనర్హత వేటు పడింది. ఆయన ఎంపీటీసీ, ఎంపీపీ పదవులను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల

Published : 30 Sep 2022 04:59 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావుపై అనర్హత వేటు పడింది. ఆయన ఎంపీటీసీ, ఎంపీపీ పదవులను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయని ఎంపీడీవో సీతయ్య తెలిపారు. బాబూరావు చింతపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌-3 నుంచి వైకాపా తరఫున గెలుపొందారు. ఆయనపై గతంలో పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, వాటిని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచలేదంటూ సొంత పార్టీకే చెందిన తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనూషాదేవి పాడేరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సబ్‌కలెక్టర్‌ విచారణ చేపట్టి అప్పటి ఉమ్మడి జిల్లా విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునకు నివేదిక పంపగా ఆయన దాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఆయనపై చర్యలు చేపట్టారు. తదుపరి చింతపల్లి ఎంపీపీగా కోరాబు అనూషాదేవిని నియమిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది జరిగిన ఎంపీపీ ఎన్నికలో వైకాపా అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా బాబూరావు నామినేషన్‌ వేశారు. అదే పార్టీకి చెందిన ఇద్దరు పోటీపడగా లాటరీలో ఆయనకు పదవి వరించింది. అప్పటినుంచి పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. పాడేరు ఎమ్మెల్యే నిర్ణయానికి వ్యతిరేకంగా తాను ఎంపీపీగా ఎన్నికవడంతోనే కక్ష కట్టి కుట్రలు చేశారని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని